తొందరపడి ఆపరేషన్... ఇప్పుడు బిడ్డ కావాలి! | health counceling for homeopathic | Sakshi
Sakshi News home page

తొందరపడి ఆపరేషన్... ఇప్పుడు బిడ్డ కావాలి!

Published Wed, May 11 2016 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

తొందరపడి ఆపరేషన్... ఇప్పుడు బిడ్డ కావాలి!

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. ఈ వేసవిలో విహారయాత్రకు వెళ్లొచ్చిన తర్వాత ఆకలి మందగించింది. మలబద్దకంగా అనిపించడంతో పాటు మూత్రం పచ్చగా వస్తోంది. కొందరు కామెర్లు వచ్చాయని అంటున్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా?
- రాజ్‌కుమార్, హైదరాబాద్

 కామెర్లు అనేది కాలేయ సంబంధిత వ్యాధి. ఒక వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని కంటే ముందుగా ఇతరులే దీన్ని గుర్తిస్తారు. రక్తంలో బిలురుబిన్ పాళ్లు పెరిగినప్పుడు చర్మం, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేన్స్‌లో పసుపుపచ్చ రంగు తేలడాన్ని పచ్చకామెర్లు అంటారు. శరీరానికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్‌ను రక్తంలోకి ఎర్రరక్తకణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హీమోగ్లోబిన్‌లోని హీమ్ అనే పదార్థం ప్లీహం (స్ల్పీన్)లో శిథిలమైపోయి బైలురుబిన్, బైలివర్డిన్ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతాయి.

శరీరంలో పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా చెప్పవచ్చు. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి, పైత్యరసంతో పాటు కాలేయ వాహిక (బైల్ డక్ట్) ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కామెర్లకు కారణాలు:   హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే వైరస్‌ల కారణంగా కామెర్లు వచ్చే అవకాశం ఉంది  ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం  పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు  కాలేయం పాడైపోవడం  కాలేయం నుంచి పేగుల్లోకి వెళ్లే కాలేయ వాహికలో అంతరాయం ఏర్పడటం వంటివి జరిగితే కామెర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది.

లక్షణాలు:   వికారం, వాంతులు  పొత్తికడుపులో నొప్పి  జ్వరం, నీరసం, తలనొప్పి

కడుపు ఉబ్బరంగా ఉండటం  కామెర్లు సోకినప్పుడు కళ్లు పచ్చబడటం. వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఎల్‌ఎఫ్‌టీ, సీటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రా సౌండ్ స్కాన్ చికిత్స: కామెర్లను తగ్గించడానికి హోమియోపతిలో మంచి మందులున్నాయి. రోగి లక్షణాలను, శారీరక, మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకొని డాక్టర్లు మందులు సూచిస్తారు. ప్రారంభదశలోనే వాడితే కామెర్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు హోమియోలో చెలిడోనియం, సెలీనియం, లైకోపోడియం, మెర్క్‌సాల్, నాట్‌సల్ఫ్ వంటి మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.

 పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాపకు 10 నెలలు. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం నీలంగా మారిపోతోంది. ఇది చాలా ఆందోళనగా కలిగిస్తోంది. మా పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.    - ధరణి, కోదాడ

 మీ పాప సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండటంతో ఇలా జరుగుతోంది. పిల్లల్లో కోపం / ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఈ సమస్య గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువ. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఈ లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది.

బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, పాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం అవసరం. ఎందుకంటే గుండెకు సంబంధించిన తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి చేయాల్సిన పని. ఇక చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరం.  పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య

 ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ సమస్య కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా పాపకు ఏవైనా తీవ్రమైన సమస్య ఉన్నాయేమోనని తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్‌ను ఒకసారి సంప్రదించండి.

ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. జీవితంలో సెటిల్ అవకముందే పిల్లలు ఎందుకని గతంలో 3 సార్లు మందుల ద్వారా, 2 సార్లు ఆపరేషన్ ద్వారా గర్భధారణ కాకుండా అడ్డుకున్నాం. ఈ మధ్యే ఒక పాప పుట్టింది. ఏదో కంగారులో మా వారు డెలివరీ సమయంలోనే నాకు కు.ని. ఆపరేషన్ చేయించడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడేమో ‘తొందర పడ్డాను, మళ్లీ పిల్లలు కావాలంటే ఎలా’ అని బాధపడుతున్నారు. ఐవీఎఫ్, సర్రోగసీ లాంటి ఖర్చుతో కూడిన పద్ధతులు కాకుండా ఆపరేషన్ జరిగాక కూడా వేరే ఏదైనా పద్ధతి ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందా? ఒకవేళ వీలైనా భవిష్యత్‌లో నాకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా తెలియజేయగలరు?  - ఓ సోదరి, విజయవాడ

 గర్భధారణ ప్రక్రియ నార్మల్‌గానే జరిగేందుకు వీర్యం, అండం, ఫెలోపియన్ ట్యూబ్స్  అవసరం. ట్యూబెక్టమీ ఆపరేషన్‌లో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ రెండింటినీ బ్లాక్ చేస్తారు. ఫలితంగా వీర్యం, అండం ఈ ట్యూబ్‌లలో కలవడానికి వీలుండదు. తద్వారా గర్భాన్ని నివారించడం జరుగుతుంది. ట్యూబెక్టమీ జరిగితే మీకు నార్మల్‌గా  గర్భధారణ సాధ్యం కాదు. ఇక ఉన్న మార్గాల్లో ఒకటి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్). ఇందులో మీ నుంచి అండాన్ని, మీ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి, ల్యాబ్‌లో ఫలదీకరణం చేసి, ఇలా రూపొందిన పిండాన్ని మీ గర్భసంచి (యుటెరస్)లోకి ప్రవేశపెడతారు. కానీ మీరు ఈ ప్రక్రియ పట్ల ఆసక్తిగా లేరు. ఇక రెండో మార్గం... మీ ట్యూబ్స్ మార్గాన్ని పునరుద్ధరించడం. దీన్ని ట్యూబల్ రీ-కెనలైజేషన్ అని అంటారు.

ఈ ప్రక్రియలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లో మూసిన మీ ట్యూబ్స్‌ను మళ్లీ తెరుస్తారు. అయితే దీన్ని తెరిచే ముందర కొంత ప్లానింగ్ అవసరం. ఇందులో మీ ఫెలోపియన్ ట్యూబ్‌ల పొడవు, అక్కడ మిగిలి ఉన్న ట్యూబ్‌ల సైజును బట్టి, ఈ ప్రక్రియ ఎంత వరకు విజయవంతమవుతుందో చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో మీకు మత్తు (అనస్థీషియా) ఇచ్చి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి ముందర మీ దంపతులతో కొన్ని చర్చలు, కొంత కౌన్సెలింగ్ అవసరం. ఇక సరోగసీ లాంటి ప్రక్రియలు మీ కేసులో అవసరం లేదు. గతంలో మీరు మూడు సార్లు మందుల ద్వారా, రెండు సార్లు ఆపరేషన్‌తో రెండు సార్లు గర్భధారణను అడ్డుకున్నారు.

అలాంటి ప్రక్రియలతో కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డంకులు ఏర్పడటం, మూసుకుపోవడం, గర్భసంచి లోపలి పొర అతుక్కుపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. అలాంటి ప్రమాదాలు నివారించేందుకు తాత్కాలిక గర్భనివారణ మార్గాలు ఎన్నో ఉన్నాయి. మీరు వాటిని అనుసరించి ఉండాల్సింది. అది జరిగిపోయిన విషయం కాబట్టి ఇప్పుడు మీరు తదుపరి బిడ్డ కోసం గట్టిగా నిశ్చయించుకుంటే, ఒకసారి మీకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి మీ డాక్టర్‌తో ఒకసారి నేరుగా చర్చించండి. మీకు ఉపయుక్తమైన మార్గాన్ని అవలంబించండి.

Advertisement
 
Advertisement
 
Advertisement