ఏపీ స్థానికత ఫైల్పై రాష్ట్రపతి ఆమోదం | President Pranab Mukherjee signs AP Local Status file | Sakshi
Sakshi News home page

ఏపీ స్థానికత ఫైల్పై రాష్ట్రపతి ఆమోదం

Published Fri, Jun 10 2016 11:10 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

President Pranab Mukherjee signs AP Local Status file

న్యూఢిల్లీ:  రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారి స్థానికత అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. ఏపీ స్థానికత ఫైలుపై ఆయన శుక్రవారం సంతకం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్థానికత గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఏపీకి తిరిగి వచ్చేవారిని స్థానికత వర్తిస్తుంది. విభజన జరిగినప్పటి నుంచి మూడేళ్లలోపు.. అంటే జూన్ 2, 2017లోపు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చేవారినందర్నీ స్థానికులుగా గుర్తించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో దీనికి చట్టరూపం దాల్చింది.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న ప్రాంతాలమధ్య విద్య, ఉద్యోగాలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ‘371-డి’, ‘371-ఈ’లను చేర్చిన విషయం తెలిసిందే. ఆయా నిబంధనలను నిర్వచిస్తూ 1975లో ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 97 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో స్థిరపడి రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునేవారి విషయంలో స్థానికతను నిర్ధారించేందుకు ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా సవరణను ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు-1975లోని పేరా 7ను సవరించాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement