అదృష్టం తలంబ్రాలు చల్లింది Weddings in Adivasi tribes in Kundi district of Jharkhand | Sakshi
Sakshi News home page

అదృష్టం తలంబ్రాలు చల్లింది

Published Fri, Feb 1 2019 12:45 AM | Last Updated on Fri, Feb 1 2019 12:45 AM

Weddings in Adivasi tribes in Kundi district of Jharkhand - Sakshi

ఐదు నెలల పాపాయి సాక్షిగా జరిగిన పెళ్లి అది! పాపాయి అమ్మ అరుణ, నాన్న జీతేశ్వర్‌ పెళ్లి చేసుకున్నారు. అదే పందిరి కింద పాపాయి నానమ్మ సహోదరి (ఆమె పేరే సహోదరి), తాత రామ్‌లాల్‌  కూడా దంపతులయ్యారు. రామ్‌లాల్, సహోదరి ఇద్దరూ ముప్పై ఏళ్లు లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉండి ఇప్పుడు దంపతులయ్యారు. వాళ్లకు పుట్టిన జీతేశ్వర్‌ కూడా అదే రోజు అరుణను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే జీతేశ్వర్, అరుణలకు ఐదేళ్ల పాపాయి ఉంది. చిత్రంగా ఉన్నా విచిత్రంగా ఉన్నా ఇది నిజం. జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఆదివాసీ తెగలో జరిగిన పెళ్లిళ్లు అవి.

ఆ రోజు జరిగింది ఈ రెండు పెళ్లిళ్లే కాదు. రెండు వందల పెళ్లిళ్లు జరిగాయి. వధూవరుల్లో ఇరవైలలో ఉన్నవాళ్లే కాదు, అరవైలలో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. ఆ ఆదివాసీ తెగలో ఉన్న ఒక దుస్సంప్రదాయం కారణంగా పెళ్లి బంధం లేకుండానే లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో కొనసాగిన వాళ్లే వాళ్లంతా. అంతకంటే లోతుగా చెప్పాలంటే చేతిలో డబ్బులేకపోవడం వల్ల వాళ్ల తెగ దుస్సంప్రదాయాన్ని పాటించే ఆర్థిక వెసులుబాటు లేక పెళ్లి చేసుకోకనే కలిసి జీవించిన వాళ్లు.

 జార్ఖండ్, కుంతి జిల్లాలోని ఆదివాసీ తెగల్లో పెళ్లి అంటే విపరీతమైన ఖర్చుతో కూడిన వ్యవహారం. పెళ్లి చేసుకునే వాళ్లు ఊరు ఊరంతటికీ తిన్నంత తినిపించాలి, తాగినంత తాగించాలి. అప్పుడే ఒక స్త్రీ– పురుషుడిని వివాహబంధంలోకి అనుమతిస్తుంది వాళ్ల తెగ ఆచారం. రోజూ పని దొరుకుతుందనే భరోసా లేదు. ఇక పెళ్లి వేడుక చేసుకోవడానికి డబ్బెక్కడ నుంచి తేవాలి? అందుకే ఈ లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లు.

ధుక్‌ని.. ధుకాష్‌.. ధున్‌కా
ఈ లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌ని ఆదివాసీలు ‘ధుక్‌ని, ధుకావ్, ధున్‌కా’ అనే పేర్లతో పిలుస్తారు. ఈ రిలేషన్‌షిప్‌ని ధుకు అని, ఆ రిలేషన్‌లో ఉన్న మహిళను ధుక్‌నీ మహిళ అని వ్యవహరిస్తారు. ఇదేమీ గౌరవప్రదమైన హోదా కాదు. జీవితంలో చొరబడిన మహిళ అని అర్థం. భార్య అనే హోదా ఉండదు కాబట్టి దుక్‌నీ మహిళ నుదుట సింధూరం ధరించడానికి వీల్లేదు. ఆమెకు పుట్టిన పిల్లలకు చెవులు, ముక్కులు కుట్టించడానికి వీల్లేదు. ఆ మగమనిషి రేషన్‌ కార్డులో ఆ మహిళ పేరు ఉండదు, పిల్లల పేర్లు నమోదు కావు. ఆ పిల్లలకు ఆధార్‌ కార్డులుండవు. ధున్‌కా రిలేషన్‌షిప్‌లో ఉన్న పురుషుడు చనిపోతే ఆ మహిళకు అతడి ఆస్తిలో భాగం రాదు.

ఆమె మరో వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకోవాలి లేదా ఆ చనిపోయిన మనిషి బంధువుల దయాదాక్షిణ్యాల మీద బతుకు సాగించాలి. ఆ మహిళలు చెప్పే మరో కష్టం ఏమిటంటే.. సొంత ఊళ్లో అయితే ఎవరు ఎవరితో కలిసి జీవిస్తున్నదీ అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఈవ్‌ టీజింగ్‌ ఉండదు. ఈ మహిళలకు నుదుట సింధూరం లేకపోవడంతో (వివాహిత అనడానికి గుర్తు) బయట గ్రామాలకు వెళ్లినప్పుడు పెళ్లి కాని యువతులుగా భావించి మగవాళ్లు టీజ్‌ చేస్తుంటారు. అయినప్పటికీ ఖరీదైన పెళ్లి వేడుకకు భయపడి లివింగ్‌ ఇన్‌లో ఉన్న వాళ్లు వేలాదిమంది ఉన్నట్లు్ల సమాచారం. 

ఊరంతా పెళ్లి కళ
ఈ నేపథ్యంలోనే.. ఆ రాష్ట్రంలోని రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి ఆరాధనా సింగ్‌ చొరవతో ఒక స్వచ్ఛంద సంస్థ ఈ సామూహిక వివాహాలు చేసింది. ఆమె సర్వీస్‌ ఎక్కువగా ట్రాఫికింగ్‌కు గురైన పిల్లలను వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించడంలోనే గడిచింది. ఆదివాసీల పిల్లలు అపహరణకు గురయినప్పుడు వాళ్లను వెతికి పట్టుకోవడం, వెతికి పట్టుకున్న పిల్లలను ఎవరి పిల్లలో నిర్ధారించుకుని తల్లిదండ్రులకు అప్పగించడం ఒక సవాల్‌గా ఉండేదామెకి. ఆ పిల్లల పేర్లు ఎక్కడా అధికారికంగా నమోదు కాకపోవడమే అందుకు కారణం. అలా తప్పిపోయి దొరికిన ఒక పిల్లాడి తండ్రి ఒకరోజు మద్యం తాగి ఆమె ఇంటి ముందుకు వచ్చి ‘పెళ్లి చేసుకుంటాను, డబ్బివ్వమని’ కాళ్లావేళ్లా పడ్డాడు.

అప్పుడు విచారిస్తే ఆదివాసీల జీవనశైలి తెలిసిందామెకు. స్థానికంగా పనిచేస్తున్న ‘నిమిత’ అనే ఓ స్వచ్ఛంద సంస్థతో మాట్లాడి ఈ పెళ్లిళ్లు చేయించారు ఆరాధనా సింగ్‌. తొలి అడుగుగా వాళ్లకు పెళ్లి ప్రయత్నం జరిగింది.పెళ్లికి అంత ఖర్చు పెట్టాల్సిన పనిలేదని చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారు? ఆచారాలు మనిషిని ఒక సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేయాలి తప్ప, మనిషికి మోయలేని బరువుగా మారకూడదని వాళ్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చేదెవరు? పెళ్లి పెద్ద ఆరాధనా సింగ్, నమిత స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రయత్నం చేస్తే వినేందుకు ఆ తెగల్లోని మిగతా వాళ్లు మానసికంగా సిద్ధంగా ఉంటారా అనేదే పెద్ద ప్రశ్న.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement