రూపాయి దొంగతనం; వాతలు పెట్టిన తల్లి Mother Punished Her Daughter For Stolen One Rupee In Khammam | Sakshi
Sakshi News home page

రూపాయి దొంగతనం; వాతలు పెట్టిన తల్లి

Published Tue, Oct 1 2019 10:15 AM | Last Updated on Tue, Oct 1 2019 10:22 AM

Mother Punished Her Daughter For Stolen One Rupee In Khammam - Sakshi

సాక్షి, కారేపల్లి: అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కన్నతల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. పొయ్యిలో కొరకాసుతో చేయి, తొడ భాగంపై వాతలు పెట్టింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారి కేకలు వేస్తూ విలవిల్లాడిపోయింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన సిరికొండ నాగమణి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త లక్ష్మయ్య ఆమెను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో 10 ఏళ్ల కూతురు కృష్ణవేణితో కలిసి జీవిస్తోంది. చిన్నారి ఇంట్లో ఒక రూపాయి దొంగతనం చేసిందని, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 29వ తేదీన రాత్రి పొయ్యిలో మండుతున్న కర్ర (కొరకాసు) తీసుకొని చిన్నారి చేతిపై, తొడ భాగంపై విచక్షణరహితంగా వాతలు పెట్టింది. తీవ్రగాయాల పాలైన చిన్నారి ఏడుస్తూ అల్లాడిపోయింది. ఇరుగుపొరుగు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమణికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు.


 తల్లి నాగమణికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు
అయినా తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయగా..ఓ యువకుడు తన సెల్‌ ఫోన్‌తో వీడియో తీసి స్థానికంగా ఉన్న వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు. అది వైరల్‌గా మారింది. సోమవారం ఉదయం విలేకరులు, ఐసీడీఎస్‌ అధికారులు పేరుపల్లి గ్రామానికి చేరుకుని గాయ పడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐసీడీఎస్‌ సీడీపీఓ దమయంతి, సూపర్‌వైజర్‌ పుష్పావతిలు నాగమణికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చిన్నారిని సీడబ్ల్యూసీ అధికారులు ఆదేశాల మేరకు ఖమ్మంలోని బాలల సదన్‌కు తరలించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పుష్పావతి ఫిర్యాదు మేరకు కృష్ణవేణిపై ఎస్‌ఐ పొదిల వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ సీడీపీఓ విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి గాయాలు మానేవరకు బాలల సదన్‌లో ఉంచి చికిత్స నిర్వహిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ అధికారుల సూచనల మేరకు చిన్నారిని హాస్టల్‌లో ఉంచి చదివించాలా? తల్లికి అప్పగించటమా..! అనే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement