అద్దెకు విమానం.. ఆన్‌లైన్‌లో! | Old vechiles are in aution sales | Sakshi
Sakshi News home page

అద్దెకు విమానం.. ఆన్‌లైన్‌లో!

Published Sat, Sep 12 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

అద్దెకు విమానం.. ఆన్‌లైన్‌లో!

సైకిల్ నుంచి విమానం వరకూ కొనొచ్చు, అమ్మొచ్చు
- పాత వాహనాలకూ కొనేటపుడే ఉచిత బీమా
- ఈ ఏడాది 25 కోట్ల టర్నోవర్‌ను ఆశిస్తున్న డ్రూమ్
- సింగపూర్, మలేిసియా, థాయ్‌లకూ విస్తరణ
- రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టిన లైట్‌బాక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
: ‘వేలం పాట’లో భూమో.. బంగారమో లేకపోతే నగదో గెలుస్తామని మనందరికీ తెలిసిందే! కానీ, సైకిళ్లు, బైకులు, కార్లను కూడా సొంతం చేసేసుకోవచ్చు.! మన లక్కు మరీ మనల్ని వెంటాడిందంటే ఉచితంగా విమానంలో చక్కర్లు కూడా కొట్టేయొచ్చు. ఇవన్నీ డ్రూమ్ ప్రత్యేకతలంటున్నారు సంస్థ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్. ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలకో... ఫ్యాషన్ ఉత్పత్తులకో పరిమితమనుకున్న ఆన్‌లైన్ షాపింగ్ జాబితాలో ఇప్పుడు ఆటో మొబైల్ పరిశ్రమనూ చేర్చాడు సందీప్. దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన షాప్‌క్లూస్ వ్యవస్థాపకుడే ఈ సందీప్.

డ్రూమ్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ 125 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పరిశ్రమ కూడా ఇదే. ఉప్పు.. పప్పుల వంటి నిత్యావసరాలనే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్న ఈ రోజుల్లో ఆటోమొబైల్స్‌నూ ఎందుకు కొనకూడదనే ఆలోచన వచ్చిం ది. అప్పటికే దేశంలోని ప్రధానమైన ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన షాప్‌క్లూస్‌ను నిర్వహిస్తుండటంతో ఆటోమొబైల్ వేదికగా మరో సంస్థను ప్రారంభించేందుకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, మా ర్కెట్ విశ్లేషణ పెద్దగా కష్టం కాలేదు. దీంతో 2014 నవంబర్‌లో డ్రూమ్ కంపెనీ ప్రారంభమైంది. డ్రూమ్ సేవలు డెస్క్‌టాప్‌తో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లలోనూ లభిస్తున్నాయి.
 
పోటీ సంస్థలకు- డ్రూమ్‌కు మధ్య తేడా..

ఆన్‌లైన్ వేదికగా సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయించే సంస్థలు దేశంలో బోలెడన్ని ఉన్నాయి. మరి డ్రూమ్‌కు, ఇతర సంస్థలకున్న ప్రధాన తేడా ఏంటంటే... డ్రూమ్‌లో పాతవే కాదు.. కొత్త వాహనాలనూ కొనుగోలు చేయవచ్చు. అది కూడా తయారీ యూనిట్ ధరకే. అంతేకాదు ఏఎక్స్‌ఏ అసిస్టెంట్స్ ఇండియా అనే బీమా కంపెనీతోనూ మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. దీంతో డ్రూమ్‌లో వాహనాలు కొనుగోలు చేసినవాటికి కంపెనీనే బీమా చేసి ఇస్తుంది. లగ్జరీ కార్ల కొనుగోలుదారుల కోసం దేశంలో ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్లను విక్రయించే అతిపెద్ద కంపెనీ బిగ్‌బాయ్ టాయ్ అనే సంస్థతో డ్రూమ్ డీల్ కుదుర్చుకుంది. దీంతో తక్కువ ధరకే లగ్జరీ, సూపర్ లగ్జరీ కార్లను సొంతం చేసుకోవచ్చు.

రెండేళ్లలో 50 వేల మంది కస్టమర్ల లక్ష్యం...: ప్రస్తుతం డ్రూమ్‌లో సైకిళ్లు, బైకులు, కార్లు, జీపులు, వింటేజ్ కార్ల వంటి 14 రకాలైన 6,000కు పైగా రెండు, మూడు చక్రాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 15 వేల మంది డ్రూమ్ ద్వారా వాహనాలను కొనుగోలు చేశారు. రెండేళ్లలో 20 రకాల్లో 20 వేల వాహనాలు... 50 వేల మంది కస్టమర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ఆన్‌లైన్ ద్వారా ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లను అద్దెకిచ్చేందుకు, కొనుగోలు చేసేందుకు జెట్‌సెట్‌గో విమానయాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అత్యవసర ప్రయాణాల కోసం భారీ మొత్తాలు వెచ్చించేందుకు సిద్ధపడే వారికి మా సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇక ధరల పట్టికను చూస్తే.. అద్దె రూ.1.2 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఉంటుంది. సమయం, దూరం, విమానాన్ని బట్టి ధరల్లో మార్పు ఉంటుంది. విమానం కొనుగోలుకైతే రూ.46.2 కోట్ల నుంచి 79.26 కోట్ల వరకు ధరలున్నాయి.

రూ.100 కోట్ల నిధుల సమీకరణ..
డ్రూమ్‌లో సీడ్ రౌండ్‌లో బీనోస్ సంస్థ పెట్టుబడులు పెట్టింది. ఇటీవలే సిరీస్- ఏ కింద లైట్‌బాక్స్ అనే సంస్థ రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాది చివరికి రూ.25 కోట్ల అమ్మకాలకు చేరుకుంటాం. ప్రస్తుతం దేశంలో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి 38 నగరాల్లో డ్రూమ్ సేవలు అందుబాటు లో ఉన్నాయి. 2016 ముగిసేసరికల్లా 50 నగరాలకు విస్తరిస్తాం. సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పిన్స్ దేశాల్లోనూ విస్తరణ ప్రణాళికలు వేస్తున్నాం.

Advertisement
 
Advertisement
 
Advertisement