వెండితెరపై చినబాబు 'ఆట' | chinna babu supports try to collapse distributers in andrapradesh | Sakshi
Sakshi News home page

వెండితెరపై చినబాబు 'ఆట'

Published Wed, Nov 2 2016 7:32 AM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

వెండితెరపై చినబాబు 'ఆట' - Sakshi

  • కలెక్షన్ల పంపకంపై తీవ్ర వివాదం.. మూడు జిల్లాల్లో మల్టీప్లెక్స్‌ల్లో నిలిచిన తెలుగు సినిమాల ప్రదర్శన
  • 50 శాతమే ఇస్తున్న యాజమాన్యాలు.. 60 శాతం ఇవ్వాల్సిందేనంటున్న డిస్ట్రిబ్యూటర్లు
  • తెలంగాణ తరహా విధానాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి.. యాజమాన్యాలకు అండగా టీడీపీ యువనేత
  • తాము చెప్పింది చేయాలంటూ విజయవాడ టీడీపీ ప్రజాప్రతినిధి హెచ్చరిక
  • అమరావతి :
    రాష్ట్రంలో సినిమా రంగాన్ని గుప్పిట పట్టాలన్న చినబాబు ఆరాటం డిస్ట్రిబ్యూటర్లకు సంకటప్రాయంగా మారుతోంది. అస్మదీయులకు చెందిన మల్టీప్లెక్స్‌లకు అండగా డిస్ట్రిబ్యూషన్‌ రంగాన్ని దెబ్బతీసేందుకు ఆయన రంగంలోకి దిగారు. ఫలితంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మల్టీప్లెక్స్‌ల్లో కొన్నిరోజులుగా తెలుగు సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. సినిమాల కలెక్షన్ల వాటాల అంశంలో తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు, మల్టీప్లెక్స్‌ యజమానుల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. కలెక్షన్లలో తమకు 60 శాతం ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు 50 శాతమే ఇస్తుండటం వివాదానికి దారితీసింది. తెలంగాణ  ప్రభుత్వం ఇటీవల ఈ  వివాదాన్ని పరిష్కరించింది. డిస్ట్రిబ్యూటర్లు, మల్టీప్లెక్స్‌ యాజమాన్యాల మధ్య మొదటివారం 55 శాతం: 45 శాతం, రెండోవారం 60:40, మూడు, నాలుగు వారాలు  65శాతం: 35శాతంగా కలెక్షన్లు పంచుకోవాలని ఖరారు చేసింది. ఏపీలో కూడా ఇదే విధానాన్ని వర్తింపజేయాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం పరోక్షంగా మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల ‘జనతా గ్యారేజ్‌’ సినిమాను మల్లీప్లెక్స్‌ల్లో విడుదల చేయబోమని హెచ్చరించారు. దాంతో మొదటివారం 53 శాతం ఇచ్చేందుకు యాజమాన్యాలు సమ్మతించాయి.

    చినబాబు రంగ ప్రవేశం...
    విశాఖపట్నం తరçహాలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా 53 శాతాన్నే వర్తింపజేయాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కోరారు. అందుకు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు నిరాకరించాయి. యాజమాన్యాలకు అండగా చినబాబు రంగ ప్రవేశం చేశారు. దీర్ఘకాల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం సినిమా రంగాన్ని గుప్పిటపట్టాలని ఆయన వ్యూహం రచించారు. అందుకే అస్మదీయులైన మల్టీప్లెక్స్‌ యజమానులకు అండగా నిలిచారు. సినిమాల ప్రదర్శన విషయంలో తాము చెప్పింది చేయాలంటూ చినబాబు ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరించినట్లు సమాచారం. వివాదం సంక్లిష్టంగా మారడంతో కొన్ని రోజులుగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మల్టీప్లెక్స్‌ల్లో తెలుగు సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది.

    53% కనీసం ఇవ్వండి..
    కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మల్టీప్లెక్స్‌ల్లో 50కి పైగా స్కీన్లు ఉన్నాయి. వాటిలో సినిమాల ప్రదర్శన వల్ల రోజుకు దాదాపు రూ.కోటి కలెక్షన్‌ వస్తోందని అంచనా. డిస్ట్రిబ్యూటర్లకు మొదటివారం కలెక్షన్లలో 50 శాతం.. అంటే రోజుకు రూ.50 లక్షలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం డిస్ట్రిబ్యూటర్లు, మల్లీప్లెక్స్‌ల యాజమాన్యాల మధ్య మొదటివారం 50 శాతం: 50 శాతం, రెండోవారం 55:45, మూడోవారం 60:40, నాలుగోవారం 65 శాతం: 35 శాతం చొప్పున కలెక్షన్లు పంపిణీ చేస్తున్నారు. 90 శాతం సినిమాలను మల్టీప్లెక్స్‌ల్లో మొదటి వారమే ప్రదర్శిస్తారు. కలెక్షన్లు బాగున్నాసరే తీసివేస్తారు. మల్టీప్లెక్స్‌ల్లో తమకు ఎక్కువ వాటా వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో సినిమాలే ప్రదర్శించడం లేదని డిస్ట్రిబ్యూటర్లు ఆరోపిస్తున్నారు. మొదటివారం కలెక్షన్లలో కనీసం 53 శాతం అయినా ఇప్పించాలని కోరుతున్నారు.

    60% ఇచ్చినా తక్కువే..
    ‘‘మల్టీప్లెక్స్‌లు సినిమాల ప్రదర్శనతోపాటు ఇతర వ్యాపారాలతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయి. సినిమా కలెక్షన్లలో డిస్ట్రిబ్యూటర్లకు 60 శాతం ఇచ్చిన తక్కువే అవుతుంది. ప్రభుత్వ పెద్దలు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలకు కొమ్ముకాయడం దారుణం’’
    – నట్టికుమార్, పంపిణీ రంగ ప్రముఖుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement