నాన్‌ బీటీ.. నాదే విత్తనం! | Nonbt cotton with own seeds for eight years | Sakshi
Sakshi News home page

నాన్‌ బీటీ.. నాదే విత్తనం!

Published Tue, Jun 12 2018 3:23 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

Nonbt cotton with own seeds for eight years - Sakshi

విత్తనమే లేకుంటే వ్యవసాయమే లేదు. పది వేల సంవత్సరాల క్రితం నుంచీ రైతులు తాము పండించిన పంటలో నుంచే మెరుగైన విత్తనాన్ని సేకరించి దాచుకుని.. తర్వాత సీజన్‌లో విత్తుకుంటున్నారు. అంతేకాదు, ఇతర రైతులతో విత్తనాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. అమ్ముతున్నారు. ఇది రైతుకున్న హక్కు. విత్తన సార్వభౌమత్వమే రైతు స్వాతంత్య్రానికి ప్రాణాధారం. అయితే, విత్తనం కంపెనీల సొత్తుగా మారిపోయిన ఆధునిక కాలంలోనూ.. విత్తనం కోసం అంగడికి పోకుండా.. తమదైన సొంత విత్తనాన్ని అపురూపంగా కాపాడుకుంటున్న రైతు కుటుంబాలు లేకపోలేదు. వరి వంటి పంటల్లో సొంత విత్తనాన్నే వాడుకుంటున్న రైతులు చాలా చోట్ల కనిపిస్తారు. అయితే, ఆశ్చర్యకరమేమిటంటే ఏళ్ల తరబడీ పత్తి, మిర్చి పంటల విత్తనాలూ సొంతవే వాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు తీస్తున్న కుటుంబాలు చాలా అరుదనే చెప్పాలి. అటువంటి అరుదైన రైతు దంపతులు లావణ్య, రమణారెడ్డి!

రమణారెడ్డి, లావణ్య దంపతుల స్వగ్రామం కారువంక(నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం). ఇతర పంటలతోపాటు గత 29 ఏళ్లుగా పత్తి పండిస్తున్న కుటుంబం ఇది. గత ఎనిమిదేళ్లుగా పత్తి, మిర్చి పంటలకు సొంత విత్తనాలనే వాడుకుంటూ రైతు లోకానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పత్తిని వర్షాధారంగా, మిర్చిని డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. పంట ఏదైనా కుటుంబ సభ్యులందరూ నిమగ్నమై పొలం పనులు చేసుకోవడం వీరి అలవాటు. 2010 నుంచి సుభాష్‌ పాలేకర్‌ చూపిన బాటలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నాన్‌ బీటీ సూటిరకం లోకల్‌ పత్తి విత్తనాన్నే గత ఎనిమిదేళ్లుగా వాడుతున్నారు. తమ పత్తి పంటలో 2,3 విడతల తీతల్లో నాణ్యత ఉన్న చెట్ల నుంచి దూదిని సేకరించి విత్తనం కోసం వేరుగా పక్కన పెట్టుకుంటారు. దగ్గర్లోని జిన్నింగ్‌ మిల్లులో ఆ పత్తిని జిన్నింగ్‌ చేయించి, గింజలను శుద్ధి చేయించి ఇంటికి తెచ్చుకుని తర్వాత పంట కాలంలో విత్తుకుంటారు. క్వింటా పత్తి నుంచి 65 కిలోల వరకు విత్తనాలు వస్తాయని, వాటిని శుద్ధి చేయించి ప్రతి ఏటా విత్తుకుంటున్నామని రమణారెడ్డి తెలిపారు. మార్కెట్‌లో కంపెనీలు అమ్మే జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కొనుగోలు చేయకుండా పత్తిని సైతం తన సొంత నాన్‌బీటీ సూటి విత్తనంతోనే సాగు చేస్తున్నామని తెలిపారు.  

రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు.. ఏవీ వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ఆవులు, ఎద్దులన్నీ కలిపి 16 ఉన్నాయి. ఎకరానికి ఘనజీవామృతం మొత్తం 600 కిలోలు, 400 లీ. ద్రవ జీవామృతం, అవసరం మేరకు కషాయాలు వాడుతున్నారు. ప్రతి పది పత్తి సాళ్లకు ఒక సాలు కందిని విత్తుతున్నారు. ఘనజీవామృతం దుక్కి ఎకరానికి వంద కిలోలు వేస్తారు. జీవామృతాన్ని నెలకోసారి పది రెట్లు నీటితో కలిపి మొక్కకు పోస్తారు, నెలకోసారి పిచికారీ చేస్తారు. దీపావళి రోజుల్లో పత్తిలో ఆవాలను అంతరపంటగా చల్లుతారు. తమ పత్తి పంటకు గులాబీ రంగు పురుగు బెడద అసలు లేకపోవడం విశేషం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎకరానికి వర్షాధారంగా 12–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి పొందుతున్నారు. గత ఏడాది 18 ఎకరాల్లో అధిక వర్షాల కారణంగా కొంత నష్టం జరగడంతో 219 క్వింటాళ్ల (ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున) పత్తి దిగుబడి వచ్చిందని రమణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఈ ఏడాది 10 ఎకరాల్లో నాన్‌ బీటీ పత్తిని ఇప్పటికే విత్తామని, మరో పదెకరాల్లో త్వరలో విత్తబోతున్నామని చెప్పారు.

రోహిణీ కార్తెలోనే విత్తుకోవడం..!
రోహిణీ కార్తెలో వర్షానికి ముందే తాము ఎకరానికి 3 కిలోల విత్తనాన్ని సాళ్లుగా విత్తుకుంటామని, అధిక దిగుబడి పొందడానికి ఇదే ముఖ్యకారణమని రమణారెడ్డి చెబుతున్నారు. ఒక వేళ వర్షాలు సరిగ్గా లేక విత్తనంలో సగం మొలిచినా మంచి దిగుబడే వస్తున్నదని, ఇది గత ఎనిమిదేళ్లుగా తమ అనుభవమని ఆయన అంటున్నారు. తమ సొంత విత్తనమే కాబట్టి పూర్తిగా మొలవకపోయినా మళ్లీ విత్తనం వేసుకోవచ్చన్న భరోసా వీరిలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు తమకు ఆ అవసరం ఎప్పుడూ రాలేదని అంటున్నారాయన.

ఆరుద్రలో మిరప, వరి నారు..
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎండు మిరపను డ్రిప్‌తో సొంత విత్తనంతో సాగు చేస్తూ.. ఎకరానికి 30–36 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందుతూ రమణారెడ్డి, లావణ్య తమ ప్రత్యేకత చాటుతున్నారు. నాగపూర్‌లో ఒక రైతు నుంచి గత 14 ఏళ్ల క్రితం హర్షవర్ధిని మిరప విత్తనాన్ని తెచ్చారు. 2,3 కోతల్లో మంచి నాణ్యతతో ఉన్న కాయలను విత్తనానికి పక్కన పెట్టుకుంటూ.. ఇప్పటికీ అదే వంగడం వాడుకుంటున్నామని తెలిపారు. 9 నెలల పంటకాలంలో 5 విడతలుగా ఎకరానికి 2 నుంచి 4 టన్నుల వరకు ఘనజీవామృతం వేస్తారు. 5 విడతల్లో ఎకరానికి వెయ్యి లీ. ద్రవజీవామృతం ఇస్తున్నారు. గత ఏడాది 3 ఎకరాల్లో ఎండు మిరప సాగు చేశారు. ఆరుద్ర కార్తెలో మిరప, వరి నార్లు పోసుకుని నాటు వేస్తారు. మొదట్లోనే మిర్చి పొలం చుట్టూ ఎర పంటగా ఆవాలు చల్లడం ద్వారా పురుగుల తాకిడిని అదుపు చేస్తున్నారు. మొక్కనాటిన 3 నెలల తర్వాత ధనియాలు, మెంతులు, గోధుమలు, పప్పుశనగ వంటి స్వల్పకాలిక అంతర పంటల విత్తనాలు చలుతున్నారు. గత ఏడాది ఎకరానికి 30 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీశామని రమణారెడ్డి(99513 41819) వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పూర్తిస్థాయిలో అనుసరిస్తే నాన్‌బీటీ సూటిరకం పత్తి, మిరప పంటలను కూడా నిశ్చింతగా సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చని ఈ రైతు దంపతులు చెబుతున్నారు.

ఇదేమి చోద్యం?!
రమణారెడ్డి, లావణ్య గత 8 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో చేస్తున్న సఫల ప్రయోగాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్పైసెస్‌ బోర్డు పట్టించుకున్న దాఖలాల్లేవు. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ముఖ్యమైన వాణిజ్య పంటలపై 8 ఏళ్ల క్షేత్రస్థాయి ఆదర్శ సేద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విడ్డూరం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement