రాహుల్‌ ఆలింగనం వెనుక సందేశం ఇదే! | Shekhar Gupta Article On Rahul Gandhi Hugs Narendra modi In Sakshi | Sakshi
Sakshi News home page

ఆలింగన రాజకీయాలు ఆత్మహత్యా సదృశమే..!

Published Sun, Jul 22 2018 12:45 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

Shekhar Gupta Article On Rahul Gandhi Hugs Narendra modi In Sakshi

మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన  రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్‌ సందేశంగా అర్థమౌతోంది.

కర్ణాటకలో తన జూనియర్‌ భాగస్వామి అయిన జేడీఎస్‌కు వెంటనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాహుల్‌ తన పార్టీ సంప్రదాయానికి, ఆధిపత్య పోకడలకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్‌ సందేశంగా అర్థమౌతోంది. ఆయుధాలు లేని ద్వంద్వ యుద్ధాల్లో ఇలా ముందుకు సాగవచ్చేమోగాని, దయాదాక్షిణ్యాలు లేని రాజకీయాల్లో ఇలాంటి పోరు ఆత్మహత్యా సదృశమే అవుతుంది.

అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చ అనేక ప్రశ్న లకు జవాబిచ్చింది. 2019 ఎన్నికలను ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్య క్షుడు రాహుల్‌గాంధీ మధ్య పోరుగా బీజేపీ చిత్రించడాన్ని ప్రతిపక్షాలు అనుమతిస్తాయా లేక రాష్ట్రానికో తీరున కాషాయపక్షంతో అవి తలపడ తాయా? రాహుల్‌ను చూసి బీజేపీ భయపడాలా? ఆయనను పాలకపక్ష మెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. మోదీతో తలపడే పట్టుదల, దూకుడు తనకున్నాయని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోదీ వ్యతిరేక పోరు తన నాయకత్వంలోనే సాగుతుందని రాహుల్‌ చెప్పకనే చెప్పారు. ‘పెద్దలు’ గంభీర ప్రసంగాలతో నీతులు చెప్పే రాజకీయ ప్రపంచంలో రాహుల్‌ తన అనూహ్య ప్రవర్తనతో కొంత పప్పూలా కనపడడం వల్ల నష్టమేమీ లేదు.

భారత ఓటర్లలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువతకు సీనియర్‌ నేతల నీతిబోధలు విసుగుపుట్టిస్తాయి. కాబట్టి రాహుల్‌ పోకడ వారికి బాగానే ఉంటుంది. ఇప్పటి వరకూ తనను సవాలు చేసే నేత లేకుండా ముందుకు పోతున్న మోదీకి పోటీగా రాజకీయ గోదాలో రాహు ల్‌ను ప్రత్యర్థిగా నిలబెట్టారు. కాంగ్రెస్‌ కోరుకున్నది సరిగ్గా ఇదే. సభలో రాహుల్‌ ప్రదర్శించిన దూకుడు, స్పష్టత చూసి కాంగ్రెస్‌ వాదులే ఆశ్చర్యపోయారు. ప్రధానిపై పదునైన విమర్శలతో, మధ్యమధ్యలో పాలకపక్ష నేతలను ‘డరో మత్‌’ (భయపడకండి) అంటూ తనకంటే అన్ని విధాల బలవంతుడైన తన ప్రత్యర్థితో తలపడడం ద్వారా రాహుల్‌ చాలా పెద్ద ‘రిస్క్‌’ తీసుకున్నారు. శ్రోతలను ఉర్రూతలూగించే వాగ్ధాటి, అతి ఆడంబరంగా కనిపించే ఆలింగనాల విషయంలో ఆరితేరిన మోదీతో పోటీకి దిగడం రాహుల్‌ ధైర్యానికి అద్దంపట్టింది. ఆయుధాలు లేని ద్వంద్వ యుద్ధాల్లో ఇలా ముందుకు సాగవచ్చేమోగాని, దయాదాక్షి ణ్యాలు లేని రాజకీయాల్లో ఇలాంటి పోరు ఆత్మహత్యాసదృశమే. 

రాజకీయాలను కుస్తీ, ద్వంద్వయుద్ధం వంటి ఆయుధాలు అవసరం లేని క్రీడగా భావిస్తే.. మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇందులో బాగా ఆరితేరారనేది అందరికీ తెలిసిన సత్యం. రాహుల్‌ వంటి ప్రతిపక్ష నేతలు ఈ క్రీడల్లో ఇంకా విద్యార్థులేనని చెప్పాల్సి ఉంటుంది. లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రసంగంతో మీడి యాలో ప్రధాన శీర్షికలతో ప్రచారం సంపాదించాలంటే కీలక సందర్భం కోసం నాయకులు పోరాటయోధుల మాదిరిగా ఎదురు చూస్తారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, అనూహ్య ఆలింగ నంతో మోదీతో ప్రత్యక్షంగా తలపడడం ద్వారా రాహుల్‌ తన 14 ఏళ్ల రాజకీయ జీవితంలో అతి పెద్ద సాహసం చేశారు.

ఈ ప్రత్యక్ష పోరులో మోదీని ‘నాకౌట్‌’ చేయలేకపోయినా రాహుల్‌ కొన్ని పాయింట్లు తన ఖాతాలో వేసుకోగలిగారు. కానీ, పార్లమెంటరీ చర్చల్లో మెరుపులు మెరిపించి కొన్ని ‘పాయింట్లు’ సాధించడం వల్ల రాజకీయ వాస్తవాలు మారవు. రాహుల్‌ ఎంత గొంతు చించు కుని మాట్లాడి, మోదీని కౌగిలించుకున్నా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం 325– 125 ఓట్ల తేడాతో వీగిపోయింది. మోదీకి జనం విశ్వసించదగిన పోటీదారుగా ఎదగాలంటే రాహుల్‌ ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఇంతవరకూ ఆయన ఏ రాష్ట్ర ఎన్నిక ల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించింది లేదు. ఆయన పార్టీ ఒకటిన్నర రాష్ట్రాల్లో (కర్ణాటకలో సగం) పరిపాలన సాగిస్తోంది. అవసరమై నన్ని నిధులు లేక కాంగ్రెస్‌ అల్లాడుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలయ్యే నాటికి ఆయన పార్టీ నేతలు, వారి కుటుం బసభ్యులు ‘అవినీతి’ ఆరోపణలపై వేసిన కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితులున్నాయి.

2019 ఎన్నికల్లో పోటీచేయడం అంటే కాంగ్రెస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌ సీట్ల లోటుతో (అంటే లోక్‌సభలో మెజారిటీకి అవసర మైన 270కి పైగా సీట్ల నుంచి ఇప్పటి 44 తీసేస్తే వచ్చే సంఖ్య 230) రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ లోటు భర్తీ కావడానికి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎలాంటి ‘ప్రభం జనం’ కనిపించడం లేదు. ఈ లెక్కన రాహుల్‌  రాజకీయ క్షేత్రంలో నిజంగా ఎదిగారా? అనేది ప్రధానాంశం కాదు. ఆయన ఇంకా ఎదగలేదు. గమ్యం చేరుకోవడానికి ఇంకా చాలా దూరం పరుగులు తీయాల్సి ఉంది. ఆయన కేవలం నేతగా అవతరిం చారు.

టీవీ చానళ్ల మాటల్లో చెప్పాలంటే ఆయన ఇప్పటి పరిస్థితు లకు తగినట్టు పైకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. రాజకీయాలు, ప్రజాసేవపై ఆయనకున్న అంకితభావం, దృష్టిపై గతంలో అను మానాలుండేవి. తరచూ దేశం నుంచి అదృశ్యమౌతూ విదేశాల్లో చక్కగా గడపడానికి పోవడం వంటి చర్యలతో ఆధారపడదగిన నేత కాదనే ఇమేజ్‌ని ఆయనే సృష్టించుకున్నారు. ఆయనకు ఈ విషయం చెప్పే ధైర్యం పార్టీ నేతలకు లేదు. కానీ, కాంగ్రెస్‌ చుక్కాని లేని నావలా మారిందని, తమ నాయకుడు నిజంగా పూర్తి కాలం పనిచేసే అధ్యక్షుడు కాదనే దిగులుతో కుమిలిపోయే వారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు రాహుల్‌పై ఇలాంటి అభిప్రాయాలు తొలగించడానికి ఎంతవరకు తోడ్పడతాయో?

రాహుల్‌ తన తల్లి సోనియా కంటే చాలా భిన్నమైన శైలిగల నాయకుడినని నిరూపించుకున్నారు. ఇప్పటి వరకూ ఏబీ వాజ్‌ పేయి తర్వాతి బీజేపీని సోనియా, ఆమె పార్టీ ద్వేషంతో, ధిక్కా రంతో చూస్తూనే ఉన్నాయి. మోదీని అంటరాని నేతగా పరిగణిస్తు న్నాయి. సహజంగానే రాజకీయ పోరుకు ముందుకు దూకే స్వభావమున్న మోదీ కాంగ్రెస్‌ ధోరణిని తనకు అనుకూలంగా మార్చు కున్నారు. పదేళ్ల క్రితం మోదీని ‘మృత్య్‌ కా సౌదాగర్‌’ (మృత్యు బేహారి–మరణాలతో వ్యాపారం చేసే నేత) అని సోనియా వర్ణిం చారు. మోదీ అదే దారిలో ఈ తల్లీకొడుకులను జెర్సీ ఆవు, దూడ అంటూ అభివర్ణించారు. ఇప్పుడేమో మోదీ దగ్గరకు పోయి కౌగ లించుకున్న రాహుల్‌ ప్రధానిని ప్రేమిస్తున్నానని చెప్పారు. కానీ, రాజకీయాల్లో వ్యంగ్యం అనేది ప్రత్యర్థిని అంటరానివాడిగా చూడటం కన్నా తక్కువ బాధకలిగిస్తుంది. అలాగే, కర్ణాటకలో తన జూనియర్‌ భాగస్వామి అయిన జేడీఎస్‌కు వెంటనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాహుల్‌ తన పార్టీ సంప్రదాయానికి, ఆధి పత్య పోకడలకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన  రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్‌ సందేశంగా అర్థమౌతోంది.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement