ఫిట్స్... మళ్లీ రాలేదని మందులు ఆపద్దు | Fits ... never again do not stop drugs | Sakshi
Sakshi News home page

ఫిట్స్... మళ్లీ రాలేదని మందులు ఆపద్దు

Published Mon, May 23 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

Fits ... never again do not stop drugs

హోమియో కౌన్సెలింగ్

 

మా అబ్బాయికి 21 సం. కొంతకాలంగా విపరీతమైన నడుంనొప్పి, వెన్నెముక బిరుసుగా మారి ముందుకు వంగినట్లుగా నడవడం వంటి సమస్యలతో బాధపడుతుండడంతో డాక్టర్ ని సంప్రదించాం. ఆయన కొన్ని పరీక్షలు చేయించి, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌గా నిర్థారించారు. హోమియో చికిత్స ద్వారా దీనికి పరిష్కారం లభించే అవకాశం ఉందా?   - డి. యాదవేణి, హైదరాబాద్

మీరు ఆందోళన చెందకండి. హోమియో చికిత్స ద్వారా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మన శరీరంలో వెన్నెముకది కీలకమైన పాత్ర. వెన్నెముక ఏదైనా వ్యాధికి గురైతే దానిలో మార్పులు సంభవించి, సాధారణ కదలికలు కష్టతరంగా మారడమే కాకుండా ఆ ప్రాంతం నుంచి వెలువడే నరాలపై ఒత్తిడి పడితే తీవ్రమైన నొప్పి, ఇతర సమస్యలూ తలెత్తుతాయి.

 
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్: ఇది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇతర ఆర్థరైటిస్ సమస్యలలాగే ఈ వ్యాధిలో కూడా వెన్నెముక శోథకు గురయి నొప్పిని కలిగిస్తుంది. ఈ సమస్య తీవ్రస్థాయికి చేరితే శోథకు గురైన వెన్నుపూసలు, ఇతర జాయింట్ల ఎముకలు అసాధారణంగా పెరిగి ఒకదానితో ఒకటి కలిసిపోయి బిరుసుగా, వెదురు కర్రలా మారుతుంది కాబట్టి దీనిని వైద్యపరిభాషలో బాంబూ స్పైస్ అని కూడా అంటారు. ఇలా మారిన వెన్నెముక తన సాధారణ కదలికలు కోల్పోయి కొంచెం ముందుకు వంగడం జరుగుతుంది. తుంటి ప్రాంతంలోని వెన్నెముకను ముఖ్యంగా దెబ్బతీయడం ఈ వ్యాధి ప్రత్యేకత. ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేసే ఈ సమస్య ముఖ్యంగా 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్త్రీల కంటే పురుషులలో ఎక్కువ. ఇది వెన్నెముకను మాత్రమే కాకుండా ఇతర జాయింట్లను, అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది.


కారణాలు: జన్యుపరమైన అంశాలు, కుటుంబ చరిత్ర వ్యాధి కారణం.

 
లక్షణాలు: సాధారణం నుండి తీవ్రస్థాయి నడుం నొప్పి, తుంటి, పిరుదులలో కూడా నొప్పి. వెన్నెముక, జాయింట్లు బిగువుగా మారి కదలికలు కష్టతరంగా ఉండటం. కళ్లు ఎర్రగా మారడం, మంట, వెలుతురును చూడలేకపోవటం, చూపు మందగించటం, బరువు తగ్గడం, ఆకలి లేమి, నీరసం, రక్తహీనత వంటివి.

 
ఈ వ్యాధి వల్ల గుండెలోని కవాటాలు దెబ్బతిని, గుండె సమస్యలు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వ్యాధి తీవ్రంగా ఉంటే వెన్నెముక నుండి వచ్చే నరాలపై ఒత్తిడి పడడంతో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారటం, సత్తువ కోల్పోవడం వంటి లక్షణాలుంటాయి. 

హోమియో చికిత్స: హోమియోలో జెనెటిక్స్ కాన్‌స్టిట్యూషనల్ విధానంలో వ్యాధి లక్షణాలను తగ్గించడమే కాకుండా, వ్యాధి మూలాలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా తొలిదశలోనే వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు.

 

డాక్టర్  శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్  హోమియోకేర్ ఇంటర్నేషనల్  హైదరాబాద్

 

న్యూరో కౌన్సెలింగ్

 

 మా బాబుకు 12 ఏళ్లు. ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి ఫిట్స్ వచ్చాయి. డాక్టర్ పరీక్షలు చేసి, మందులు రాసిచ్చి ఒక నెల వాడమన్నారు. మళ్లీ రమ్మన్నారు. అలాగే చేశాం. కానీ మళ్లీ రాకపోవడంతో ఇక డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఫిట్స్ వచ్చాయి. అలా ఫిట్స్ వచ్చినప్పుడు వాడి నోటి నుంచి నురుగు రావడం, కళ్లు తేలేయడం, కొన్ని నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చేయడం జరుగుతోంది. మా బాబుకు మళ్లీ మళ్లీ ఫిట్స్ రావడం మాకు ఆందోళన కలిగిస్తోంది. మా బాబు సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - శకుంతల, విజయవాడ
వేర్వేరు కారణాల వల్ల మన మెదడు ఎప్పుడైనా తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఇలా ఫిట్స్ (మూర్చ లేదా సీజర్స్) రావడం సాధారణమే. ఇందుకు అంతగా కంగారు పడాల్సిన  అవసరం లేదు. ఇవి అంతగా ప్రమాదకరమైనవి కాదు. ఫిట్స్‌కు గురైన వ్యక్తి కొన్ని నిమిషాల తర్వాత ఎలాంటి మెడికల్ ట్రీట్‌మెంట్ లేకుండానే కోలుకుంటాడు. ఈ సమయంలో కొందరు మూర్ఛకు గురైన వ్యక్తి చేతిలో ఇనుము లేదా తాళం చెవి పడుతుంటారు. దీని వల్ల ఆ వ్యక్తికి ఎలాంటి లాభం చేకూరదు.

 
కొందరైతే అలాంటి సమయంలో నోటిలో ఇనుప వస్తువు లేదా గుడ్డలు పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఆ సమయంలో పేషెంట్‌కి గాలి బాగా ఆడాలి. శ్వాస తీసుకోడానికి ఎలాంటి ఇబ్బందీ కలగకూడదు. ఫిట్స్ వచ్చినప్పుడు సదరు వ్యక్తిని ఒక పక్కకు ఓరగా గానీ లేదా వెల్లకిలా పడుకోబెట్టి వీలైనంతవరకు గాలి పీల్చుకోడానికి ఇబ్బంది లేకుండా చూడాలి. ఫిట్స్ అటాక్ తర్వాత ఆ వ్యక్తి అలసిపోయి చాలాసేపటి వరకు పడుకొని ఉంటాడు. అయితే ఫిట్స్ నుంచి కోలుకున్న వ్యక్తిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి, ఫిట్స్‌కి గల అసలు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారే వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే మళ్లీ తక్కువ సమయంలో మళ్లీ మళ్లీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఒత్తిడి వల్ల బ్రెయిన్‌లో మార్పులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే ఉత్తమం.

 
అలాగే ఫిట్స్ అటాక్ తర్వాత అలసిపోయి పడుకున్న పేషెంట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిద్ర నుంచి లేవని పక్షంలో దాన్ని సీరియస్ మెడికల్ సమస్యగా గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స అందించాలి.

 

డాక్టర్ బి.జె.రాజేశ్
సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

 

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్


నాకు ఎనిమిది నెలల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో జరిపిన రక్తపరీక్షల్లో హెపటైటిస్-బి పాజిటివ్ అని చెప్పారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే, మళ్లీ హెపటైటిస్-బి పాజిటివ్ అన్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు.  - లక్ష్మయ్య, వరంగల్
మీకు నిర్వహించిన రక్తపరీక్షలో ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్-బి పాజిటివ్ వచ్చిందన్నారు. దాన్నిబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్-బి అనే వ్యాధి ఉంది అని తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్త పరీక్షలు (హెచ్‌బీసీఏజీ, యాంటీ హెచ్‌బీసీఏజీ, ఎల్‌ఎఫ్‌టీ, హెచ్‌బీవీ డీఎన్‌ఏ వంటివి) చేయించుకొని, వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకోవాలి. చాలామందిలో వ్యాధి ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి యాక్టివ్ స్టేజ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. వ్యాధి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నవారికి ఎలాంటి మందులూ అవసరం లేదు. మీరు చేయవలసినదల్లా ప్రతి 3 నుంచి 6 నెలల కొకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, ఎల్‌ఎఫ్‌టీ పరీక్ష చేయించుకొని మీ వ్యాధి యాక్టివ్ దశలోకి ఏమైనా వెళ్లిందా అని చూసుకోవాలి. యాక్టివ్ దశలోకి వెళ్తే, అప్పుడు వివిధ రకాల మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గర్లోని వైద్యనిపుణుడిని సంప్రదిస్తే వాటిల్లో ఏది వాడాలో సూచిస్తారు.

 

నాకు చాలా రోజులుగా ఛాతీలో మంట వస్తోంది. దగ్గర్లోని మెడికల్ షాపులో అడిగితే ఒక మందు ఇచ్చారు. అది తాగినప్పుడు మంట తగ్గుతోంది. తర్వాత యథావిధిగా మంట వస్తోంది. అది తగ్గడానికి మార్గం చెప్పండి. - రాజశేఖర్, కోదాడ

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు తెలుస్తోంది. వీలైతే మీరొకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవడం మంచిది. మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మీ వ్యాధి లక్షణాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని సూచనలు...  కొవ్వు పదార్థాలు తగ్గించండి, కాఫీ, టీలను మానేయండి  పొగతాగడం, మద్యం అలవాటు ఉంటే పూర్తిగా మానేయండి  మీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఎక్కువగా అది తగ్గించుకోండి  తిన్న వెంటనే నిద్రించకండి  పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్ సలహా మేరకు హెచ్-2 బ్లాకర్స్, పీపీఐ మందులు వాడండి.

 

డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

 

Advertisement
 
Advertisement
 
Advertisement