టీచర్ల కౌన్సెలింగ్‌ సమాప్తం | teachers councelling complete | Sakshi
Sakshi News home page

టీచర్ల కౌన్సెలింగ్‌ సమాప్తం

Published Wed, Aug 2 2017 10:51 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

టీచర్ల కౌన్సెలింగ్‌ సమాప్తం - Sakshi

7,041 మంది ఉపాధ్యాయుల బదిలీ
– ఊపిరి పీల్చుకున్న విద్యాశాఖ
– ఇప్పటికే కొత్త స్కూళ్లలో చేరిపోయిన ఎస్‌ఏలు
– నేడు ఎస్జీటీలకు ఉత్తర్వులు


అనంతపురం ఎడ్యుకేషన్‌: టీచర్ల కౌన్సెలింగ్‌ ముగియడంతో విద్యా శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రెండు నెలల పాటు విద్యా శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేసిన టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌ బుధవారం నాటితో ముగిసింది. వేల సంఖ్యల్లో టీచర్లు దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం బదిలీలపై పలుమార్లు జీఓలు, రోజుకో నిబంధన మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి తీవ్ర గందరగోళానికి గురి చేసింది. బదిలీల సమయంలోనూ పలు మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా ఖాళీల విషయంలో కొందరు టీచర్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. జూలై 22 నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్‌ బుధవారంతో ముగిసింది. అయితే పండిట్లకు రీకౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అన్ని కేడర్ల ఉపాధ్యాయులు మొత్తం 10,113 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో 6,181 మంది తప్పనిసరి.. 3,932 మంది రెక్వెస్ట్‌ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొత్తం 7,041 మంది టీచర్లు బదిలీ అయ్యారు. బుధవారం ఎస్జీటీ తెలుగు 3,301 నుంచి చివరి వరకు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 800 మందికి పైగా ఉండగా.. వీరిలో అధికశాతం మంది అనుకూలమైన స్కూళ్లు లేకపోవడంతో ‘నాట్‌ఆప్టెడ్‌’ ఇచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు కౌన్సెలింగ్‌ ముగిసింది. జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ, పరిశీలకులు, రాయచోటి డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రయ్య పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇదిలా ఉండగా బదిలీ అయిన అన్ని సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్లు ఇప్పటికే కొత్త స్కూళ్లలో చేరిపోయారు. ప్రధానోపాధ్యాయులు గురువారం రిలీవ్‌ అయి శుక్రవారం కొత్త స్కూళ్లలో చేరనున్నారు. అలాగే ఎస్జీటీలకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు గురువారం జనరేట్‌ కానుండగా.. అదేరోజు రిలీవ్‌ అయి శుక్రవారం కొత్త స్కూళ్లలో చేరే అవకాశముంది.

డీఈఓ, పరిశీలకుడికి సన్మానం
కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో చివరిరోజు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, పరిశీలకులు చంద్రయ్యను ఉపాధ్యాయ సంఘాల నాయకులు సన్మానించారు. వేలాదిమంది టీచర్ల బదిలీలను షెడ్యూలు మేరకే పూర్తి చేశారంటూ నాయకులు కొనియాడారు. సన్మానం చేసిన వారిలో ఏడీ చంద్రలీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌(ఆప్టా) రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు రామసుబ్బారెడ్డి, అధ్యక్షుడు రజనీకాంత్‌రెడ్డి, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్‌ఎల్‌టీఏ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి శివానందరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆదిశేషయ్య, ప్రధానకార్యదర్శి వేణుగోపాల్, ఆర్థిక కార్యదర్శి సలీం తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement