సామాజిక వనాల్లో కాసుల వేట | World Forestry Day special story | Sakshi
Sakshi News home page

సామాజిక వనాల్లో కాసుల వేట

Published Mon, Mar 21 2016 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

సామాజిక వనాల్లో కాసుల వేట

మొక్కలన్నీ లెక్కల్లోనే..
ఏడాదికి కోటి మొక్కల పంపిణీ లక్ష్యం
మూడో వంతు కూడా సరఫరా కాని వైనం
అన్నీ కాకి లెక్కలు
మొక్కల పెంపకం పేరుతో నిధుల స్వాహా
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం

సామాజిక వనాల్లో మొక్కల పెంపకం పేరుతో లక్షలు కాజేస్తున్నారు. రికార్డుల్లో లక్షలాది మొక్కలు నాటినట్లు చూపుతున్నా..వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.  సరైన పర్యవేక్షణ లేక నర్సరీల్లో అరకొరగా పెంచినవీ ఎండుముఖం పట్టారుు. కోటి మొక్కలు పెంచాలన్నది లక్ష్యం కాగా..పట్టుమని 30 లక్షల మొక్కలు కూడా పంపిణీ కాలేదంటే అవినీతి ఏ స్థారుులో ఉందో అర్థమవుతుంది. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని సామాజిక వనాలపై కథనం..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ ఒంగోలు క్రైం: అటవీ శాఖలో  సామాజిక వనాల పెంపకం ప్రహసనంగా మారుతోంది. లెక్కల్లో కోట్ల మొక్కలు నాటినట్లు చూపుతున్నా రోడ్లపై మొక్కలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ జిల్లాలో నాటిన మొక్కల్లో సగం  బతికినా జిల్లా మొత్తం పచ్చదనం పరుచుకునేది. ఒకపక్క విలువైన వృక్ష సంపదను నరికి యథేచ్ఛగా మార్కెట్‌కు తరలిస్తూనే, మరోపక్క సామాజిక వనాల అభివృద్ధి పేరుతో లక్షలు కాజేస్తున్నారు. వేల హెక్టార్లలో మొక్కలు నాటినట్లు కాగితాలపై లెక్కలు చూపిస్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.  జిల్లాలో 50 నర్సరీలు ఏర్పాటు చేసి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో పాటు 13వ ఆర్ధిక సంఘం నిధులు భారీగా కేటాయించారు. కోటి మొక్కల పెంపకం పథకం కింద సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని చేపట్టారు.

 జరుగుతోంది ఇదీ...
అధికారులు మాత్రం తూ తూ మంత్రంగా మొక్కలు పెంచి అక్రమాలకు పాల్పడుతున్నారు. కనీసం ఏడాదికి 30 లక్షల  మొక్కలు కూడా పంపిణీ కావడం లేదన్న విమర్శలున్నాయి. లక్షల నిధులు ఖర్చయినా నర్సరీ నుంచి మొక్క బయటకు పోతే ఒట్టు. రికార్డుల్లో మాత్రం మొక్కలు పంపిణీ చేసినట్లు చూపిస్తూ మొలకెత్తని బెడ్లను పాలిథిన్ కవర్లను ట్రాక్టర్‌తో తొలగించి మొక్కలు పంపిణీ చేసినట్లు అధికారులను వేధించటం పరిపాటిగా మారింది.  ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, దేవాలయాల ఆవరణ, ఎస్సీల పొలాల్లో మొక్కలు పెంచుకునేందుకు పంపిణీ చేశారు. అయితే మొక్కలు నాటిన తరువాత వర్షాలు లేక పోవటం, నీరు అందకపోవటం, రక్షణ లేక అక్కడక్కడా కొన్ని మొక్కలే బతికి ఉన్నాయి. మిగిలినవన్నీ అక్కడ మొక్కలు నాటారంటే నమ్మే పరిస్థితి కూడా లేదు.

కనిగిరి నియోజకవర్గంలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని కొన్ని చోట్ల మొక్కలు పచ్చగా ఉన్నా, సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో మొక్కల పెంపకం కాగితాలకే పరిమితమైంది. 15 రకాల మొక్కలను ప్రతి ఏడాది ఒక్కో నర్సరీలో 3 వేల చొప్పున ఏడాదికి మూడు లక్షలు పెంచుతున్నట్లు లెక్కలు చూపిస్తూ అధికారులు నిధులు దిగమింగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కనిగిరి నుంచి హనుమంతునిపాడు, వేములపాడు ఘాట్ వరకు నాటిన మొక్కలు నిలువునా ఎండిపోయాయి.  హాజీపురం సోషల్ ఫారెస్టులో మొక్కలు పెంచేందుకు ఏర్పాటు చేసిన సిమెంటు బెడ్లు పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి అధికారుల నిర్లక్ష్యానికి దర్పణంగా మారాయి.

సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో  ఒక్క చీమకుర్తి మండలంలో మాత్రమే  అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. చీమకుర్తి మండలం దేవరపాలెం రేంజ్ దాదాపు 5 వేల హెక్టార్ల భూములుంటే  కేవలం పల్లామల్లి ఏరియాలోని 50 హెక్టార్లలో మాత్రమే జామాయిల్ మొక్కలు వేసినట్లు అటవీ రేంజర్ వెంకటరావు చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపుగా 70 వేల మొక్కలు  నాటినట్లు చూపుతున్నా పదిశాతం మొక్కలు కూడా బతికిన దాఖలాలు లేవు.

గిద్దలూరు నియోజకవర్గంలోని 65 పాఠశాలల్లో 12,500 మొక్కలు పంపిణీ చేశారు. అరకొర పాఠశాలల్లో మినహా ఎక్కువ పాఠశాలల్లో మొక్కలు జీవం పోసుకోలేదు. కంభం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా గతేడాది ఒక్కో విద్యార్థికి ఒకటి చొప్పున 310 మొక్కలు నాటారు. 80 మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో అసలు మొక్కలే కనిపించవు. ఒక్కో మొక్కకు సుమారు రూ.15 నుంచి రూ.25ల వరకు ఖర్చు చేశారని దాదాపు రూ.2.50 లక్షల వరకు నిధులు వృథా చేసినట్లు ఆరోపణలున్నాయి.

మార్కాపురం నియోజకవర్గంలో తర్లుపాడు  మండలంలోని తుమ్మలచెరువులో ఏర్పాటు చేసిన నర్సరీలో 50 వేల మొక్కలు పెంచినట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. మొదటి విడతగా 50 వేల మొక్కలు నాటాల్సి ఉండగా 20 వేల ఎర్రచందనం మొక్కల స్టమ్స్‌ను ప్రభుత్వం పంపిణీ చేసింది. అవి నాసిరకంగా ఉండటంతో నాటిన కొద్ది రోజులకే చనిపోయాయి. అదే కవర్లలో వాటి స్థానంలో అధికారులు హడావుడిగా బొప్పాయి, మునగ విత్తనాలు నాటారు. అవి  బతకలేదు. దీంతో లక్షల ధనం వృథా అయింది.  కొనకనమిట్ల మండలంలో పాతపాడు- కనిగిరి మండలం బడుగులేరు వరకు మొక్కలు నాటేందుకు రూ.47 లక్షలు, పెదారికట్ల- ఇరసలగుండం వరకు మొక్కలు నాటేందుకు రూ. 27 లక్షలు వెచ్చించారు. అవి కాక స్థానిక నర్సరీ కేంద్రాల నుంచి మొక్కలు నాటారు. లక్షలు ఖర్చు పెట్టి నాటారు కాని 10 శాతం మొక్కలు ఉపయోగంలోకి రాలేదు.

అద్దంకి నియోజకవర్గం బల్లికురవ, సంతమాగులూరు, కొరిశపాడు, జే పంగులూరు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో, రోడ్ల వెంట, చెరువు గట్లు, పొలం గట్ల వెంట నిమ్మ, మామిడి, బత్తాయి, ఖర్జూర, మలబారు వేప, సపోట లాంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా చేపట్టారు. గత సంవత్సరం నాటిని మొక్కల పరిస్థితిని గమనిస్తే అద్దంకి మినహా మిగిలిన మండలాల్లో ఎక్కువ శాతం మొక్కలు మరణించినట్లు క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది. కాలం కాని కాలంలో నాటడం వలన మొక్కలు చనిపోయాయని అధికారులు చెబుతున్నారు.

♦  దర్శి నియోజకవర్గంలో దొనకొండ, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూ రు మండలాల్లో 20 వేల మొక్కలు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, పంచాయతీల్లో  పంపిణీ చేశారు.మొక్క లు నాటిన వారు వాటి సంరక్షణను విస్మరించారు. ఫలితంగా అవి పెరుగుదలకు నోచుకోలేదు.  వన మహోత్సవం సందర్భంగా అటవీశాఖ టేకు, వేప, కానుగ, మునగ, బొప్పాయి, గోరింట,  శీతాఫలం మొక్కలను అందజేసింది. అందుకు సంబంధించిన నిధులను డ్రా చేశారు. ఈ మొక్కల్లో పది శాతం కూడా బతకలేదు.

♦  కొండపి నియోజకవర్గం మర్రిపూడి 14 పంచాయతీల్లో 6 రకాల మొక్కలైన మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, సపోట, సీతాఫల్  తదితర 14 వేల మొక్కలు ఇచ్చారు. అయితే సంరక్షణ లేకపోవడంతో చాలా వరకు మొక్కలు చనిపోయాయి. కొండపి మండలం వావిలేటిపాడు, మర్లపాడు, కొత్తపట్నం, టపాచెట్టు నర్సరీల నుంచి  మండలానికి 1600 నీడ మెక్కలను అందించారు. కడియం నర్సరీ నుంచి 10 వేల పండ్ల మొక్కలను తెప్పించారు.

కందుకూరు నియోజకవర్గంలో ప్రధానంగా గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. చుండి, మాలకొండ గ్రామాల వద్ద 25 హెక్టార్ల చొప్పున మొత్తం 50 హెక్టార్లలో 60 వేల జామాయిల్ మొక్కలు నాటినట్లు రేంజర్  చెబుతున్నారు. అయితే వీటిలో కొంత వరకు మొక్కలు ఎండిపోయాయి. అలాగే ఉలవపాడు మండలంలో 20,800 మొక్కలు పాఠశాలలో నాటినట్లు లెక్కలు చూపిస్తున్నా వీటిలో 10 శాతం మొక్కలు కూడా బతికిన దాఖలాలు లేవు. పాకలరోడ్డు, పాజర్ల, ఊళ్లపాలెం రోడ్డుల్లో 1800 మొక్కలు నాటినట్లు చెప్తున్నారు. వీటి ఆనవాళ్ల ప్రస్తుతం కానరావడం లేదు.

 లక్ష్యం ఇదీ...
జిల్లాలో ఏడాదికి కోటి మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఉద్దేశం నీరుగారుతోంది.  ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంతో పాటు నీరు-చె ట్టు పథకాల కింద జిల్లాలో మొత్తం 50 నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అవి సామాజిక అటవీ శాఖతో పాటు టెర్రిటోరియల్, వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ విభాగాల్లోనూ నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి. వాటిని గ్రామాల్లో నాటడానికి అవసరం అని అడిగిన వెంటనే వాటిని సరఫరా చేయాలి. సామాజిక అటవీ శాఖ పరిధిలో నాలుగు రేంజ్ కార్యాలయాలున్నాయి. ఒంగోలు, మేదరమెట్ల, పొదిలి, మార్కాపురం రేంజ్ కార్యాలయాల పరిధిలో రేంజర్లు నర్సరీల నిర్వహణ చేపట్టాల్సి ఉంది. వీటితో పాటు గిద్దలూరు రెగ్యులర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 10 నర్సరీల్లో మొక్కలు పెంచాలి. అదేవిధంగా మార్కాపురం వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ పరిధిలోనూ 10 నర్సరీల్లో మొక్కలు పెంచాలి. మొత్తం మీద ప్రతి ఏడాది కోటి మొక్కల చొప్పున పెంచి లక్ష్యాన్ని చేరుకోవాలన్నది అధికారుల లక్ష్యం. ప్రధానంగా నర్సరీల్లో టేకు, ఎర్రచందనం మొక్కలతో పాటు దాదాపు 12 రకాల మొక్కలు పెంచి ప్రజలకు అవసరమైన మేరకు అందించాలి.

Advertisement
 
Advertisement
Advertisement