ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది... | Breathing is difficult to ... | Sakshi
Sakshi News home page

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది...

Published Wed, Sep 18 2013 11:33 PM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది...

 మా పాప వయసు ఏడేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాఫీగా సాగడం లేదంటూ చెబుతోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం తాత్కాలికంగానే ఉంటోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి.
 - విశాలాక్షి, అమరావతి

మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర ఇన్‌ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా  కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి.

మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న  చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండాను, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్ ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అంటే... అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటిగాలి, ఎక్సర్‌సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమో షనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
 
 ఇక మీ పాప విషయంలో  ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో  చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ-  కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునో గ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్,  సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు.
 
 దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీ హిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి  ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్ తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్ము ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని లేదా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
 పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement