కలబంద ద్రావణంతో పంటలకు మేలు | Aloe vera is good for crops | Sakshi
Sakshi News home page

కలబంద ద్రావణంతో పంటలకు మేలు

Published Tue, Jul 17 2018 3:42 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

Aloe vera is good for crops - Sakshi

ప్రకృతి నేర్పిన పాఠాలను ఆకళింపు చేసుకొని ప్రకృతి/సేంద్రియ సేద్యాన్ని ఔపోశన పట్టి, నేర్చుకున్న విషయాలను పదుగురు రైతులకు తెలియజెపుతూ చక్కని దిగుబడులు రాబడుతున్నారు మహిళా రైతు అప్పన్నగారి యశోదమ్మ. కలబంద వంటి అనేక మొక్కల ద్రావణాలతో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లా చిన్నమండెం మండలం చిన్ననర్సుపల్లె గ్రామానికి చెందిన యశోదమ్మ స్వతహాగా రైతు. పెట్టుబడిలేని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విభాగంలో క్లస్టర్‌ రిసోర్సు పర్సన్‌గా పనిచేస్తున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, పత్తి, టమాటా, వంగ, బెండ, మిరప, సొర, బీర తదితర కూరగాయ పంటలు, మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలను ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు కలబంద ద్రావణం చక్కటి పరిష్కార మార్గమని ఆమె అనుభవపూర్వకంగా చెబుతున్నారు.   

కలబంద ద్రావణం తయారీ ఇలా..
2 కిలోల కలబంద ఆకులను దంచి పెట్టుకోవాలి. అలాగే, పావు కిలో కుంకుడు కాయలను పొడి చేయాలి. 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, 5 కిలోల ఆవు పేడను సేకరించాలి. వీటిలో ఆవుపేడ తప్ప మిగతా అన్నిటినీ 200 లీటర్ల నీరుపట్టే డ్రమ్ములో వేసి.. తర్వాత ఎంతపడుతుందో అంత నీరు పోయాలి.  ఆవు పేడను ఒక పలుచటి గొనె సంచిలో మూటకట్టి నీళ్ల డ్రమ్ములో వేలాడదీయాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద కర్రతో కలియతిప్పాలి. వారం రోజులకు బాగా మురిగితే కలబంద ద్రావణం తయారవుతుంది. ద్రావణం పిచికారీ చేసే సమయంలో 20 లీటర్ల పిచికారీ డ్రమ్ములో 200 మిల్లీ లీటర్ల ద్రావణంతోపాటు 150 గ్రాముల పసుపు పొడి, 150 గ్రాముల రాళ్ల సున్నం వేసి మిగిలిన భాగం నీరు పోసుకొని.. పంట లేత ౖపైరు నుంచి మొగ్గ దశ వరకు ఏ పంటపై అయినా పిచికారీ చేసుకోవచ్చు.

 పూత సమయంలో పిచికారీ వద్దు
పైరు మొలక దశలో 20 లీటర్ల నీటికి 150 మిల్లీ లీటర్లు, పూత దశకంటే ముందు 20 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్లు, పిందె సమయంలో 20 లీటర్ల నీటికి 300 లీటర్ల ద్రావణాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పూత విచ్చుకున్న సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ద్రావణం పిచికారీ చేయవద్దని ఆమె హెచ్చరిస్తున్నారు. పచ్చపురుగు, తెల్లదోమ, రెక్కల పురుగులు, ముఖ్యంగా వరిలో పొడ తెగులు, దోమపోటు, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం నివారిస్తుంది.
 
మిత్ర పురుగుల సంతతి పెరుగుతుంది..
పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ద్రావణం మిత్ర పురుగులను ఆకర్షిస్తుంది. కందిరీగలు, తూనీగలు, తేనెటీగలు ఇతర మిత్ర పురుగులు పైరు పైకి వచ్చి చేరతాయి. పంటలో పూత నిలబడేలా దోహదపడుతుంది. íపిందె రాలడం తగ్గుతుంది. టమాటా పంట మూడు నెలలు ముగియగానే పాత మొక్క కింద మళ్లీ కొత్తగా చిగుర్లు వచ్చి యధావిధిగా పంటను ఇస్తుంది. రసాయనిక పురుగు మందులు వాడిన పంటలకంటే అధిక దిగుబడి వస్తుందని యశోదమ్మ(88979 31488) ధీమాగా చెబుతున్నారు.
– మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వైఎస్సార్‌ జిల్లా


                           కలబంద ద్రావణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement