సత్యం స్వర్గమార్గం – అసత్యం నరకం | Man must try to tell the truth of his eternal life to be true | Sakshi
Sakshi News home page

సత్యం స్వర్గమార్గం – అసత్యం నరకం

Published Sun, Oct 7 2018 12:51 AM | Last Updated on Sun, Oct 7 2018 12:51 AM

Man must try to tell the truth of his eternal life to be true - Sakshi

మానవుడు తన నిత్యజీవితంలో అసత్యానికి తావులేకుండా సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యమైన పనికాదు. కాని, ఈనాడు చాలామంది సత్యాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు గాని, సత్యాసత్యాల మధ్య విచక్షణ చూపుతున్నట్లుగాని  కనిపించడం లేదు. తమకు సంబంధించినంత వరకు ఇతరులు అబద్ధమాడకూడదని, తమ విషయంలో వారు నిక్కచ్చిగా ఉండాలని కోరుకుంటారు. తాము మాత్రం ఇతరుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోరు. సత్యమనే ఈ మహత్తర సుగుణాన్ని గురించి దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రజలకు ఎటువంటి హెచ్చరికతో కూడిన సందేశమిచ్చారో గమనిద్దాం. ‘సత్యం మానవులను మంచివైపుకు మార్గదర్శకం చేస్తుంది. మంచి వారిని స్వర్గం వైపుకు తీసుకుపోతుంది. అలాగే, అసత్యం మానవులను చెడువైపుకు మార్గదర్శకం చేస్తుంది. చెడువారిని నరకం దాకా తోడ్కొని వెళుతుంది.’ 

సత్యానికి ఇంతటి మహత్తు, ప్రాముఖ్యత ఉన్నాయని అందరికీ తెలుసు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు పలికేవారు కూడా సత్యానికి మించిన సంపద మరొకటి లేదని అంగీకరిస్తారు. అయినా ఆచరణలో మాత్రం తప్పులో కాలు వేస్తుంటారు. అసత్యాన్నే ఆశ్రయిస్తారు. తిమ్మిని బమ్మిని చేసి పబ్బం గడుపుకోడానికి ప్రయత్నిస్తారు. ఈనాటి పరిస్థితుల్ని మనం కాస ్తనిశితంగా గమనిస్తే, ‘అసత్యం’ అన్నది ఈనాడు చెడు అని ఎవరూ అనుకోవడంలేదు. అది చెడుల జాబితానుండి మినహాయింపు పొంది, ఒక కళగా రూపాంతరం చెందింది. పరిస్థితి చూస్తుంటే, సత్యానికి అసత్యానికి మధ్య అసలు కాస్త కూడా తేడాయే లేనట్లు అనిపిస్తోంది. చాలామంది తమ పబ్బం గడుపుకోడానికి తమకు ప్రయోజనాన్ని, లాభాలను చేకూర్చిపెట్టే ఒక సాధనంగా అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. స్వార్థం, స్వలాభాలకోసం ఎంత పెద్ద అబద్ధం పలకడానికి కూడా ఏమాత్రం సంశయించడంలేదు.

కాని, ముహమ్మద్‌ ప్రవక్త(స) ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధమాడవద్దని, సత్యం పలికిన కారణంగా మీరు సర్వస్వం కోల్పోయినా సరే అసత్యాన్ని ఆశ్రయించవద్దని హితవు పలికారు. ఇంట్లో పిల్లలకు సైతం ఏదైనా తెస్తానని, ఇస్తానని ఆశజూపి ఇవ్వకపోవడం కూడా తప్పే అన్నారు. ఇది కూడా అసత్యమే అవుతుందని, రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవలసి ఉంటుందని సెలవిచ్చారు. ఒకవేళ మానవ సహజ బలహీనత కారణంగా, పొరపాటున ఏదైనా అసత్యం దొర్లిపోతే, దానికి చింతించి, పశ్చాత్తాపంతో దైవాన్ని  క్షమాపణ వేడుకోవాలని సూచించారు. కనుక, సాధ్యమైనంతవరకు సర్వకాల సర్వావస్థల్లో సత్యమే పలకడానికి, అబద్ధాలకు దూరంగా ఉంటూ దేవుని ప్రేమకు పాత్రులు కావడానికి ప్రయత్నిద్దాం. అబద్ధాలకోరును ప్రజలు ఎన్నటికీ నమ్మరు, విశ్వసించరు, ప్రేమించరు, ఆదరించరు, గౌరవించరు. ఇది నిజం. అల్లాహ్‌ మనందరికీ సదాసత్యమే పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement