చెత్త చక్కని ఎరువై.. పచ్చని ఇంటిపంటలై..! | Prepare Organic Manure at Home crops | Sakshi
Sakshi News home page

చెత్త చక్కని ఎరువై.. పచ్చని ఇంటిపంటలై..!

Published Tue, Jan 28 2020 6:38 AM | Last Updated on Tue, Jan 28 2020 6:38 AM

Prepare Organic Manure at Home crops - Sakshi

గుంటూరు నగరంలో తడి చెత్త, సేంద్రియ వ్యర్థాలపై గృహిణులు సమరం ప్రకటించారు. తడి చెత్త, వ్యర్థాలను మున్సిపల్‌ సిబ్బందికి ఇవ్వకుండా సేంద్రియ ఎరువు తయారు చేస్తూ.. సేంద్రియ ఎరువుతో ఎంచక్కా ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో కుండీలు, కవర్లు, కంటెయినర్లలో ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను  పెంచుతున్నారు. నగరపాలక సంస్థకు భారంగా మారిన చెత్త తరలింపు సమస్య పరిష్కారం కావడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ కూరగాయలు లభిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండి దోమలు, అంటు వ్యాధుల బెడద తగ్గుతోంది.  

గుంటూరు నగరంలోని 23,24,25,28 వార్డుల్లో గృహిణులు తమ ఇళ్ళల్లో వచ్చే తడి వ్యర్ధాలతో ఇంటి దగ్గరే కంపోస్టు తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ గుంటూరు సాధన కృషిలో భాగస్వాములవుతున్నారు. నగరపాలక సంస్థ, ఐటీసీ ‘బంగారు భవిష్యత్తు’ విభాగాల ఆధ్వర్యంలో నాలుగు వార్డుల్లో ఘన వ్యర్థాల నిర్వహణ పైలట్‌ ప్రాజెక్టు అమలును చేపట్టారు. ఇళ్లు, అపార్టుమెంట్లలో ఐటీసీ సిబ్బంది, వార్డు ఎన్విరాన్‌మెంటల్‌ సెక్రెటరీలు, వార్డు వలంటీర్లు ఎవరికి వారు ఇంట్లోనే వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీపై అవగాహన కల్పించారు. 1,572 ఇళ్ళలో హోం కంపోస్టింగ్, ఇంటిపంటల సాగు ప్రారంభమైంది.

కంపోస్టు తయారీ విధానం ఇలా..
నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఇంటికి కంపోస్టు తయారీకి 20 లీటర్ల ఖాళీ బక్కెట్‌ సరిపోతుంది. బక్కెట్‌ చుట్టూ రంధ్రాలు చేయాలి. బక్కెట్‌లో ఒక అంగుళం మేర కొబ్బరి పొట్టు వేయాలి. ప్రతి రోజూ వంట గదిలో పోగుపడే కూరగాయలు, ఆకుకూరల వ్యర్ధాలు, ముక్కలు, పండ్ల తొక్కలు, పూలు, టీ పొడిని ఈ కంపోస్టు బక్కెట్‌లో వేయాలి. తడి చెత్తను ఇందులో వేసిన ప్రతిసారీ పైన అంగుళం మందాన కొబ్బరి పొట్టును వేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ వారంలో రెండు సార్లు బక్కెట్‌లో కింది నుంచి పైకి కలియ తిప్పాలి. పది రోజుల తరువాత వేసిన వ్యర్ధాలు కుళ్లడం  ప్రారంభమవుతుంది. 45 రోజులకు నాణ్యమైన రసాయనాలు లేని సారవంతమైన సేంద్రియ ఎరువు తయారవుతోంది.

బక్కెట్‌లో ఒక్కోసారి పురుగులు కనిపించే అవకాశం ఉంటుంది. బక్కెట్‌లోని వ్యర్థాల్లో 40 శాతం తేమ ఉండేలా చేసుకోవడంతోపాటు, మార్కెట్‌లో లభ్యమయ్యే ద్రావణం వేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. వంటింటి నుంచి వెలువడే తడి చెత్త, వ్యర్థాలను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయడానికి అవసరమైన కొబ్బరి పొట్టును నగరపాలక సంస్థ ఉచితంగా ఇస్తుండడంతో గృహిణులు కంపోస్టు తయారీపై ఆసక్తి చూపుతున్నారు. వ్యర్థాల పునర్వినియోగంతో పాటు నగరవాసుల సేంద్రియ ఇంటిపంటల సాగుకు నగర పాలకుల ఊతం దొరకడం హర్షించదగిన పరిణామం.  

చెత్తకు కొత్త అర్థం ఇస్తున్నాం
ఇంట్లో చెత్తను రోడ్లపై, కాలువల్లో పడేయకుండా హోంకంపోస్టు ద్వారా ఎరువుగా మార్చి చెత్తకు కొత్త అర్ధం ఇస్తున్నాం. జీఎంసీ, ఐటీసీ సహకారంతో మా ఇంట్లోనే నాణ్యమైన ఎరువు తయారు చేసుకుంటున్నాం. మా వీధుల్లో ఎవరూ చెత్త వేయడం లేదు. దోమలు, ఈగలు తగ్గాయి.  

– ఏలూరి విజయలక్ష్మి, వేమూరివారి వీధి, గుంటూరు


వలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం
తడి వ్యర్ధాల నిర్వహణ ఇంట్లోనే జరుగుతోంది. ఇళ్ళల్లో చక్కని కిచెన్‌ గార్డెన్‌ పెంచడంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండి, దోమలు, అంటువ్యాధుల నివారణ జరుగుతోంది. ఐటీసీ సహకారంతో వార్డు వలంటీర్లు, వార్డు ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పెద్ద మొత్తంలో వ్యర్ధాలు ఉత్పత్తి చేసే కళ్యాణమండపాలు, హోటల్స్‌లో క్లస్టర్‌ కంపోస్టుల ఏర్పాటు జరుగుతోంది. ఇళ్లలోనే చెత్తతో కంపోస్టు చేయడం, కిచెన్‌ గార్డెన్ల సాగుపై నగర ప్రజలందరూ దృష్టి పెట్టాలి. స్వచ్ఛ సర్వేక్షన్‌ 2020లో నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించాలి.

– చల్లా అనురాధ, కమిషనర్, గుంటూరు నగరపాలక సంస్థ 

సొంత కంపోస్టుతో ఇంటిపంటలు సాగు చేస్తున్నాం
మా ఇంటిలో చెత్తను బక్కెట్‌లో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్నాను. ఆ కంపోస్టును మొక్కలు, ఆకుకూరలకు ఎరువుగా వేస్తుంటే ఎంతో ఏపుగా, చక్కగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువులు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేందుకు సేంద్రియ ఎరువును మేమే తయారు చేసుకొంటున్నాం. చెత్తను మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వడం లేదు.

– వేమూరి విశాలక్షి,  ఏటీఅగ్రహారం, గుంటూరు


కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం
గుంటూరు నగరంలో తడి చెత్త, వ్యర్థాల నిర్వహణపై ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నాం. సేంద్రియ ఎరువు తయారీపై గృహిణులకు అవగాహన కల్పించాం. అందుకు అవసరమైన కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం. ఈ సేంద్రియ ఎరువుతో రసాయన మందులు వినియోగం లేకుండా, చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు కిచెన్‌ గార్డెన్‌లో పెంచుకోవచ్చు. నగర ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలి.

– ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి,  జిల్లా కలెక్టర్, గుంటూరు

– ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి,  అమరావతి బ్యూరో, గుంటూరు
– గజ్జెల రాంగోపాల్‌రెడ్డి,   స్టాప్‌ ఫొటోగ్రాఫర్, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement