30 నెలల గరిష్టానికి టోకు ధరలు WPI inflation spikes to 5.25% in January, fuel prices rise | Sakshi
Sakshi News home page

30 నెలల గరిష్టానికి టోకు ధరలు

Published Wed, Feb 15 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

30 నెలల గరిష్టానికి టోకు ధరలు

జనవరి ద్రవ్యోల్బణం 5.25 శాతం
ఇంధన ధరల మంట ప్రధాన కారణం  


న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2017 జనవరిలో 30 నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.25 శాతానికి పెరిగింది. అంటే 2016 జనవరితో పోల్చితే, 2017 జనవరిలో పలు కీలక వస్తు ఉత్పత్తుల బాస్కెట్‌ ధర టోకున 5.25 శాతం పెరిగిందన్నమాట. ఇంధన ధరల పెరుగుదల టోకు ధరలపై ప్రధానంగా ప్రభావం చూపింది. 2016 ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా (2015 జనవరి నెలతో పోల్చి) –1.07 శాతం క్షీణత నమోదయ్యింది.

కాగా నవంబర్, డిసెంబర్‌లలో వరుసగా ద్రవ్యోల్బణం రేట్లు 3.38 శాతం, 3.39 శాతాలుగా నమోదయ్యాయి.  ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు, అంతర్జాతీయంగా ఫెడ్‌ రేట్లు పెంచే అంచనాల నేపథ్యంలో గత వారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపో 6.25 శాతం)ను పెంచకపోగా, ఇందుకు ఇకముందూ అవకాశాలు తక్కువేనని సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా టోకు ద్రవ్యోల్బణం తీవ్రత నమోదయ్యింది.

మూడు ప్రధాన విభాగాలు ఇలా ...
ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్, నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌లతో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు జనవరిలో 4.30% నుంచి 1.27 శాతానికి తగ్గింది. ఇందులో భాగమైన ఫుడ్‌ ఆర్టికల్స్‌ విభాగంలో ద్రవ్యోల్బణంలో అసలు పెరగలేదు. 6.46% నుంచి ఈ ద్రవ్యోల్బణం –0.56 క్షీణతలోకి జారిపోవడం గమనార్హం.  ఇక నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు 9.35% నుంచి 1.98%కి తగ్గింది.  కూరగాయల ధరలు జనవరిలో పెరగకపోగా –32.32% క్షీణించాయి. ప్రధానంగా ఉల్లిపాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా –28.86% క్షీణించాయి.
ఇంధనం: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం –9.89 శాతం క్షీణత నుంచి భారీగా 18.14 శాతానికి పెరిగింది.
తయారీ:  తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం –1.17 శాతం నుంచి 3.99 శాతానికి పెరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement