లెక్కలు నేర్చుకుని.. రెక్కలు కట్టుకుని..! | Venkamma is ideal for many people | Sakshi
Sakshi News home page

లెక్కలు నేర్చుకుని.. రెక్కలు కట్టుకుని..!

Published Wed, Feb 6 2019 1:35 AM | Last Updated on Wed, Feb 6 2019 1:35 AM

Venkamma is ideal for many people - Sakshi

ఊరు కాని ఊరు.. చివరిదాకా తోడుగా నిలుస్తానని బాస చేసి పెళ్లి చేసుకున్న భర్త నలుగురు పిల్లలు పుట్టాక వారి మానాన వారిని వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు.. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో కష్టాల కడలిని ధైర్యంగా ఈదుతూ ముందుకు సాగుతోందామె. ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమె రెక్కలు ముక్కలు చేసుకునేలా కష్టపడుతున్నప్పటికీ బ్యాంకర్లు రుణమిచ్చి చేయూతనిచ్చేందుకు నిరాకరించగా, మరోవైపు స్వయం సహాయక పొదుపు గ్రూపుల్లోనూ ఆమెను చేర్చుకోలేదు. అయినప్పటికీ అన్ని బాధలను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది ‘సవిడిబోయిన వెంకాయమ్మ’.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన వెంకాయమ్మ ఎవరిపై ఆధారపడకుండా గత 16 ఏళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిరోజూ సుమారు 30 కిలోమీటర్లు సైకిల్‌పై తిరుగుతూ వస్త్రాలు అమ్ముకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వెంకాయమ్మ 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయిన 16 రోజులకే భర్త వెంకటేశ్వరరావుతో కలిసి సీతానగరం వచ్చింది. వెంకటేశ్వరరావు ఊరూరూ తిరిగి స్టీలుగిన్నెలు అమ్మే వ్యాపారం చేసేవాడు. ఇక్కడే వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు పుట్టారు. అయితే 16 సంవత్సరాల క్రితం భర్త వెంకటేశ్వరరావు వెంకాయమ్మను, నలుగురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా వెంకాయమ్మపై కోలుకోలేని భారం పడింది.

నిరక్షరాస్యురాలైన వెంకాయమ్మకు తూకాలు, కొలతలు సరిగా తెలియక పోవడంతో భర్త చేసిన స్టీలు గిన్నెలు అమ్మే వ్యాపారం జోలికి పోకుండా వస్త్రాలు అమ్ముకునే పని మొదలుపెట్టింది. అలా మూడేళ్ల పాటు వస్త్రాల మూటలు నెత్తిన పెట్టుకుని చుట్టుపక్కల ఊర్లలో తిరిగి అమ్ముకునేది. దీంతో మాడు నొప్పి విపరీతంగా బాధించేది. ఇలా లాభం లేదని కష్టపడి సెకిల్‌ తొక్కడం నేర్చుకుంది. ఈ క్రమంలో అనేక దెబ్బలు తగిలినా పిల్లల కోసం అన్నింటినీ మౌనంగా భరించి సైకిల్‌పై తిరుగుతూ వస్త్రాలు అమ్మడం ప్రారంభించింది. రాత్రి బడికి వెళ్లి అక్షరాలు, అంకెలు నేర్చుకుంది వెంకాయమ్మ.

43 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా సైకిల్‌పై రోజూ 30 కిలోమీటర్లకు పైగా తిరుగుతూ జీవనపోరాటం చేస్తోంది. గ్రామాల్లో కూలీలు పనులకు వెళ్లకముందే వెళ్లి వస్త్రాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండడంతో తెల్లవారుజామునే సైకిల్‌ మీద బయటకు వెళ్లి చుట్టుపక్కల 10 నుంచి 15 ఊర్లు తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి తిరిగి వస్తుంది. మధ్యలో వరికోతలు, కలుపులు, ఇతర వ్యవసాయ కూలీ పనులకు సైతం వెళ్లేది. పైగా ఆడపిల్లలనే తేడా లేకుండా కుమార్తెలిద్దరి చదువులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది వెంకాయమ్మ.

పిల్లలు ప్రయోజకులయ్యారు
పెద్దకుమార్తె నాగలక్ష్మిని బీఎస్సీ నర్సింగ్‌ చదివించింది. నాగలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఉద్యోగం చేస్తోంది. రెండో కుమార్తె శ్రీలతను ఈసీఈ విభాగంలో డిప్లొమా చదివించింది. శ్రీలత ప్రస్తుతం హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. మూడో సంతానమైన సందీప్‌ ఐటీఐ పూర్తి చేసి ప్రస్తుతం ఓపెన్‌ డిగ్రీ చదువుతున్నాడు. నాలుగో సంతానం చంద్రకిరణ్‌ 9వ తరగతి వరకు చదివి తల్లికి ఆసరాగా ఉంటున్నాడు. 

బ్యాంకర్ల చిన్నచూపు
కష్టాన్నే నమ్ముకున్న వెంకాయమ్మకు రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. రెండేళ్ల క్రితం వరకు రోడ్డు పక్కన ఆర్‌అండ్‌బీ స్థలంలో వేసుకున్న చిన్న గుడిసెలో వీరి కుటుంబం నివాసం ఉండేది. అయితే పక్కనే ఉన్న పొలం యజమాని ఖాళీ చేయించడంతో తల్లి ఏగమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి ఊరి చివరన కొద్దిపాటి స్థలం కొని, ఆ భూమిలో రేకులషెడ్డు వేసుకుంది. ప్రస్తుతం వెంకాయమ్మ అక్కడే ఉంటున్నారు.

పిల్లలను చదివించడానికి, ఇంటి కోసం చేసిన అప్పులు తీరకపోగా ఇప్పటికీ వడ్డీలు కడుతున్నారు. రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగితే  తిరిగి అప్పు ఎలా తీరుస్తావంటూ ఎద్దేవా చేసి తన దరఖాస్తును నిరాకరించినట్లు చెప్పింది. అదేవిధంగా మహిళలు డబ్బులు పొదుపు చేసుకునే స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా) గ్రూపుల్లోనూ తనను చేర్చుకోలేదని వాపోయింది. ఆడపిల్లలకు వివాహం చేయాల్సిన నేపథ్యంలో అన్ని కష్టాలనూ భారంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోన్న వెంకాయమ్మ చిన్న చిన్న సమస్యలు ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement