న్యాయం కావాలి! | Want justice! | Sakshi
Sakshi News home page

న్యాయం కావాలి!

Published Thu, May 18 2017 4:00 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

న్యాయం కావాలి! - Sakshi

ఉమ్మడి హైకోర్టును పీడిస్తున్న ఖాళీలు
- పని ఒత్తిడితో న్యాయమూర్తులు ఉక్కిరిబిక్కిరి
- పోస్టుల భర్తీలో కేంద్రం తీవ్ర జాప్యం
- రిటైర్డ్‌ న్యాయమూర్తుల సేవలపై మీనమేషాలు
- కక్షిదారులు, న్యాయవాదుల్లో పెరిగిపోతున్న అసహనం


సాక్షి, హైదరాబాద్‌: న్యాయమూర్తుల ఖాళీలు.. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టును పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. న్యాయమూర్తుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఉన్నతస్థాయిలో జరుగుతున్న అసాధారణ జాప్యంతో పెరిగిపోతున్న పని ఒత్తిడి న్యాయమూర్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి తోడు న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న సంస్కరణల నేపథ్యంలో పెరిగిపోతున్న ఇతర అధికారిక పనులతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రిటైర్డ్‌ న్యాయమూర్తుల సేవలను ఉపయోగించుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన కేంద్రం, ఆ మేర హైకోర్టు నుంచి సిఫారసులు అందినా ఇప్పటివరకు వారి నియామకానికి మాత్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో విచారణకు నోచుకోని కేసులతో.. భరించలేని ఒత్తిడితో కక్షిదారులు, న్యాయవాదుల్లో అసహనం రోజు రోజుకు పెరిగిపోతోంది.

రిటైర్డ్‌ న్యాయమూర్తులేమైనట్లు..?
రాజ్యాంగంలోని అధికరణ 224ఎ కింద రిటైర్డ్‌ న్యాయమూర్తులను హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చు. రిటైర్డ్‌ న్యాయమూర్తుల సేవల వినియోగంపై అప్పటి లా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.జగన్నాథరావు నిర్ధిష్టమైన ప్రతిపాదనలు చేశారు. అయితే అవి ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం కేంద్ర న్యాయశాఖ గత ఏడాది నవంబర్‌లో రిటైర్డ్‌ న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గత ఏడాది చివర్లో నలుగురు రిటైర్డ్‌ న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేశారు. జస్టిస్‌ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్‌ గుండా చంద్రయ్య, జస్టిస్‌ రెడ్డి కాంతారావు, జస్టిస్‌ ఎస్‌.రవికుమార్‌ పేర్లను కేంద్రానికి పంపారు. ఇలా నాలుగు హైకోర్టుల నుంచి 18 పేర్లు పంపినా.. కేంద్రం ఇప్పటికీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు.

అయినా ప్రయోజనం లేదు...
అయితే పెరుగుతున్న సంఖ్యలకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్య లేకపోవడంతో సిట్టింగ్‌ న్యాయమూర్తులపై పని ఒత్తిడి తీవ్రమవుతోంది. రోజుకు ఒక్కో న్యాయమూర్తి ముందు వందల సంఖ్యలో కేసులు వస్తున్నప్పటికీ, వాటిలో గరిష్టంగా 60–80 కేసులు మాత్రమే విచారించడం సాధ్యమవుతోంది. దీంతో కక్షిదారుల నుంచి న్యాయవాదులకు, న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులకు ఒత్తిడి ఎదురవుతోంది.  

ఒక్కో జడ్జి పరిష్కరించిన కేసులు...(సుప్రీంకోర్టు తాజా లెక్కల ప్రకారం)
► ఉమ్మడి హైకోర్టులో (గత సెప్టెంబర్‌ నాటికి) పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య: 2,85,663.
► ఇందులో క్రిమినల్‌ కేసులు: 41,172... సివిల్‌ కేసులు: 2,44,491.
►  2016 మూడో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్‌)లో హైకోర్టు పరిష్కరించిన కేసు సంఖ్య: 17,991
► ఆ క్వార్టర్‌లో హైకోర్టు పని దినాలు: 60
► ఈ లెక్కన ఒక్కో న్యాయమూర్తి పరిష్కరించిన సరాసరి కేసులు: 299

పెరుగుతున్న కేసుల సంఖ్య(ఒక ఏడాదికి)...
► రాష్ట్ర విభజనకు ముందు దాఖలయ్యే రిట్‌ పిటిషన్ల సంఖ్య: 35 వేల నుంచి 38 వేలు
► ప్రస్తుతం: దాదాపు 47 వేలు
► రాష్ట్ర విభజనకు ముందు క్రిమినల్‌ కేసుల సంఖ్య: 11 వేల నుంచి 13 వేలు
► ప్రస్తుతం: 22 వేలకుపైగా...
► ఇప్పుడు తెలంగాణకు పరిపాలన ట్రిబ్యునల్‌ లేకపోవడంతో, ఉద్యోగ వివాదాల కేసులను హైకోర్టే విచారించాల్సి వస్తోంది. వీటికి తోడు ఆస్తి వివాదాలు, కుటుంబ వివాదాల కేసులు కూడా భారీగానే దాఖలవుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement