వైఎస్సార్‌సీపీలో సామాజిక సమతూకం | kakinada corporation elections | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో సామాజిక సమతూకం

Published Thu, Aug 17 2017 11:48 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

వైఎస్సార్‌సీపీలో సామాజిక సమతూకం - Sakshi

- అభ్యర్థుల ఎంపికలో సముచిత ప్రాధాన్యం
- అన్ని వర్గాలకూ సమన్యాయం
- పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
కాకినాడ:  కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాజిక సమతూకాన్ని పాటించి అన్ని వర్గాలకూ సమన్యాయం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు కమ్మ, వైశ్య, ముస్లిం వర్గాలకు కూడా సీట్లు కేటాయించింది. ప్రధానంగా బీసీ, ఎïస్సీల్లోని ఉపకులాలను గుర్తించి ఆయా వర్గాలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. ఇందు కోసం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ వి.విజయసాయిరెడ్డి సమక్షంలో జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మరో సీనియర్‌ నేత, మాజీ మత్రి బొత్స సత్యనారాయణ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కసరత్తు చేశారు. కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న సామాజిక వర్గాలు, రిజర్వేషన్లు, ప్రాంతాలవారీగా ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. వైఎస్సాఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్‌ భాగస్వామ్యంతోపాటు వివిధ సర్వేల ద్వారా సమర్థులైన అభ్యర్థులతోపాటు సామాజికపరంగా అ«ధ్యయనం చేశారు. ఓసీ కేటగిరీలో కాపులకు 17 స్థానాలు కేటాయించారు. బీసీ వర్గాల్లోని తూర్పు కాపులకు రెండు, శెట్టిబలిజలకు 4, మత్స్యకార వర్గాల్లోని అగ్నికుల క్షత్రియ, వాడబలిజ, జాలర్లకు ఐదు సీట్లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి 2, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన ఎరుకుల కులస్తులకు (ఎస్టీ)1, ఎస్సీలకు 4 స్థానాలు కేటాయించారు. వెనుకబడిన తరగతులకు సంబంధించి ఉపకులాలైన వెలమ, గవర, ఉప్పర, శెట్టి బలిజలకు తగిన రీతిలో అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. వైశ్య, ముస్లింలకు ఒకొక్కటి, రెడ్దిక కులానికి మూడు స్థానాలు కేటాయించారు. ఇలా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థిత్వాలను నిర్ణయించడంతో కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు సమర్థతకు పెద్దపీట వేస్తూ అన్ని సామాజిక వర్గాలకూ సమన్యాయం చేసిన సీట్ల కేటాయింపులతో రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీకి మరింత అదనపు బలాన్ని చేకూరుతుందన్న ఆశాభావం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement