ఆతిథ్యం ఇచ్చే గృహం | The home of the host | Sakshi
Sakshi News home page

ఆతిథ్యం ఇచ్చే గృహం

Published Sat, Aug 5 2017 11:48 PM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

ఆతిథ్యం ఇచ్చే గృహం

ఆశీర్వాదాలకు మూలం!
సువార్త


విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము ఆతిథ్యానికి, ఔదార్యానికి మారు పేరు. సోదరుడు చనిపోతే అతని కొడుకైన లోతును తనతోపాటే ఉంచుకొని పెంచి పెద్దవాణ్ణి చేసిన అద్భుతమైన ప్రేమ ఆయనది. ఒకరోజున ముగ్గురు పరదేశులు ఇంటికొచ్చారు, తన ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్లవద్దని వారిని బతిమాలి మరీ అప్పటికప్పుడు అత్యంత రుచికరమైన భోజనాన్ని తన భార్యౖయెన శారాతో వండించి వారికి పెట్టాడు. పరదేశులు కదా మంచి వాళ్లో చెడ్డవాళ్లో నాకెందుకులే అని ఆయన ఆలోచించవచ్చు. అప్పటికే శారా వృద్ధురాలు. ఆమెనెందుకు కష్టపెట్టడం అనికూడా అనుకోవచ్చు. ముక్కూమొహం తెలియని వాడికి భోజనం పెడితే ఏమొస్తుంది? అని కూడా ఆలోచించవచ్చు. ఇది అవిశ్వాసుల ఆలోచనాతీరు.

అలా ఆలోచించలేకపోవడమే అబ్రాహాము ప్రత్యేకతగా భావించి అలాంటి మరికొన్ని సుగుణాల కారణంగా దేవుడాయన్ని విశ్వాసులకు జనకుణ్ణి చేశాడు. ఆ రోజు వచ్చిన వారు పరదేశులు కాదు, పరదేశుల్లాగా కనిపించిన దేవదూతలని అబ్రాహాముకి ఆ తర్వాత అర్థమయింది. వారు తృప్తిగా భోజనం చేసి సంతోషంగా వెళ్లిపోతూ, త్వరలోనే అబ్రాహాము, శారాలు కడు వృద్ధాప్యంలో కూడా ఒక కుమారుని పొందబోతున్నారని, ఆ మేరకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబోతున్నదని నిశ్చయతనిచ్చి వెళ్లిపోయారు. ఈ విషయాన్నే హెబ్రీ పత్రికలో ప్రస్తావిస్తూ కొందరు పరదేశులకు అతిథ్యమిచ్చి తమకు తెలియకుండానే దేవదూతలకు సేవచేశారని శ్లాఘించారు (ఆది 18: 1–15; హెబ్రీ 13:2).

ఆతిథ్యం విశ్వాసుల ఇంటికి సంబంధించిన విషయం కాదు, అది వారి హృదయానికి చెందిన విషయం!! ఒకప్పుడు మన గృహాలన్నీ ఆతిథ్యానికి మారుపేర్లు. కాని అది క్రమంగా కనుమరుగవుతున్న అత్యంత నగరీకరణ చెందిన జీవన శైలి మనదీనాడు. ఎండన పడి ఆకలితో అన్నం తినేవేళ ఇంటికి వచ్చిన అతిథి మొహాన ఫ్రిజ్‌లోని ఏ పానీయమో కొట్టి చేతులు దులుపుకునే ‘కృత్రిమ ప్రేమ’ కు మన ఇళ్లు మారుపేరైతే అదెంత విచారకరం? చిన్నప్పుడు అమ్మ ఏ సమయంలో వచ్చిన అతిథి ఎవరైనా వేడిగా భోజనం వండి వడ్డించడం, ఇక భిక్షగాళ్లకైతే, తప్పకుండా ఏదో ఒకటిచ్చి పంపడం గుర్తుంది.

పిల్లలైన కారణంగా మేము భిక్షగాళ్లను కసురుకొనడం చూస్తే వెంటనే మమ్మల్ని మందలించి ఏదీ ఇవ్వలేకపోతే సౌమ్యంగా ‘సారీ’ చెప్పాలని, ఉర్దూ మాట్లాడే ఫకీర్లయితే ‘మాఫ్‌ కీజియే’ అనాలని నేర్పించేది. కన్న తల్లిదండ్రులకు, తోబుట్టువులకు కూడా అన్నం పెట్టలేని అతి నాగరికతకు దాసోహమైన మన వాళ్లు పరదేశులు, భిక్షగాళ్ల రూపంలో వచ్చే దైవదూతలు, ప్రతినిధులకు ఆతిథ్యం నిరాకరించి పోగొట్టుకుంటున్న ఆశీర్వాదాలెన్నో లెక్క తెలిస్తే, అవాక్కవుతాం! అందుకే ఆతిథ్యం లేని గృహం తప్పకుండా సమస్యలకు, అశాంతికి నిలయం!!
– రెవ. డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

 

Advertisement
 
Advertisement
 
Advertisement