అభివృద్ధి పనులకు శంకుస్థాపన | hareesh rao visits in district | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Published Sat, Jun 18 2016 4:14 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన కామారెడ్డి, భిక్కనూరు ఏఎంసీ కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఎస్సారెస్పీ లక్ష్మి లిఫ్ట్ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం  చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 1,045 అడుగుల నీటి మట్టం వద్ద నిర్మిస్తున్న లక్ష్మి ఎత్తిపోతల పథకం పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన లక్ష్మి లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఆయకట్టు, పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న చోట ఒక్క ఇంజినీర్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం..
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా లక్ష్మి లిఫ్ట్ పనులు నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. 2007లో పనులు ప్రారంభించారని, 2014 వరకు 20 శాతం పనులనూ పూర్తి చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేశామని, రెండేళ్లలో తుదిదశకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తయితే 50 వేల ఎకరాలకు ఏటా రెండు పంటలకు నీరందుతుందన్నారు.

 కాంట్రాక్టు సంస్థ ప్రతినిధిపై ఆగ్రహం
లిఫ్ట్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విజయ్ మాథ్యూస్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన లిఫ్ట్ వద్ద నుంచి ఫోనులో మాథ్యూస్‌తో మాట్లాడారు. పనుల్లో జాప్యంపై ప్రశ్నించారు. ఈ నెలాఖారు వరకు రెండు మోటార్లు, వచ్చే నెలాఖారు వరకు లిఫ్ట్‌పనులు పూర్తి చేయాలని, లేకపోతే బ్లాక్ లిస్ట్‌లో చేర్చుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, డీఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.

 ఎస్సారెస్పీలో నీరెంతుంది
మంత్రి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ శంకర్‌తో మాట్లాడి ప్రాజెక్ట్‌లో ఇప్పుడెంత నీరుందో తెలుసుకున్నారు. ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరుందని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గతేడాది ఇదే సమయంలో 11 టీఎంసీల నీరుందన్నారు.

 లక్ష ఎకరాలకు నీరందిస్తాం
కిసాన్‌నగర్‌లో రూ. 4.5 కోట్లతో నిర్మించిన 7,500 మెట్రిక్ టన్నుల గోదాంను, బస్సాపూర్ గ్రామంలో రూ. 6 కోట్లతో నిర్మించే బస్సాపూర్ లిఫ్ట్ నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. ప్రాణహిత -చేవెళ్ల 21వ ప్యాకేజీ ద్వారా బాల్కొండ నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

 గత ప్రభుత్వాల హయాంలో జిల్లాలో 600 మెట్రిక్ టన్నుల గోదాంలు నిర్మిస్తే.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 35 వేల మెట్రిక్ టన్నుల గోదాంలను నిర్మించిందన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని గోదాంలలో నిల్వ చేసుకుని రుణాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, సర్పంచ్ లింగస్వామి, ఎంపీపీ అర్గుల్ రాధ, జెడ్పీటీసీ సభ్యురాలు జోగు సంగీత, వైస్ ఎంపీపీ శేఖర్, వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ పుట్ట లలిత, ఎంపీటీసీ సభ్యురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు.

మోర్తాడ్‌లో.. 
మోర్తాడ్ : మండలంలోని గుమ్మిర్యాల్‌లో రూ. 11.40 లక్షలతో చేపట్టనున్న గోదావరి నది ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement