బ్రిటన్‌లో హంగ్‌ పార్లమెంట్‌ | Hung parliament in Britain | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో హంగ్‌ పార్లమెంట్‌

Published Sat, Jun 10 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

బ్రిటన్‌లో హంగ్‌ పార్లమెంట్‌

ప్రధాని థెరిసా మేకు షాక్‌..
► డీయూపీ పార్టీతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమన్న థెరిసా

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాని థెరిసా మేకు ఊహించని షాక్‌ తగిలింది. బ్రెగ్జిట్‌ చర్చల కోసం పార్లమెంట్‌లో బలం పెంచుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారు. మూడేళ్ల ముందుగానే నిర్వహించిన ఎన్నికల్లో థెరిసా నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ మెజార్టీకి కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 326 స్థానాలు అవసరం కాగా..8 స్థానాలు తక్కువగా కన్జర్వేటివ్‌ పార్టీ 318 చోట్ల గెలిచింది. లేబర్‌ పార్టీ 261, స్కాటిష్‌ నేషనలిస్ట్‌ పార్టీకి 35, లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ 12, డెమొక్రటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీ(డీయూపీ)10 స్థానాల్లో గెలుపొందాయి. 

పార్లమెంట్‌ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని మొత్తం 650 సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. థెరిసా ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారని, ఆమె  తక్షణం రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్‌ చేయగా.. డీయూపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆమె పావులు కదుపుతున్నారు. బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శుక్రవారం విజ్ఞప్తి చేశారు.బ్రెగ్జిట్‌ చర్చల్లో పట్టు పెంచుకునేందుకు మూడేళ్ల ముందుగానే ఏప్రిల్‌లో ఎన్నికలకు మే పిలుపునిచ్చారు. ముందస్తు సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ విజయం ఖాయమని ప్రకటించగా.. ఫలితాలు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి.   
 
ఎంపీగా సిక్కు మహిళ రికార్డు
బ్రిటన్‌ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్‌ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్‌ గ్రిల్‌ బర్మింగ్‌హామ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ నుంచి కన్జర్వేటివ్‌ అభ్యర్థిపై 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు. లేబర్‌ పార్టీకే చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్‌మన్‌జీత్‌ సింగ్‌ దేశి కూడా స్లోగ్‌ సీటు నుంచి గెలిచారు. ఈ ఫలితాలతో బ్రిటన్‌లో భారత సంతతి ఎంపీల సంఖ్య 12కి పెరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement