‘వరద కాల్వ’ సవ రించిన అంచనాలకు ఓకే | "Flood Canal 'estimates tested okay to Edit | Sakshi
Sakshi News home page

‘వరద కాల్వ’ సవ రించిన అంచనాలకు ఓకే

Published Tue, Mar 1 2016 6:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

‘వరద కాల్వ’ సవ రించిన అంచనాలకు ఓకే

సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఉన్న ఇందిరమ్మ వరద కాల్వ పనుల సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన సమావేశంలో సవరించిన అంచనా రూ. 5,887.13 కోట్లకు ఓకే చెప్పింది. దీంతోపాటు ప్రాజెక్టులో ఇంకా చేయాల్సి ఉన్న పనులకు సంబంధించి రూ.1,950 కోట్లలో 25 శాతం నిధులను సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద ఇవ్వనుంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 2.25 లక్షల ఎకరాల ఆయకట్టు నీరిచ్చేందుకు వరద కాల్వ నిర్మాణాన్ని చేపట్టారు. 1996లో కేంద్ర జల వనరుల శాఖకు సమర్పించిన డీపీఆర్ మేరకు రూ. 1,331 కోట్లుగా అంచనా వేశారు.

2005లో ప్రణాళికా సంఘం నుంచి ఆమోదం రాగా... 2006లో ఏఐబీపీ కింద రూ.382.40 కోట్లు విడుదల చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు, భూసేకరణ జాప్యం కారణంగా అంచనా వ్యయం తాజాగా రూ.5,887.13 కోట్లకు చేరింది. ఇందులో ఇంకా రూ.1,950 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. అయితే ప్రాజె క్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపి, ఏఐబీపీ కింద నిధులివ్వాలని మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం చైర్మన్ పాండ్యా నేతృత్వంలోని టీఏసీ సోమవారం సమావేశంలో సవరించిన అంచనాకు ఆమోదం తెలిపింది. ఇక నిజాంసాగర్ ఆధునీకరణకు రూ. 978కోట్లు, మోదికుంటవాగుకు రూ.456 కోట్లకు సంబంధించిన రాష్ట్ర విన్నపాలను టీఏసీ పరిశీలిస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement