పండంటి లాభాలు! | Pandanti profits! | Sakshi
Sakshi News home page

పండంటి లాభాలు!

Published Fri, Oct 7 2016 9:59 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

పండంటి లాభాలు! - Sakshi

  • జామతో అధిక ఆదాయం..
  • జిల్లాలో విస్తరిస్తున్న తోటల సాగు
  • యాజమాన్య పద్ధతులు పాటిస్తే మేలు
  • అందుబాటులో ఎన్నెన్నో రకాలు
  • జిల్లాలో సాగుకు అనువైన పరిస్థితులు
  • సాగు పద్ధతులపై గజ్వేల్‌ ఉద్యానవన అధికారి చక్రపాణి సలహా సూచనలు

  • గజ్వేల్‌:జిల్లాలో జామ తోటల సాగు విస్తరిస్తోంది. రైతులు మంచి ఆదాయానికి ఈ తోటల సాగును మార్గంగా ఎంచుకుంటున్నారు. తోటల సాగు, యాజమాన్య పద్ధతులపై గజ్వేల్‌ ఉద్యానవన అధికారి చక్రపాణి (సెల్‌: 8374449345) సలహాలు, సూచనలు అందించారు.

    వాతావరణం: వేడితో కూడిన పొడి వాతావరణంలో పెరిగిన తోటల్లో పండ్ల నాణ్యత ఎక్కువ. 100 సెంటీమీటర్ల వర్షపాతం కలిగిన ప్రాంతాలు తోటల సాగుకు అనుకూలం.
    నేలలు: ఉదజని సూచిక 4.8 నుంచి 8.2 ఉండి, నీరు నిలవని, లోతైన మురుగునీటి పారుదల గల నేలలు అనుకూలం. తేలికపాటి ఇసుక నేలలు అంతగా పనికిరావు.
    రకాలు: జామలో తెల్ల, ఎర్ర కండ రకాలు ఉన్నాయి.

    తెల్లకండ రకాలు:
    లక్నో-49: పండ్లు కోలగా, పెద్ద పరిమాణంలో గరుకు చర్మంతో ఉంటాయి. విత్తనాలు పెద్దవిగా గట్టిగా ఉంటాయి. ఎకరాకు ఏడాదికి 60-80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
    సఫేద్‌ జామ: పండ్లు మధ్యస్తంగా, గుండ్రంగా, పలుచటి తోలుతో మంచి రుచిగా ఉంటాయి. ఎకరాకు ఏడాదికి 80-100 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
    కోహీర్‌ సఫేఽద్‌: అత్యధిక దిగుబడిని ఇస్తుంది. పండ్లు పెద్దవిగా, గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి.
    అర్కమృదుల: అలహాబాద్‌ సఫేద్‌ రకం నుంచి ఎంపిక చేసిన రకం ఇది. పండ్లు గుండ్రంగా, పెద్దవిగా, గింజలు మెత్తగా ఉండి, కండ తెలుపు రంగులో తియ్యగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
    అర్క అమూల్య: కాయలు మధ్యస్తంగా, తెల్లటి కండతో తియ్యగా ఉంటాయి. విత్తనాలు మెత్తగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
    శ్వేత: అధిక దిగుబడిని ఇచ్చే తెలుపు కండ రకం. పండు సుమారు 225 గ్రాముల బరువుతో తెలుపు రంగుతో ఎరుపు మచ్చలు కలిగి వుంటాయి.

    ఎర్రకండ రకాలు
    రెడ్‌ప్లష్‌: కాయ ముదురు ఆకుపచ్చ రంగుతో గరుకుగా ఉండి, గింజలు గట్టిగా ఉండి కండ ఎరుపు రంగులో ఉంటుంది. ఎకరాకు ఏడాదిలో 70-80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
    లలిత్: అలహాబాద్‌ సఫేద్‌తో పోలిస్తే 24 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. పండు బరువు 185 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉండి నిల్వ పదార్థాల తయారీకి అనువుగా ఉంటుంది.
    కిరణ్‌: ఐఐహెచ్‌ఆర్, బెంగళూర్‌ నుంచి ఈ మధ్యనే విడుదలైన ఈ రకం పండు ఎరుపు కండతో మృదువైన గింజలను కలిగివుంటుంది. జామ పల్ఫ్‌ తయారీకి ఈ రకం అనువైనది.

