జై కిసాన్... జై పోస్ట్‌మాన్! | Indian National Postal Day on october 10th | Sakshi
Sakshi News home page

జై కిసాన్... జై పోస్ట్‌మాన్!

Published Sat, Oct 8 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

జై కిసాన్... జై పోస్ట్‌మాన్!

ఆదర్శం
అక్టోబర్ 10  ఇండియన్ నేషనల్ పోస్టల్ డే
‘పోస్ట్..’ అనే పిలుపు ఎంత తీయటిదో ఈ తరానికి అంతగా తెలియకపోవచ్చుగానీ... కొన్ని సంవత్సరాల వెనక్కి వెళితే... ఆ పిలుపులోని మాధుర్యం కళ్ల ముందు కదలాడుతుంది. ‘అబ్బాయికి ఉద్యోగం వచ్చింది’ ‘పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి అమ్మాయి నచ్చింది’ ‘మిత్రమా... ఉభయ కుశలోపరి’ ‘తాతయ్య ఆరోగ్యం బాగలేదు. వెంటనే బయలుదేరి రాగలవు’  ఆనందం. ఆత్మీయం. క్షేమ సమాచారం... ఒక్కటా... రెండా... ‘పోస్ట్’ అనే పిలువులో ఎన్నో ఎదురుచూపులు.

ఆ ఎదురుచూపుల కాలానికి ఇప్పుడు కాలం చెల్లవచ్చుగాక... కానీ ‘పోస్ట్’ అనే పిలుపుకు మాత్రం కాలం చెల్లలేదు. పోస్ట్ ఆఫీసులకు కాలం చెల్లలేదు. అవి కాలంతో పాటు మారుతూ... ప్రజలకు చేరుతున్నాయి అని చెప్పడానికి నిదర్శనం... ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ వ్యవసాయ భూముల భూసారాన్ని పరీక్షించడానికి ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. పూణే ప్రాంతీయ తపాలాశాఖ ఆధ్వర్యంలోని ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ కృషి విజ్ఞాన్ కేంద్ర (కేవీకే)తో కలిసి పనిచేస్తుంది. బారామతి కేంద్రంగా పనిచేస్తున్న ‘కేవీకే’ జిల్లా స్థాయి ఫార్మ్ సైన్స్ సెంటర్. రైతులు తమ పొలాల్లోని మట్టి నమూనాలను స్థానిక పోస్ట్ ఆఫీసుల్లో ఇస్తారు.

వీటిని పోస్ట్ ఆఫీసులు పరీక్ష కోసం కేవీకే సెంటర్‌లకు పంపుతాయి. పరీక్షల తరువాత... ఆ సెంటర్ నుంచి ఒక రిపోర్ట్ అందుతుంది. అందులో అవసరమైన సలహాలు కూడా అందుతాయి. ‘‘భారతీయ తపాలశాఖ ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతుల దూతగా వ్యవహరించే విలువైన అవకాశం ఏర్పడుతుంది’’ అంటున్నారు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎఫ్.బి.సయ్యద్. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు మట్టి నాణ్యత పరీక్షల గురించి అంతగా అవగాహన లేదు.

ఉన్నా... పరీక్షల విధివిధానాల గురించి తెలియదు. ఈ నేపథ్యంలో... ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ ఎంతోమంది రైతులకు మేలు చేస్తోంది. ‘‘ఉత్తరం కొనడానికో, మనీ ఆర్డర్ చేయడానికో ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులకు తరచుగా వెళ్లేవాళ్లం. ఈ మధ్య కాలంలో అసలు వెళ్లడమే తక్కువైంది. ఇప్పుడు... కిసాన్ విజ్ఞాన్ దూత్ వల్ల... బాగా తెలిసిన ఇంటికి మళ్లీ వెళ్లినట్లు అనిపించింది’’ అంటున్నాడు కేసరి అనే గ్రామీణ రైతు. ఇది ఒక్క రైతు అభిప్రాయం మాత్రమే కాదు.
 
ఎంతోమంది రైతుల భావోద్వేగ సంబరం.
పూణే శాఖ పరిధిలో మొత్తం రెండు వేలకు పైగా గ్రామీణ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి... కేవలం పోస్ట్ ఆఫీసులు మాత్రమే కాదు... రైతుల ఆత్మీయ నేస్తాలు. ‘‘భూసార పరీక్షల గురించి తక్కువమంది రైతులకు మాత్రమే తెలుసు. దీనికి తోడు సమాచార కొరత.  ఇప్పుడు మాత్రం భూసార పరీక్షల గురించి శాస్త్రీయ అవగాహనను పెంచుకుంటున్నారు’’ అంటున్నాడు భూసార పరీక్షల్లో స్పెషలిస్ట్‌గా పేరున్న వివేక్ భోటి. ప్రస్తుతానికైతే... భూసార పరీక్షల రిపోర్ట్ రైతుల చేతికి అందడానికి ఎనిమిది రోజుల సమయం పడుతోంది. ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతోంది. రైతులు ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి కారణమవుతున్న అవగాహన లేమి ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’తో తగ్గిపోతుంది. సరికొత్త సమాచారం చేరువవుతుంది. ‘గత కాలం మేలు’ అంటారు.  పోస్ట్ ఆఫీసులు అంటే ‘గత కాల జ్ఞాపకాలే’ అనుకుంటున్న కాలంలో... ప్రజల మేలు కోరి... మరింత శక్తిమంతం అవుతోంది భారతీయ తపాలాశాఖ.
 
అడుగో పోస్ట్‌మాన్!
వీధి వీధినంతా మేల్కొలుపుతున్నాయి
వీధి వీధినంతా కలయ చూస్తున్నాయి
అడుగో పోస్ట్‌మాన్!
                      *   *
 అందరికీ నువ్వు  ఆత్మబంధువువి
 అందరికి నువ్వు వార్తనందిస్తావు
 కాని నీ కథనం మాత్రం నీటిలోనే మథనం
 అవుతుంటుంది.
 ఇన్ని ఇళ్ళు తిరిగినా... నీ గుండె బరువు
 దించుకోవడానికి ఒక్క గడప లేదు.
 ఇన్ని కళ్ళు పిలిచినా... ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు.
 ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్లిపోయే నిన్ను చూసినప్పుడు
  తీరం వదలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు.

- తిలక్
(తపాలా బంట్రోతు కవిత నుంచి)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement