బ్రిక్స్‌ కొత్త పుంతలు BRICS summit 2017 in china | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ కొత్త పుంతలు

Published Wed, Sep 6 2017 12:38 AM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

బ్రిక్స్‌ కొత్త పుంతలు

ఈసారి చైనాలోని జియామెన్‌లో జరిగిన బ్రిక్స్‌ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో మన దేశానికి దౌత్యపరంగా ఘనవిజయం లభించింది. ఉగ్రవాద ఉదంతాలకు కారణమవుతున్న జైషే మహమ్మద్, లష్కరే తొయిబా సహా పలు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై ఆ సదస్సు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఇలాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని, ఆ ఉగ్రవాద సంస్థ లపై సమష్టిగా పోరాడాలని నిర్ణయించింది. ఇలాంటి తీర్మానం కోసం మన దేశం పలు సంవత్సరాలుగా పట్టుబడుతోంది. కానీ ప్రతిసారీ మన ప్రయత్నాలకు ఏదో సాకు చూపి అడ్డుతగులుతోంది. ఇన్నాళ్లకు చైనా సైతం భారత్‌తో గళం కలిపింది. తీర్మానానికి సహకరించింది. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ఎలాంటి నేపథ్యంలో జరి గిందో అందరికీ తెలుసు. రెండు నెలలక్రితం డోక్లాం వద్ద భారత్‌–చైనాల మధ్య తలెత్తిన వివాదం ఎటువైపు పోతుందో, దానివల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడ తాయోనని చాలామంది ఆందోళనపడ్డారు.

ఒకవైపు బ్రిక్స్‌ సదస్సు తేదీలు దగ్గర పడుతున్నా పరిస్థితి మెరుగుపడకపోవడం కలవరం కలిగించింది. దీనికితోడు చైనాకు చెందిన వివిధ స్థాయి అధికారులు బెదిరింపులకు దిగారు. దీన్నంతటినీ గమనించాక ఆ సదస్సుకు అసలు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తారా లేదా అన్న సందేహం తలెత్తింది. కానీ చడీచప్పుడూ లేకుండా సాగిన దౌత్యం ఫలించింది. దళా లను వెనక్కు తీసుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. పర్యవసానంగా బ్రిక్స్‌లో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయం చిన్నదేమీ కాదు. గోవాలో నిరుడు బ్రిక్స్‌ సదస్సు జరిగినప్పుడు ఉగ్రవాద సంస్థలను నేరుగా ఖండించాల్సిన అవసరం ఉన్నదని సభ్య దేశాలైన రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు నచ్చజెప్పేందుకు మన దేశం చేయని ప్రయ త్నమంటూ లేదు. ఆ సదస్సులో మాట్లాడిన నరేంద్రమోదీ పాకిస్తాన్‌ తీరు తెన్నులను బ్రిక్స్‌ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఉగ్రవాద సంస్థలకు వత్తాసుగా నిలుస్తున్న పాకిస్తాన్‌కు రాజకీయ, ఆయుధ సాయాన్ని తగ్గించుకోవాలని పరో క్షంగా చైనాకు చెప్పారు.

తీరా సంయుక్త ప్రకటన రూపొందే సమయానికి చైనా అడ్డుపుల్ల వేసింది. తనతో రష్యాను కూడా కలుపుకొంది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని ‘ప్రపంచ దేశాలకు’ పిలుపునివ్వడం మినహా ఆ ప్రకటన మరేమీ చెప్ప లేకపోయింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌నూ, సిరియాలో విధ్వంసాలకు పాల్పడుతున్న అల్‌కాయిదా, జభత్‌ అల్‌ నస్రా సంస్థలనూ ఖండించిన ఆ ప్రకటన జైషే మహ మ్మద్, లష్కరే తొయిబా, హక్కానీ నెట్‌ వర్క్‌ లాంటి సంస్థల పేరెత్తేందుకు ముందుకు రాలేదు. నిజానికి ఐఎస్‌తోపాటు ఈ సంస్థలన్నిటినీ ఐక్యరాజ్యసమితి చాన్నాళ్లక్రితం నిషేధించింది. అటువంటప్పుడు పాక్‌ ప్రేరేపిత సంస్థల విషయంలో వ్యత్యాసం చూపాల్సిన అవసరం ఏమున్నదని మన దేశం అడిగితే మౌనమే జవా బైంది. జైషే మహమ్మద్‌ మన పార్లమెంటు భవనంపై 2001లో దాడులకు పాల్ప డింది. 2008లో ముంబైపై లష్కరే తొయిబా దాడిచేసి 166మందిని పొట్టనబెట్టు కుంది. ఈ దాడులకు సూత్రధారులైనవారిని అప్పగించాలని కోరుతున్నా పాకిస్తాన్‌ బుకాయిస్తోంది.

ఈ సంస్థల గురించి, వీటికి మద్దతిస్తున్న పాకిస్తాన్‌ తీరు గురించి గోవా సదస్సులో మోదీ చెప్పినప్పుడు చైనా, రష్యాలు ఆ దేశానికి బ్రిక్స్‌లో సభ్య త్వం లేదు కదా అన్న వాదన తీసుకొచ్చాయి. అయితే వాటి కార్యకలాపాల వల్ల బ్రిక్స్‌ సభ్య దేశం ఆర్ధికంగా దెబ్బతింటున్నప్పుడు దాని ప్రభావం సంస్థలో ఇతర దేశాలపైనా, అంతిమంగా సంస్థ ప్రగతి పైనా పడదా అని మన దేశం నిలదీసింది. అయితే చైనా, రష్యాలు చొరవ చూపలేదు. ఈసారి జియామెన్‌ సదస్సు చేసిన తీర్మానం మన ప్రచ్ఛన్న దౌత్యం సాధించిన విజయమని చెప్పుకోవాలి. అయితే ఈ విషయంలో చేయాల్సిన కృషి ఇంకా చాలా ఉంది. ఎందుకంటే  రెండేళ్లక్రితం లష్కరే తొయిబా కమాండర్‌ జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాక్‌ వైఖరిని ఖండించే అభిశంసన తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీలో చైనా అడ్డుపడింది. లఖ్వీకి సంబంధించి భారత్‌ తమకు సరైన సాక్ష్యాలు అందించలేకపోయిందని సాకు చెప్పింది.

అటు తర్వాత జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ‘ప్రపంచ ఉగ్రవాది’గా ప్రకటించే తీర్మానంపై కూడా ఇలాగే వ్యవహరించింది. ఐక్యరాజ్యసమితిలో ఏ దేశంపైన అయినా చర్య తీసుకోవడం మాట అటుంచి కనీసం అభిశంసించడం కూడా చాలా ప్రయాసతో కూడిన పని. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమున్న అయిదు దేశాల్లో ఏ ఒక్కటి కాదన్నా ఆ తీర్మానాలు వీగిపోతాయి. ఇప్పుడు బ్రిక్స్‌ సంయుక్త ప్రకటన చూస్తే ఉగ్రవాద సంస్థలపై చైనా వైఖరిలో మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. అది ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపైన కూడా ప్రతిఫలిస్తుందా లేదా అన్నది చూడాలి.  
ఉగ్రవాదం విషయంలో మాత్రమే కాదు...ఇతరత్రా అంశాల్లో కూడా ఈసారి బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. మారిన అంతర్జాతీయ పరిస్థితులకనుగుణంగా ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎం ఎఫ్‌)లలో సంస్కరణలు తీసుకురావాలని బ్రిక్స్‌ కోరింది.

అమెరికా కనుసన్నల్లో ఉండే ఈ రెండు సంస్థల తీరుతెన్నులు, వర్ధమాన దేశాలకు సాయం అందించడంలో అవి విధించే ఆంక్షలు ఆ దేశాల అభివృద్ధికి అవరోధంగా ఉంటున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. డబ్లు్యటీఓ వంటి సంస్థల్లో వర్ధమాన దేశాలు కలిసికట్టుగా వ్యవహరించి అగ్రరాజ్యాలను ఎంతోకొంత అదుపు చేస్తున్నాయి. రాయితీలు పొందగలుగుతున్నాయి. కానీ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లలో మాత్రం ఆ పని చేయలేకపోతున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని బ్రిక్స్‌ తాజా తీర్మానం వెల్లడిస్తోంది. అలాగే ప్రపంచీకరణ పేరిట వర్ధమాన దేశాలపై అనేక నిబంధనలు విధించి అక్కడి మార్కెట్లను కబళించిన అగ్రరాజ్యాలు ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్‌’వంటి రక్షణ విధానాలతో గోడలు నిర్మించుకుంటున్నాయి. ఈ తీరును కూడా బ్రిక్స్‌ తప్పుబట్టింది. ఈ పరిణామాలన్నీ శుభసూచకమైనవి. ఈ ఐక్యత ఇకపై కూడా కొనసాగుతుందని ఆశిద్దాం.

Advertisement
 
Advertisement
 
Advertisement