    నాటే సమయం: మొక్కలను జూన్‌-జూలై నెలల్లో గానీ అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో గానీ నాటుకోవాలి.
    నీటి యాజమాన్యం: లేత మొక్కలకు 2-3 రోజులకు ఒకసారి, పెరిగిన చెట్లకు 7-10 రోజులకు ఒకసారి నీరు పారించాలి. నీటి పళ్లాల పరిధి చెట్టు పెరుగుతున్న కొద్దీ ఏడాదికి అర్థ అడుగు చొప్పున పెంచాలి.

    మొక్కల నాటడం:
    జామను సాధాణంగా నేల అంటు పద్ధతి లేదా చెర్పంటూ పద్ధతిలో నాటుతారు. మొక్కల మధ్య దూరాన్ని నేల లోతూ, భూసారం, సాగునీటి సౌకర్యం మొదలైన అంశాలను బట్టి నిర్ణయించాలి. ఎకరాకు 160 మొక్కలు (5 ఇంటూ 5 మీటర్లు), లేదా 112 మొక్కలు (6 ఇంటూ 6 మీటర్లు) చొప్పున గుంతలను తవ్వి ప్రతి గుంతకు 10-15 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల సింగిల్‌ ఫాస్పేట్‌ కలిపి నింపాలి.

    కొమ్మల కత్తిరింపు:
    ప్రధాన కండపై 2-3 అడుగుల ఎత్తు వరకు వచ్చ పక్క కొమ్మలను కత్తిరించి వేయలి. 60 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్లు పైన రెండు, మూడు కొమ్మలు మాత్రమే పెరిగేలా చూడాలి. ప్రతి ఏడాది ఎండిన కొమ్మలను, అడ్డంగా పెరిగే కొమ్మలను తీసేయాలి.

    ఎరువుల మోతాదు:
    మొక్క వయసు ఏడాది ఉన్న సమయంలో 217 గ్రాముల యూరియా, 40 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాష్, 15 కిలోల పశువుల ఎరువు వేయాలి. రెండేళ్ల వయసులో 434 గ్రాముల యూరియా, 80 గ్రాముల భాస్వరం, 200 గ్రాముల పొటాష్, 30 కిలోల పశువుల ఎరువు, మూడేళ్ల వయసులో 651 గ్రాముల యూరియా, 120 గ్రాముల భాస్వరం, 300 గ్రాముల పొటాష్, 45 కిలోల పశువుల ఎరువు, నాలుగేళ్ల వయసులో 868 గ్రాముల యూరియా, 160 గ్రాముల భాస్వరం, 400 గ్రాముల పొటాష్, 60 కిలోల పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. ఇలా ఏడాది పెరిగిన కొద్దీ మోతాదు పెంచాల్సి ఉంటుంది.

    పోషక లోపాలు:
    ఆకులు ఎరుపు రంగులోకి మారినపుడు భాస్వరం, పొటాష్, జింక్, సేంద్రియ పదార్థాల మిశ్రమ లోపాలుగా గుర్తించవచ్చు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసి ఈ లోపాలను నివారించవచ్చు. 4 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ మరియు 2 గ్రాముల బోరిక్‌యాసిడ్‌ 1 లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
     
    కాపు నియంత్రణ:
    ఫిబ్రవరి నుండి మే నెల వరకు నీటిని ఇవ్వడం ఆపివేయాలి. ఇలా చేయడం వల్ల ఏప్రిల్, మే నెలల్లో చెట్లు ఆకులను రాలుస్తాయి. జూన్‌ నెలలో పాదులు తీసి ఎరువులు వేసి నీళ్లు కట్టాలి. నీరు కట్టిన 20-25 రోజుల్లో కొత్త చిగుళ్లు వేస్తుంది. చలికాలంలో వచ్చే పంట మంచి నాణ్యతతో ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే పంటను నియంత్రించి చలికాలంలో వచ్చేటట్లు చేసుకోవచ్చు. కాయకోత తర్వాత కాపునిచ్చిన కొమ్మలను నాలుగింట మూడు వంతులు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల దిగుబడి పెరుగుతుంది. కాయలు కోసేటప్పుడు చిన్న రెమ్మలతో కోయటం మంచిది. ఇలా చేయడం వల్ల కొత్త రెమ్మలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడి వస్తుంది
     

Advertisement
 
Advertisement
 
Advertisement