జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం | jaap meeting anaparthi | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం

Published Sun, May 14 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం

ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
ఘనంగా జాప్‌ రజతోత్సవ మహాసభలు
కనీస వేతనాలు కరువవుతున్నాయన్న
వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల
అనపర్తి : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (జాప్‌) రజతోత్సవాల్లో భాగంగా జాప్‌ అనపర్తి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం, జిల్లా మహా సభలు ఆదివారం స్థానిక ఎస్‌ఎన్‌ఆర్‌ కళ్యాణమండపంలో జరిగాయి. చిన రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాత్రికేయులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ విషయంలో జిల్లా స్థాయిలో కూడా హైపర్‌ కమిటీల ఏర్పటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాత్రికేయుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యాలు దృష్టి సారించాల్సిన అవసరం వుందని, ఇందులో భాగంగా పాత్రికేయుల శ్రమకు తగిన వేతనాన్ని అందించటాన్ని యాజమాన్యాలు బాధ్యతగా తీసుకోవాలన్నారు. విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి, గృహ నిర్మాణాలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని, దీనికి స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో పాత్రికేయులకు బాధ్యతలు, ఒత్తిడులే తప్ప కనీస వేతనాలు కరువవుతున్నాయన్నారు. చట్టాల అమలు కోసం, సమాజంలో అవినీతిని తమ వార్తల ద్వారా తెలియజేసే పాత్రికేయులు తమ విషయంలో అమలుకాని చట్టాలపై నిరంతరం పోరాడాల్సిన అవసరం వుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్నారు. పాత్రికేయులు తమ చిన్నారులకు విద్య, కుటుంబానికి వైద్య సాయం అనే రెండు అంశాలపై దృష్టి సారించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులకు ఇళ్ల స్థలాల మంజూరు, ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ పాత్రికేయులు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధులుగా నిలుస్తున్నారని, పాత్రికేయులు తమ వృత్తిని పవిత్రంగా నిర్వహించాలన్నారు. వైఎస్సార్‌సీపీ అనపర్తి, మండపేట, నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ల లీలా కృష్ణ, í రాజమండ్రి కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలా రెడ్డి, కర్రి పాపారాయుడు మాట్లాడుతూ వృత్తి పరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషిచేయాలన్నారు. జాప్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీవీఎస్‌ఎన్‌ఆర్‌ పున్నంరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార శాఖ ఏడీ ఎం.ఫ్రాన్సిస్, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి తదితరులు మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యుడు చెల్లుబోయిన వేణు,  రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కార్యదర్శి నల్లమిల్లి దుర్గా వరప్రసాదరెడ్డి, అనపర్తి మండల కన్వీనర్‌ మల్లిడి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాత్రికేయుల సమస్యలపై అలుపెరగని పోరాటం...
పాత్రికేయుల సంక్షేమమే పరమావధిగా, వారి సమస్యలపై జాప్‌ నిరంతరం పాటు పడుతోందని జాప్‌ వ్యవస్థాపకుడు ఉప్పల లక్ష్మణ్‌ అన్నారు. జాప్‌ రజతోత్సవాల్లో భాగంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పాత్రికేయులకు సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో వర్తింపచేయటానికి కృషి చేస్తున్నామన్నారు. జాప్‌ రాష్ట్ర అధ్యక్షుడు పున్నంరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.యుగంధర్‌ రెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలోని విలీన మండలాల్లో, పుదిచ్చేరి రాష్ట్రంలో అంతర్భాగమైన యానాంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి చిన రాజప్పకు వివరించారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు, గృహనిర్మాణాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పదో తరగతి పరీక్షల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించిన విద్యార్థులకు అతిథుల చేతులమీదగా శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. జాప్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పీఎస్‌ఎం కృష్ణంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎ రెహ్మాన్, జాప్‌ జిల్లా నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement