సమష్టి పోరుతోనే ఉగ్ర నిర్మూలన | Prime Minister Narendra Modi Meet With Netherland Prime Minister Mark Rutte | Sakshi
Sakshi News home page

సమష్టి పోరుతోనే ఉగ్ర నిర్మూలన

Published Fri, May 25 2018 3:03 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Prime Minister Narendra Modi Meet With Netherland Prime Minister Mark Rutte - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాలని భారత్, నెదర్లాండ్స్‌ పిలుపునిచ్చాయి. ఉగ్రవాదుల ప్రాబల్యం, ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి, సీమాంతర ఉగ్రవాద నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రూట్‌ గురువారం ప్రధాని మోదీతో చర్చలు జరిపారు మతం, జాతి, తెగ, వర్గాలతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టొద్దని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు. పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు దక్షిణాసియాలో శాంతికి ముప్పుగా పరిణమించాయని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. అణు సరఫరా బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వానికి నెదర్లాండ్స్‌ మద్దతిస్తుందని రూట్‌ తెలిపారు.  

మన బంధం మరింత బలపడాలి..
వాణిజ్యం, వ్యవసాయం, ఇంధన వనరులు తదితర రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నెదర్లాండ్స్‌ నిర్ణయించాయి. ఇండియా–డచ్‌ సీఈవోల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నాక మోదీ, రూట్‌ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ‘అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలని నెదర్లాండ్స్‌ను గతంలోనే ఆహ్వానించాను. గురువారం వారు అందులో సభ్య దేశంగా చేరారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’ అని మోదీ అన్నారు. భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్‌ మూడో స్థానానికి చేరిందని వెల్లడించారు. భారత్‌లో కల్పిస్తున్న కొత్త అవకాశాల పట్ల డచ్‌ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని నరేంద్ర మోదీ అన్నారు. రూట్‌ మాట్లాడుతూ..వాణిజ్యం, వ్యవసాయం, స్మార్ట్‌ సిటీస్, ఇంధన వనరుల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయని అన్నారు. ద్వైపాక్షిక భేటీ తరువాత విడుదలైన ఉమ్మడి ప్రకటనలో..పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల అభివృద్ధిలో ప్రైవేట్‌ రంగ పాత్ర కీలకంగా మారిందని మోదీ, రూట్‌ పేర్కొన్నారు.  

‘క్లీన్‌ గంగా’ ప్రాజెక్టుకు రూట్‌ కితాబు..
పవిత్ర గంగా నది ప్రక్షాళనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే పథకాన్ని రూట్‌ ప్రశంసించారు. నీటిని ఆర్థిక వనరుగానే పరిగణించకుండా, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగానూ విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. గంగా నది శుద్ధి కార్యక్రమంలో ఈ అంశా లన్నీ ఇమిడి ఉన్నాయని కితాబు ఇచ్చారు. కాగా, గురువారం రాత్రే రూట్‌ స్వదేశం బయల్దేరారు.

29 నుంచి మోదీ విదేశీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29 నుంచి ఐదు రోజుల పాటు ఇండోనేసియా, సింగపూర్‌ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాలతో రక్షణ, భద్రతరంగానికి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకుంటారు. మే 29 నుంచి 31 వరకూ మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇండోనేసియాతో రక్షణరంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు.  అనంతరం జూన్‌ 1న సింగపూర్‌కు వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని లీసెయిన్‌ లూంగ్‌తో పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. అనంతరం 28 ఆసియా–పసిఫిక్‌ దేశాల రక్షణ మంత్రులు, ఆర్మీ చీఫ్‌లు పాల్గొనే షాంగ్రీ లా సదస్సులో మాట్లాడతారు. ఈ సదస్సులో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం.  
 

‘గ్రామస్వరాజ్‌’ సక్సెస్‌
ప్రధాని మోదీ ఉద్ఘాటన

న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘గ్రామస్వరాజ్‌ అభియాన్‌’ కార్యక్రమం విజయవంతమైందని.. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్‌ 14 (అంబేడ్కర్‌ జయంతి) మొదలుకుని మే 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం’ అని ఆయన ట్వీట్‌ చేశారు. పేదలకోసం ఉద్దేశించిన ఏడు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివిధ బృందాలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరించాయన్నారు. ‘ఈ 21 రోజుల్లో 7.53 లక్షల మందికి ఉజ్వల కనెక్షన్లు, 5లక్షల ఇళ్లకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్‌ వెలుగులం దించాం. 16,682 గ్రామాల్లో 25 లక్షల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేశాం. 1.65 లక్షల మంది∙చిన్నారులు, 42,762 మంది గర్భిణులకు మిషన్‌ ఇంద్ర ధనుష్‌లో భాగంగా టీకాలు వేశాం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, స్థానిక సంస్థల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement