ఒకే కుదురు | Sri Ramana Akshara Thuniram Article On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఒకే కుదురు

Published Sat, Aug 25 2018 12:32 AM | Last Updated on Sat, Aug 25 2018 12:32 AM

Sri Ramana Akshara Thuniram Article On Chandrababu Naidu - Sakshi

ఏవిటి ఈసారి మీ ఎజెండా? అన్న ప్రశ్నకి, ‘పవర్‌లోకి మళ్లీ రావడం’ అని వెంటనే జవాబిచ్చాడు అగ్రనేత. ‘కిందటిసారి కూడా మీ మానిఫెస్టో సారాంశం అదే కదా’ అన్నాడా పత్రికా ప్రతినిధి. అందుకు నేత నవ్వి ‘‘లేదు... పవర్‌ని పార్టీ పెద్దలు పదిమందీ పంచుకుని పాలించాలని అప్పటి మాని ఫెస్టోలో చెప్పాం. కచ్చితంగా, అదే ఆచరించి చూపించాం’ అని స్పష్టం చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. తెలం గాణలో ‘గరుడ వస్త్రం’ వేసినట్టే. వైష్ణవ సంప్ర దాయంలో ఉత్సవాలకు ముందు ధ్వజస్తంభానికి జెండాలాగా దీన్ని ఎగరేస్తారు. ఇది దేవతలకు ఆహ్వానం. దేవ తలు, దేవగణాలు ఆకాశంలో దీన్ని చూసుకుని, ఉత్సవాలకు తరలివస్తారు. కొందరేమం టారంటే– అబ్బే ఇదంతా వట్టి సందడి. ఎన్నికలు ముందస్తుగా రానేరావు అంటూ పందాలు కడుతు న్నారు. ‘ప్రజాస్వామ్యమంటే ప్రజలతో ఆడుకోడం’ అని ఓ నిర్వచనం ఉంది.


నిన్నగాక మొన్న ఓటేసి వచ్చినట్టుంది. ఇంకా బూత్‌లో వేసిన పచ్చబొట్టు సాంతం చెరగనే లేదు. కొన్ని గోడలమీద రాసిన ‘.... కే మీ ఓటు’ రాతలు కనుమరుగు అవలేదు. నాయకులు చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఇంకా చెవి గూట్లోనే ఉన్నాయ్‌. అప్పుడే మళ్లీ ఎన్నికలా?! ఆశ్చర్యంగా ఉంది కొందరికి. బహుశా చంద్రబాబు ముందస్తుకి మొగ్గుచూపక పోవచ్చు. మోదీ మీద కత్తులు పదును పెట్టడానికి కొంచెం వ్యవధి అవసరం. పనులన్నీ ‘బ్లూప్రింట్ల’ లోనే ఉన్నాయ్‌.పోలవరం గురించి పాజిటివ్‌గా చెప్పాలంటే సగం పూర్తయింది. నెగటివ్‌గా చెప్పాలంటే ఇంకా సగం మిగిలే ఉంది. కాపిటల్‌ నిర్మాణం శంకు స్థాపనల దశలోనే ఆగింది. నాలుగేళ్లుగా దేన్ని పట్టు కున్నా యెక్కి రాలేదు. ఢిల్లీ నుంచి బోలెడు వరద వస్తుందని, ఖజానా పొంగి పొర్లుతుందని ఆశిస్తే అది కూడా తేలిపోయింది. ఇక ఇప్పుడు చంద్ర బాబుకి మిగిలిన ఆఖరి గడి కాంగ్రెస్‌తో పొత్తు. ఈ పొత్తుని ఎట్లా సమర్థించుకుంటూ జనంలోకి వెళ్తారో తెలియదు. 


ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారెవరో. ఇంతకు ముందు పాపం అన్నగారి ఆత్మ ఎన్నోసార్లు క్షోభిం చింది. ఆత్మక్షోభ అలవాటు చేశాం కాబట్టి అదొక సమస్య కాదు. ఇప్పుడు మనముందున్న సమస్యల్లా పీఠాన్ని కైవసం చేసుకోవడం ఎలా అన్నది. అయినా వ్రతం చెడ్డా, ఫలం దక్కుతుందో లేదో అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంకా గ్రామీణ ప్రాంతంలోనే కాసినో కూసినో కాంగ్రెస్‌ ఓట్లు రెపరెపలాడుతున్నాయి. ఇంకా ఇందిరమ్మ పేరు గ్రామాల్లో వినిపిస్తుంది. చంద్రబాబుకి గ్రామాల్లో బొత్తిగా పలుకుబడి లేదు. ఒకప్పుడు బీసీ ఓట్లు టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉండేవి. అవన్నీ ఎన్టీఆర్‌ పోవడంతో చెల్లాచెదురైనాయి. చంద్ర బాబు అన్నిదారులూ క్షుణ్ణంగా చూశాకనే చేత్తో చెయ్యి కలపాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారు. ‘పవర్‌ పట్టు’ విషయంలో చంద్రబాబు నీతి నియ మాలను లెక్క చెయ్యరు. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో బోలెడు దార్లు తొక్కారు. దేనికీ అధిక ప్రాధాన్యత ఇవ్వక, ముక్కుసూటిగా నడుస్తూ, ఆ ముక్కుని అధికార పీఠం వైపు సారించి సాగుతూ వచ్చారు. ఇక హవా అంతా రీజనల్‌ పార్టీలదే అంటూ, తిరిగి కాంగ్రెస్‌తో కలవడం ఒక విడ్డూరం. 


మనం అంటే జనం ఒక్కమాట గుర్తుంచు కోవాలి. రాజకీయం అంతా ఒక్కటే. జాతీయం లేదు, స్థానికం లేదు. నేతలంతా ఈ గడ్డమీద పుట్టి, ఈ గాలి పీల్చి, ఈ నీళ్లు తాగి పెరిగిన వాళ్లే. కనుక రంగులు మారేదేమీ ఉండదు. ఎక్కడో దూరాన ఉన్నవాళ్లు అఖండ గోదావరి గురించి అనేక విధాలుగా అనుకుంటారు. ఆరాధించి కవిత్వాలు అల్లుతారు. ఇక్కడ ఉండేవాళ్లు అదే గోదావరిని మురుగు కాలువకంటే హీనంగా చూస్తారు. మన ఊరు పక్కగా వెళ్తోంది కాబట్టి మనకేమీ గొప్పగా అనిపించదు.కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అయితే అవచ్చుగానీ, వందేళ్లకి పైబడి జనం మధ్య తెగ నలిగిపోయి ఉంది. స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ అనే పేరు ఎప్పుడో చెరిగిపోయింది. చంద్రబాబు పొత్తు పెట్టు కుంటే ఏమీ కొత్తదనం ఉండదు. చంద్రబాబు కాంగ్రెస్‌ కుదురులోంచి వచ్చినవారే కదా. తిరిగి రాజకీయం రాజకీయంలాగే కొనసాగుతుంది.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement