అయ్యో! | aayo | Sakshi
Sakshi News home page

అయ్యో!

Published Sat, Jun 3 2017 10:11 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

కానిస్టేబుల్‌ మెరిట్‌ జాబితా చూపిస్తున్న ఇమాంబి - Sakshi

 – చేతిదాక వచ్చి ఇమాంబీకి దక్కని పోస్టు
– మెరిట్‌జాబితాలో పేరున్నా  కానిస్టేబుల్‌ పోస్టు గల్లంతు
– బీసీ–ఈ కేటగిరిలో 83 మార్కులకే పోస్టు
– ఈ యువతికి 90 మార్కులొచ్చినా దక్కని ఉద్యోగం
 
కోవెలకుంట్ల: ఎలాగైనా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఆ యువతి నిరంతరం శ్రమించింది. ప్రాథమిక పరీక్ష, ఈవెంట్స్, మెయిన్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. మెరిట్‌ జాబితాలో పేరు ఉండటంతో పోస్టు గ్యారెంటీ అని ఆ యువతితో పాటు కుటుంబసభ్యులు సంతోషపడ్డారు.అయితే, రిక్రూట్‌మెంట్‌ బోర్డు తప్పిదం పోస్టు చేజారేలా చేసి వారికి నిరాశమిగిల్చింది.  వివరాల్లోకి వెళితే.. కోవెలకుంట్ల మండలంలోని వెలగటూరు గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌బాషా కుమార్తె షేక్‌ చిన్న ఇమాంబీ 2016 సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేసిన  పోలీస్‌కానిస్టేబుల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకుని ప్రాథమిక పరీక్ష, ఈవెంట్స్‌ పూర్తి చేసుకుంది. మెయిన్‌ పరీక్షలో 90 మార్కులు సాధించి మెరిట్‌ జాబితాలో చేరింది. సివిల్‌ పోస్టుకు 90 మార్కులు, ఏఆర్‌ కానిస్టేబుల్‌పోస్టుకు సంబంధించి 94 మార్కులు వచ్చాయి.
 
 బీసీ–ఈ కేటగిరీలో  మహిళా కోటాలో  83 మార్కులకే పోస్టును కేటాయిస్తూ కానిస్టేబుల్‌ పోస్టుల ఎంపిక జాబితాను రిక్రూట్‌బోర్డు ప్రకటించింది. ఆ  జాబితాలో ఇమాంబీ పేరు లేదు. 83 మార్కులకే పోస్టు రాగా 90 మార్కులు వచ్చినా  ఎంపిక జాబితాలో పేరు లేకపోవడంతో ఆందోళన చెందిన ఇమాంబీ తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ఆకేరవికృష్ణను కలిసి వివరాలు అందజేశారు. రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వాకంతో చేతిదాక వచ్చిన పోస్టు దక్కకుండా పోయిందని ఆయన ద​ృష్టికి తీసుకెళ్లారు.
 
న్యాయం చేయండి సారూ..
 ఖాదర్‌బాషా గౌండా పనిచే సుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తెకు కానిస్టేబుల్‌ పోస్టు వస్తుందని ఆనందపడగా బోర్డులో చోటు చేసుకున్న తప్పిదంతో  పోస్టు చేజారింది. మొదట రిక్రూట్‌మెంట్‌ అధికారులు క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని చెప్పి తర్వాత సర్టిఫికెట్‌ మెలిక పెట్టారని ఇమాంబీ ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేసి కానిస్టేబుల్‌ పోస్టుకు ఎంపిక చేయాలని ఆ యువతి తల్లిదండ్రులు రిక్రూట్‌మెంట్‌ అధికారులను కోరుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement