స్ట్రెచ్ యోగా సాగిపో హ్యాపీగా! | Continue Yoga Stretch happy! | Sakshi
Sakshi News home page

స్ట్రెచ్ యోగా సాగిపో హ్యాపీగా!

Published Wed, Jan 6 2016 10:45 PM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM

స్ట్రెచ్ యోగా  సాగిపో హ్యాపీగా! - Sakshi

గత వారం ప్రాథమిక ఆసనాలైన సూర్య నమస్కారాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరికొన్ని ప్రాథమిక ఆసనాలు... తాడాసనం, తాళాసనం, కటి చక్రాసనం గురించి తెలుసుకుందాం. ఇవి శరీరాన్ని చురుగ్గా ఉంచడంలో సాయం చేస్తాయి.
 కీళ్ల నొప్పులను, కండరాల బాధలను ఇవి దూరం చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాయి.
 
యోగావగాహన....
 శారీరక ధృఢత్వానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు, మునులు అందించిన శాస్త్రం హఠయోగం. దీనిని తొలుత 8వ శతాబ్దంలో స్వాత్మారామ అనే గురువు హఠయోగ ప్రదీపిక పేరిట గ్రంథ రూపంలో అందించారు. స్వాత్మారాముడు ప్రథమ శ్లోకంలోనే రాజయోగ ఉపయోగార్థం ఈ హఠయోగాన్ని ఇస్తున్నట్టు చెబుతాడు. పతంజలి ఇచ్చిన యోగ దర్శనానికి అనుగుణంగా ధ్యానానికి శరీరాన్ని సిద్ధం చేయడం హఠయోగ సాధన ముఖ్యోద్దేశం.
 
 శాస్త్రం కాబట్టి యోగాను శాస్త్రీయ దృక్పథంతోనే ఆచరించాలి. యోగా అనే పదం యంగ్ అనే పదంలో నుంచి వచ్చినట్టయితే దాని అర్థం సంయోగం. అంటే శరీరాన్ని, శ్వాసను మనసుతో అనుసంధానం చేసి సమన్వయం చేయడం. దీనికి మూలం ‘యోక్’ అయినట్లయితే దాని అర్థం కాడి. రైతు పొలం దున్నేటప్పుడు కాడికి కుడి ఎడమ వైపున కట్టిన ఎడ్ల కదలికలో సమతుల్యం ఉండేటట్టుగా ఎలా చూస్తాడో అలాగే యోగాసన, ప్రాణాయామ సాధన చేసేటప్పుడు శరీరంలో ఎడమ, కుడి భాగాలను మెదడులో ఎడమ, కుడి గోళార్ధములను, ఇడ-పింగళ నాడులను సమంగా పనిచేసేటట్టుగా చూడాలి.
 
తాళాసన

(తాళ అంటే తాడిచెట్టు) రెండు కాళ్లను ఒక చోట చేర్చి సమంగా నిలబడి నెమ్మదిగా చేతులను శరీరం పక్క నుంచి తలపైకి తీసుకెళ్లి, పైన ఆకాశం వైపు చూపుతూ వాటిని ఇంటర్ లాక్ చేయాలి. కాలిమడమలు పెకైత్తి మునివేళ్ల మీద నిలబడి శరీరాన్ని వీలైనంత వరకూ పైకి సాగదీస్తూ శక్తి ప్రవాహాన్ని వెన్నెముక కింది భాగం నుంచి తలపై భాగం వరకూ ప్రసరించడాన్ని గమనించాలి. దీని వల్ల వెన్నెముక ధృఢంగా అవడంతో పాటు వెన్నెముక పూసల మధ్య ఖాళీ పెరుగుతుంది. పూసల మధ్యలో ఉన్న డిస్క్‌లకు వ్యాకోచత్వం పెరిగి, స్లిప్డ్ డిస్క్ డిస్క్ ప్రోలాప్స్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒక వయోపరిమితి వరకూ ఎత్తు పెరగడానికి కూడా ఈ ఆసనం ఉపకరిస్తుంది. శ్వాస తీసుకుని శరీరాన్ని పైకి సాగదీసేటప్పుడు పొట్టని లోపలికి లాగడం ద్వారా పొట్టలో ఉన్న కొవ్వు కరిగే అవకాశంతో పాటు, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
 
తాడాసన
(తాడ అంటే పర్వతము) నిటారుగా నిలుచుని వెన్నెముకను నిదానంగా సాగదీయాలి. చేతులు శరీరానికి పక్కగా ఉంచాలి. ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాసను పీలుస్తూ, వదులుతూ ఉండాలి. శరీరానికి ఇది చక్కటి విశ్రాంతిని అందిస్తుంది.
 
కటి చక్రాసనం

రెండు పాదాలను ఒక చోట చేర్చి నిటారుగా నిలబడాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ కుడిచేతిని పెకైత్తాలి. తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ (కుడిచేతిని తలకి ఆనంచి) దేహాన్ని ఎడమవైపునకు వంచాలి. ఆసనంలో కొద్దిసేపు ఉండి, నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదిలేస్తూ కుడిచేయి కిందకు తీసుకురావాలి. ఎడమవైపు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. దీని వల్ల నడుము కుడి ఎడమ భాగాల్లో కొవ్వు తగ్గడమే కాక వెన్నెముకలో ధృఢత్వం, సాగే గుణం పెరుగుతుంది.
 
ఎ.ఎల్.వి. కుమార్
ట్రెడిషనల్ యోగా సెంటర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement