స్మార్ట్‌ట్రాక్ నుంచి సోలార్ మైక్రో ఇన్వర్టర్ | Solar Micro Inverter from Smart Track | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ట్రాక్ నుంచి సోలార్ మైక్రో ఇన్వర్టర్

Published Wed, Sep 16 2015 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

స్మార్ట్‌ట్రాక్ నుంచి సోలార్ మైక్రో ఇన్వర్టర్

♦ ఏడాదిలో సోలార్ పవర్ బ్యాటరీ తీసుకొస్తాం..
♦ కంపెనీ సీఈవో భగవాన్‌రెడ్డి వెల్లడి
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సోలార్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ స్మార్ట్‌ట్రాక్.. ప్లగ్ అండ్ ప్లే సోలార్ మైక్రో ఇన్వర్టర్‌ను మంగళవారమిక్కడ ఆవిష్కరించింది. దేశీయంగా తయారైన తొలి ఉత్పాదన ఇదేనని కంపెనీ వెల్లడించింది. సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయిన డెరైక్ట్ కరెంట్(డీసీ) ఆల్టర్నేటింగ్ కరెంట్(ఏసీ) మారుస్తుంది. జనించిన విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగిస్తుంది. నిర్వహణ ఖర్చులు లేవు. ఇ-మీటరింగ్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. గృహ, వాణిజ్య అవసరాలకు పనికొస్తుంది. మైక్రో ఇన్వర్టర్ పనితీరును స్మార్ట్ సందేశ్ మొబైల్ యాప్ లేదా స్మార్ట్‌ట్రాక్ వెబ్ పోర్టల్ ద్వారా కస్టమర్ ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.

సంప్రదాయ పద్ధతిలో 1 కిలోవాట్‌కు రూ.1 లక్ష ఖర్చు అయితే, తమ సిస్టమ్‌కు రూ.80 వేలు అవుతుందని స్మార్ట్‌ట్రాక్ తెలిపింది. వినియోగదారులు అవసరాన్నిబట్టి తక్కువ ఖర్చుతో ప్యానెళ్లను జోడించొచ్చు. 300 వాట్స్ సోలార్ ప్యానెల్‌తో కలిపి మైక్రో ఇన్వర్టర్ ధర రూ.20 వేలు.

 అభివృద్ధిలో బ్యాటరీ..
 సౌర విద్యుత్‌ను నిల్వ చేసే సమర్థవంతమైన లిథియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేస్తున్నామని స్మార్ట్‌ట్రాక్ సీఈవో జి.భగవాన్ రెడ్డి తెలిపారు. 8 నెలల్లో మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ గౌతమ్ వలేటి, ప్రోడక్ట్ మేనేజర్ జాస్మిన్ భానుషాలితో కలసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్మార్ట్‌ట్రాక్‌లో యూఎస్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సుమారు రూ.165 కోట్లు పెట్టుబడి పెడుతోందని వెల్లడించారు. రూ.100 కోట్ల విలువైన ఆర్డర్ బుక్ ఉందని చెప్పారు. హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం వద్ద కంపెనీకి ప్లాంటు ఉంది. ఇప్పటికే 60 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులను పూర్తి చేసింది. మరో 120 మెగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement