తూర్పున వాలిన సూర్యుడు | Sriramana Article On Indraganti Sreekanth Sarma | Sakshi
Sakshi News home page

తూర్పున వాలిన సూర్యుడు

Published Sat, Jul 27 2019 1:04 AM | Last Updated on Sat, Jul 27 2019 1:05 AM

Sriramana Article On Indraganti Sreekanth Sarma - Sakshi

తెలుగు సాహిత్య వీధుల్లో అర్ధ శతాబ్ది పాటు రంగురంగుల వెలుగుపూలు పూయించిన సిద్ధుడు, అసాధ్యుడు శ్రీకాంత శర్మ. 1944లో గోదావరి జిల్లా రామచంద్రాపురంలో పుట్టారు. సంస్కృతాంధ్రా లలోనే కాక ఆంగ్లంలో సైతం మంచి పట్టు సాధించారు. కొద్దికాలం బడిలో పాఠాలు చెప్పారు. ఆనక పత్రికా రంగానికి వచ్చి ఒక ప్రముఖ వార పత్రిక సంపాదక వర్గంలో కుదురుకున్నారు. 1976లో విజయవాడ ఆకాశవాణిలో స్క్రిప్ట్‌ రైటర్‌గా శర్మని తీసుకున్నారు. ఎలాగంటే– ఆ ఉద్యోగానికి అర్హత ఉన్నత విద్యతోబాటు గరిష్టంగా 30 ఏళ్ల వయస్సు. అప్పుడు స్టేషన్‌ డైరెక్టర్‌గా బాలాంత్రపు రజనీకాంతరావు ఏలుతున్నారు. ఎలాగైనా ఇంద్రగంటివారి అబ్బాయిని రేడియోలోకి లాగితే స్టేషన్‌ బాగుపడుతుందనుకున్నారు.

అన్నిట్లో నెగ్గిన శ్రీకాంత శర్మ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాయించారు. తీరా చేరాక, అన్నిరకాల రాత కోతల్లో శర్మ తల, చేతులు పెట్టాక, ఢిల్లీ నుంచి రజనీకి శ్రీముఖం వచ్చింది. మన విధి విధానాల్లో వయసు పరిమితి 30 కదా. శ్రీకాంత శర్మకి 32 కదా అంటూ తాఖీదిచ్చారు. రజనీ అంటే అప్పటికే అతడనేక యుద్ధముల నారితేరిన గడుసు పిండం. మంచిదనిపిస్తే ముందు చేయదలచిన పనులు పూర్తి చేసి తర్వాత సమర్థించుకోవడమే ఆయనకు తెలుసు. ‘అయ్యా, మన నిబంధనావళిలో ప్రిఫరబ్లీ 30 ఇయర్స్‌ అని ఉండటం చేతనూ, కుర్రవాడు చాకు అవడం చేతనూ రెండేళ్లని పక్కన పెట్టడం జరిగింది. అయినా, ఇకపై ఇలా హద్దు మీరడం ఉండదని మనవి’ అని జవాబిచ్చారు. చవగండాలు తప్పుకుని శ్రీకాంత శర్మ, ఏకు మేకై 1996 దాకా ఆకాశవాణిని సేవించారు.

శర్మ పాడింది పాటగా విజయవాడ రేడియో నడిచింది. ఎన్ని పల్లవులు? ఎన్ని పాటలు? ఎమ్మెస్‌ శ్రీరాం అంటే ప్రఖ్యాత వైణికులు ఈమని శంకరశాస్త్రి మేనల్లుడు. ఆయన రేడియోలో సంగీత శాఖాధిపతిగా ఉన్నప్పుడు, శర్మకి ట్యూన్‌లు చెప్పి పాటలు ఇమ్మన్నాడు. ఆ ఒరవడిలో ఉరవడిలో వచ్చిన తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా.. పాట. అప్పటికీ ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందిన శర్మ పాట. శర్మ మనసులో పాట అలవోకగా పల్లవిస్తుంది. పరిమళిస్తుంది. ‘శ్రావణాన మధురమైన వలపు తలపు తేనె సోన..., కనరే నీలి వెన్నెల..., తెరపు మరపు మనసులో విరజాజి వెన్నెల నీడలో...’ ఇలా తెంపు లేకుండా రసికుల జ్ఞాపకాల్లోంచి వస్తూనే ఉంటాయ్‌. దేవులపల్లి కృష్ణ శాస్త్రీయం బలంగా ఆవహించి ఉన్నా, చెట్టు ఇస్మాయిల్‌ ధోరణి ఆవరించి ఉన్నా, శేషేంద్ర మధ్య మధ్య పలకరిస్తున్నా సకాలంలో వైదొలగి తన సొంత కక్ష్యలో ఏ ఉల్కల బారినా పడకుండా హాయిగా పరిభ్రమిస్తూనే గడిపారు. ప్రోజు, పొయిట్రీ, పద్యం, నాటకం, పత్రి కారచన– ఇలా అన్ని ప్రక్రియల్ని వెలిగించి పూయించారు శ్రీకాంత శర్మ. మితంగానే అయినా మంచి పాటలు సినిమాలకి రాశారు. కృష్ణ శాస్త్రి, భుజంగరాయశర్మల తర్వాత వెంపటి చినసత్యం మేష్టారికి కూచిపూడి నృత్యరూపక కర్తగా ఆ స్థాయిని నిలబెట్టారు. నలభై పైబడిన మా స్నేహంలో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు.చివరిదాకా హాస్యోక్తులతోనే మా మాటలు సాగాయి. శర్మ కాగితం మీదికి వస్తేనే సీరియస్‌గానీ లేదంటే హ్యూమరే! 

శర్మ చాలా తరచుగా మద్రాసు వచ్చేవారు. నాతోనే ఉండేవారు. ఒకసారి వచ్చినప్పుడు మా అబ్బాయ్‌ అక్షరాభ్యాసం నిర్ణయమైంది. సామగ్రిని పిల్లాణ్ణి తీసుకుని రమణ గారింటికి వెళ్లాం. వాళ్లిద్దరి చేతా చెరో అక్షరం దిద్దించాలని సంకల్పం. తీరా అక్క డికి వెళ్లాక ‘మేం కాదు. ఇక్కడీ సాహితీ శిఖరం ఉండగా మేమా, తప్పు’ అంటూ బాపురమణ మా అబ్బాయిని శర్మగారి ఒళ్లో కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయించారు. ఆ సన్నివేశం అలా సుఖాంతమైంది. కొన్నాళ్లు గడిచాయ్‌. బళ్లో మావాడి ప్రోగ్రెస్‌ కార్డు ఎప్పుడొచ్చినా, కాపీ తీయించి శర్మకి పోస్ట్‌ చేసేవాణ్ణి. ‘ఇదేంటండీ, నన్నీ విధంగా హింస పెడుతున్నారు. నేను వద్దు మొర్రో అంటున్నా వినకుండా నాతో దిద్దబెట్టించారు. నేనెప్పుడూ లెక్కల్లో పూరే. వాడికి లెక్కల్లో తోకలేని తొమ్మిదులు, తలలేని ఆర్లు వస్తుంటే నాదా పూచీ’ అంటూ జవాబులు వస్తుండేవి. అయ్యా, లెక్కలు సరే. తెలుగూ అట్లాగే ఉంది. ‘స్నానం పోసు కోవడం’ లాంటి మాటలొస్తున్నాయ్‌ అనే వాడిని. 

ఆప్తమిత్రుని అనారోగ్యం మాటలు వింటూనే ఉన్నా, ఇప్పుడే ఇంతటి విషాద వార్త వింటానని అనుకోలేదు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రికి నేనంటే ఎంతో వాత్సల్యం. నాకో మంచి ముందుమాట రాశారు. శ్రీకాంత శర్మ సరేసరి. శ్రీమతి జానకి బాల, పిల్లలు మా స్నేహం నించి హితంగా సన్నిహితంగానే ఉన్నాం. ఇంద్రగంటి వారితో మూడు తరాల అనుబంధం. ఇంటిల్లి పాదీ మాటలకోర్లు. ఎప్పుడు కలిసినా ఎన్నాళ్లున్నా టైము మిగిలేది కాదు. శర్మ పార్థివ దేహాన్ని కడసారి దర్శించడానికి వెళ్లినపుడు దుఃఖం పెల్లుబికి వచ్చింది. మోహనకృష్ణ తన సినిమాకి తండ్రి రాసిన పాట గురించి ప్రస్తావించారు. కిరణ్మయి కూడా తనకు రాసిన పాట చెప్పింది. ప్రయోజకులై, బుద్ధిమంతులై, తల్లిదండ్రులను నడిపిస్తూ ఉండే పిల్లలున్న తండ్రి మా శ్రీకాంత శర్మ అన్పించింది. నా కళ్లలోంచి ఆనంద బాష్పాలు రాలాయి. స్నేహశీలికి అశ్రు తర్పణం.


శ్రీరమణ
వ్యాసకర్త ప్రముఖ కథకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement