వక్క లెక్కే వేరు! | Areca palm of income | Sakshi
Sakshi News home page

వక్క లెక్కే వేరు!

Published Tue, Sep 4 2018 5:18 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

Areca palm of income - Sakshi

ప్రయోగ శీలి అయిన రైతే కొండంత ధైర్యంతో సరికొత్త పంటలను పలకరించగలడు.  అటువంటి విలక్షణ రైతే వేమూరి కోటేశ్వరరావు. ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల దిగుబడినిచ్చే వక్క, జాజి, మిరియం వంటి అరుదైన పంటలను శ్రద్ధతో సాగు చేస్తూ.. గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వేసవి పగటి ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా నమోదయ్యే జిల్లాల్లో వక్క దిగుబడి కొంత తక్కువగా ఉంటుందని.. జాజి, మిరియాల దిగుబడి బాగానే వస్తుందంటున్నారాయన. ప్రకృతి వ్యవసాయదారుడు కోటేశ్వరరావు అనుభవ పాఠాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం..

ఉద్యాన తోటల సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న అన్నదాత వేమూరి కోటేశ్వరరావు. ఆయన ప్రకృతి వ్యవసాయ  క్షేత్రం కొత్త పంటలకు, ఔషధ పంటలకు నిలయం. కృష్టా జిల్లా పమిడిముక్కల మండలం పడమట లంకపల్లి గ్రామం నుంచి∙1999లో విజయనగరం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయితీ బట్టివలస గ్రామానికి కోటేశ్వరరావు వలస వచ్చి స్థిరపడి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వక్కతోపాటు ఔషధ మొక్కలను కలిపి సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు.

మొదట్లో చేదు అనుభవం...
కర్ణాటకలోని శృంగేరీలో వక్క పంట సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అక్కడి నుంచి  మంగళ, సుమంగళ, శ్రీమంగళ, మెహిత్‌నగర్‌ రకాల విత్తనాన్ని తెప్పించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన మెహిత్‌నగర్‌ రకం అధిక దిగుబడినిస్తుంది. 2003లో ఆయిల్‌పామ్‌ తోటలో అంతరపంటగా వక్క సాగు ప్రారంభించారు. కానీ, ఆ విధానం వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. దీంతో వక్క తీసేశారు. 2009లో మళ్లీ రెండెకరాల్లో వక్క సాగు మొదలు పెట్టారు. ఐదు సంవత్సరాలకు ఫలసాయం రావటం మొదలైంది. ఆ ఉత్సాహంతో మరో ఐదెకరాల్లో వక్క మొక్కలు వేశారు.  అలా ఏటా పెంచుకుంటూ వెళ్లి ప్రస్తుతం 14 ఎకరాల్లో వక్క సాగు చేస్తున్నారు. సాధారణంగా ఐదున్నరేళ్లకు తొలి దిగుబడినిచ్చే వక్క పంట ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న కోటేశ్వరరావు పొలంలో నాలుగున్నరేళ్లకే  ఫలసాయాన్ని అందిస్తున్నది.

అరటి+ వక్క+మిరియం+జాజి...
వక్క సాగు కొత్త కావటంతో కోటేశ్వరరావు తొలుత సాళ్లమధ్య, మొక్కల మధ్య 6 అడుగుల దూరంలో వక్క నాటారు. చెట్లు పెరిగేటప్పటికి బాగా వత్తుగా అయి, ఎత్తు పెరిగిపోతున్నాయి. పొలం మొత్తాన్నీ 7.5 అడుగుల దూరంలో బోదెలు తోలుకొని.. రెండు వరుసలు ఎటు చూసినా 7.5 అడుగుల దూరంలో వక్క నాటుకోవాలి. మూడో వరుసలో జాజి మొక్కలు నాటుకోవాలని కోటేశ్వరరావు తెలిపారు. వక్క ఎత్తు పెరిగాక మిరియం తీగలు పాకించాలి. మొదట్లోనే వక్క మొక్కలు నాటకూడదు. ఎండకు తట్టుకోలేవు. మొదట అరటి మొక్కలు నాటి నాలుగైదు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత వక్క మొక్కలు నాటుకోవాలి. విజయనగరం జిల్లా వాతావరణానికి వచ్చినంతగా కృష్ణా తదితర జిల్లాల్లో వక్క దిగుబడి రాదు. మార్చిలో వక్క పిందె వస్తుంది. ఎండలకు పిందె కొంత రాలుతుంది కాబట్టి దిగుబడి తగ్గుతుంది. మిరియం, జాజి దిగుబడి ఆ జిల్లాల్లోనూ బాగానే వస్తున్నదంటున్నారని కోటేశ్వరరావు వివరించారు.   

వక్క ఆదాయం ఎకరానికి రూ. లక్షన్నర
ఒక చెట్టు నుంచి రెండు కేజీల వక్క కాయలు ఏటా లభ్యమవుతాయి. వక్క, జాజి చెట్లు ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల వరకు ఆదాయాన్నిస్తాయి. కేజీ వక్క రూ.120 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. ఎకరా పొలంలో 750 వరకూ వక్క మొక్కలు నాటుకోవచ్చు. అంతర పంటలు లేకుంటే వెయ్యి మొక్కలు నాటుకోవచ్చు. దగ్గరగా వేస్తే ఎత్తుగా పెరుగుతుంది. దానివల్ల గెలలు కోయడానికి ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఏడాదికి ఎకరాకి రూ.1.5 లక్షలకు పైబడి ఆదాయం లభిస్తుంది.

అంతరపంటగా వేసిన జాజి, మిరియం కూడా మంచి ఆదాయాన్నిస్తుంది. వక్కలో ఏడేళ్ల తర్వాత దిగుబడి పెరుగుదల నిలిచిపోతుంది. జాజిలో ప్రతి ఏటా దిగుబడి పెరుగుతుందని కోటేశ్వరరావు అంటున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా జీవామృతాన్ని, వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణాన్ని సాగుకు వినియోగిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఆయన సాగుచేస్తున్న ఔషధ మొక్కలతో పలువురు రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు. మండలంలో ఎవరికైనా పాము కరిస్తే ముందు గుర్తుచ్చేది కోటేశ్వరరావే. ఉల్లిపాము(రక్తపింజరి) కాటుకు ఆయుర్వేద మందును కోటేశ్వరరావు ఉచితంగా అందిస్తుంటారు.

మిశ్రమ పంటల సాగు లాభదాయకం
వక్క పంట విత్తనాలను మొక్కలుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, అంబాజీపేట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వారు మన రాష్ట్రంతో పాటుæ హైదరాబాద్, కర్ణాటక పట్టణాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఒక్కో మొక్క రూ.16 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. వక్క చెట్టు మట్టల(జంటలు)తో చక్కని పేపరు ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ పంట అధికంగా కర్ణాటకలో సాగులో ఉంది.  ఇందులో మిశ్రమ పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అంతే కాకుండా ఆయుర్వేదిక్‌ మార్కెట్లో గిరాకి కలిగిన అతిమధురం,  సరస్వతి, నేలవేము, దుంపరాష్ట్రం తదితర ఔషధ పంటలతో పాటు మిరియాలు వంటి సుగంధ ద్రవ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం లేదు!
ఉత్తరాంధ్రలో వక్క పంటను ప్రత్యేకంగా సాగు చేస్తున్నది నేనొక్కడినే. వక్క పంట సాగుకు  ప్రత్యేక వాతావరణం అవసరం. ఈ మొక్కలు అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. నేలలో తేమ మాత్రమే ఉండాలి. నీరు నిల్వ ఉండకూడదు. మక్కువ మండలంలో ఇలాంటి వాతావరణం ఉండటం వల్ల వక్క సాగుకు అనుకూలత ఏర్పడింది. దీంతో ఇతర జిల్లాలతో పోలిస్తే మన దగ్గర దిగుబడి బాగుంటుంది. కుళ్లిన అరటి చెట్ల ఆకులు, గోమూత్రం, పేడ సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి.

అంతర పంటల ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు తీరిపోతాయి. వక్కలో అంతరపంట మిరియాలతో వచ్చిన ఆదాయంతో వక్క పంటకు వెచ్చించిన ఖర్చు వచేస్తుంది.  ఈ ఏడాది జాజికాయ, నల్ల మిరియాల పంటల సాగు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇతర రాష్ట్రాల్లో వక్క పంట సాగుకు ప్రభుత్వ రాయితీలున్నాయి. మన రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. దాంతో, ఎంతగా అవగాహన కల్పించినా వక్క సాగు చేసేందుకు మన రైతులు ఆసక్తి కనబరచడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవలే జాజికాయ సాగు మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  

వక్క మొక్కల నర్సరీ ఆకు ముడత రానివ్వదు!
ఇది సిక్కిం రాష్ట్రానికి చెందిన దేశవాళీ మిరప రకం. ఆకు ముడతను దరి చేరనివ్వకపోవడం, ఒకసారి నాటితే అనేక సంవత్సరాలు దిగుడినివ్వటం (బహువార్షిక రకం), చక్కని వాసన కలిగి ఉండటం.. ప్రత్యేకతలు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రైతు బాలరాజు(98663 73183) దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్‌– 83329 45368.
చీడపీడల నివారణలో..

చేతిని మించిన సాధనం లేదు!
కాకర ఆకుల మీద పసుపు రంగు నల్లులు చేరి పత్రహరితాన్ని తింటాయి. ఆకులన్నీ అస్థిపంజరాల వలె అవుతాయి. నివారణ ఏ మందులూ అవసరం లేదు. చీడపీడల నివారణలో, చేతిని మించిన సాధనం లేదు! ఆకులపై నల్లులు కనిపిస్తే చేతి వేళ్లతో నలిపేయాలి. అలా వరుసగా రెండు, మూడు రోజులు చెయ్యాలి. ఈ పని చేస్తే నల్లుల సమస్య సునాయాసంగానే పోతుంది.
– తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు



– వేమూరి కోటేశ్వరరావు (94407 45555), వక్క రైతు, బట్టివలస, మక్కువ మండలం, విజయనగరం జిల్లా


దివంగత వైఎస్సార్‌ నుంచి అవార్డు స్వీకరిస్తున్న కోటేశ్వరరావు

వక్కల చెట్లకు పాకిన మిరియాల పాదులు


– బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం
ఫొటోలు: బత్తెన శాంతీశ్వరరావు, మక్కువ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement