స్త్రీలోక సంచారం | Special story to women empowerment | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Wed, Jun 20 2018 12:37 AM | Last Updated on Wed, Jun 20 2018 12:37 AM

 Special story to women empowerment - Sakshi

::: అక్రమ చొరబాటుదారులను నిరోధించడం కోసం ‘జీరో టాలరెన్స్‌’ (ఏమాత్రం సహించేది లేదు) వలస విధానాన్ని అమలు చేస్తున్న అమెరికా, సరిహద్దుల్లోని మెక్సికన్‌ వలస తల్లిదండ్రుల నుంచి వారి పిల్లల్ని వేరు చేసి వేర్వేరు వసతికేంద్రాల్లో ఉంచడాన్ని అమెరికా దేశపు ప్రస్తుత, పూర్వ ప్రథమ మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వైఖరిని తాను ద్వేషిస్తున్నానని డొనాన్డ్‌ ట్రంప్‌ భార్య మెలనియా ప్రకటించగా, ఇంత అమానుషమైన చర్యల్ని ప్రపంచయుద్ధకాలంలో కూడా మనం చూడలేదని లారా బుష్‌ వ్యాఖ్యానించారు ::: బ్రిటన్‌ రాణివంశపు కొత్త పెళ్లికూతురు మేఘన్‌ మార్కల్‌ తండ్రి థామస్‌ మార్కల్‌.. ‘ట్రంప్‌కి ఒక అవకాశం ఇవ్వండి’ అని తన అల్లుడు ప్రిన్స్‌హారీతో చెబుతూ, యు.ఎస్‌. అధ్యక్షుడి విషయంలో విశాల హృదయంతో ఆలోచించాలని సూచించడం మేఘన్‌ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చుట్టరికాలతో చొరవ చూపి పాలనా వ్యవహారాలపై సలహాలను ఇవ్వడాన్ని బ్రిటన్‌ రాజప్రాసాదం ఒక చికాకు వ్యవహారంగా పరిగణిస్తున్నట్లు బ్రిటన్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి ::: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో సోమవారం మధ్యాహ్నం.. రైల్లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణికి ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో రైల్వే అధికారులు 45 నిమిషాల పాటు రైలును ఆపి, రైల్వే వైద్య సిబ్బంది చేత సురక్షితంగా కాన్పు జరిపించారు. రైల్లో జన్మించిన ఆ శిశువుకు 25 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉచిత ప్రయాణ  సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించిన పారిస్‌ రైల్వేశాఖ.. ఆ తల్లికి శుభాభినందనలు కూడా పంపింది ::: కస్టమర్‌ కోరికపై ఎయిర్‌టెల్‌ డిష్‌టీవీ నెట్‌వర్క్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు షోయబ్‌ అనే ఆపరేటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ను ఇంటికి పంపిస్తున్నట్లు సమాచారం అందుకున్న లక్నో మహిళ పూజాసింగ్‌.. ట్విట్టర్‌లో ‘డియర్‌ షోయబ్, నువ్వు ముస్లిం మతస్తుడివి. నీ పని తీరుపై నాకు నమ్మకం ఉండదు కనుక, వేరెవరైనా హిందూ మతస్తుడిని నీ బదులుకు మా ఇంటికి పంపించే ఏర్పాటు చేయగలవు’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

దీనిపై ఎయిర్‌టెల్‌ ఆమె కోరిన విధంగానే హిందూ మతస్తుడైన ఆపరేటర్‌ను పంపుతూ, ‘ఎయిర్‌టెల్‌ మత విశ్వాసాలకు అతీతమైన సంస్థ. మీరు కూడా మాలాగే ఉండాలని ఆశిస్తున్నాం’ అని ప్రతిస్పందించింది ::: వరల్డ్‌ నెంబర్‌12 చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారికకు బిజినెస్‌మేన్‌ కార్తీక్‌ చంద్రతో సోమవారం హైదరాబాద్‌లో నిశ్చితార్థం అయింది. గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించి, 2011లో గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ గెలుపొంది, 2012, 2015, 2017 ‘ఉమెన్స్‌ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌’లలో కాంస్య పతకాలు పొంది, 2007లో అర్జున అవార్డు సాధించిన  27 ఏళ్ల హారికకు చెస్‌లో వ్లాదిమర్‌ క్రామ్నిక్, జూడిత్‌ పోల్గార్, విశ్వనాథన్‌ ఆనంద్‌.. అభిమాన చెస్‌ ప్లేయర్లు ::: హాలీవుడ్‌లో సీనియర్‌ నటీమణులు బయటికి వచ్చి తమపై జరిగిన లైంగిక వేధింపులను, లైంగిక దాడులను, లైంగిక అకృత్యాలను బయటì పెట్టిన విధంగానే బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌లు కూడా ధైర్యంగా బయటికొచ్చి, ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’కు తాము ఏ విధంగా బలయిందీ చెబితే తప్ప మన దగ్గర ఏనాటికీ ‘మీటూ’ ఉద్యమం మొదలు కాదని బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ సంచలనాత్మకమైన వ్యాఖ్య చేశారు. ఇలాంటి విషయాలలో ఒక మహిళ చేసిన ధైర్యం ఎందరో మహిళలను ముందుకు నడిపిస్తుందని ఆమె అన్నారు ::: తెలంగాణలోని మొత్తం 21 జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌లను (డి.సి.పి.యు) నెలకొల్పేందుకు రాష్ట్ర స్త్రీ,శిశు అభివృద్ధి శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు, బాలలపై హింసను నిరోధించడానికి ఈ యూనిట్లు పనిచేస్తాయి ::: పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన ‘శారదా’ చిట్‌ఫండ్‌ కుంభకోణంలో కీలక నిందితుని తరఫున వాదిస్తున్న నళినీ చిదంబరం ఈ నెల 20న (నేడు) కోల్‌కతాలోని ప్రత్యేక విచారణ కార్యాలయానికి హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు పంపింది. నళిని ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం సతీమణి ::: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement