ద్వితీయశ్రేణి షేర్లవైపు చూడండి | Look for shares in the secondary side | Sakshi
Sakshi News home page

ద్వితీయశ్రేణి షేర్లవైపు చూడండి

Published Mon, Aug 24 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

ద్వితీయశ్రేణి షేర్లవైపు చూడండి

♦ బాగా పెరిగినవాటికి దూరంగా ఉండటం మంచిదే
♦ ఈ సారి మీ వ్యూహం మార్చాల్సి రావచ్చు
 
 సాధారణంగా అధిక వృద్ధి అవకాశాలున్న, నాణ్యమైన కంపెనీల షేర్ల కొనుగోలుకే ప్రాధాన్యమిస్తుంటాం. ఈ వ్యూహం ఇప్పటిదాకా సత్ఫలితాలనే ఇచ్చి ఉండవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఇదే వ్యూహం సరి కాకపోవచ్చు. అధిక వృద్ధి కనపర్చిన స్టాక్స్‌లో చాలా మటుకు ప్రస్తుతం అధిక వేల్యుయేషన్లతోనే ఉన్నాయి. ఎంపిక చేసిన 50 లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు గత నాలుగేళ్లలో వృద్ధి చెందిన తీరు, వాటి వేల్యుయేషన్లు దీనికి నిదర్శనం. నిఫ్టీతో పోలిస్తే ఈ అధిక వృద్ధి స్టాక్స్ గత నాలుగేళ్లలో గణనీయంగా రాబడులిచ్చాయి. 2010 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి లాభాలు రూ.89,385 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగి రూ.2,00,088 కోట్లకు చేరాయి.

అలాగే వీటి మార్కెట్ క్యాప్ సైతం 33 శాతం వార్షిక ప్రాతిపదికన ఎగిసి రూ.23,86,095 కోట్ల నుంచి ఏకంగా రూ.77,45,173 కోట్లకు చేరింది. పీఈ నిష్పత్తి 26.7 రెట్లు నుంచి 38.7 రెట్లకు చేరింది. మరోవైపు నిఫ్టీ ఆదాయాలు 9 శాతం స్థాయిలోనే ఉన్నాయి. అయితే, ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ల లాభాలు మెరుగుపడే కొద్దీ .. ఇప్పటిదాకా భారీ రాబడులు ఇచ్చిన స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెట్టే వ్యూహం ఆశించిన స్థాయిలో పనితీరు కనపర్చకపోవచ్చు.

 ఆర్థిక వృద్ధి మళ్లీ కోలుకుంటుందని, కార్పొరేట్ల లాభదాయకత మెరుగుపడుతుందనే రెండే ఆశలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కారణమవుతున్నాయి. కానీ, కార్పొరేట్ల లాభాలు ఒకవేళ మెరుగుపడితే.. గత నాలుగేళ్లుగా జరగని విధంగా ఆ వృద్ధి అన్ని రంగాల్లోనూ కనిపించాలి. అలాంటప్పుడు.. వృద్ధి కేవలం కొన్నింటికి  మాత్రమే పరిమితం కాకుండా మొత్తం అన్నింటింలోనూ ప్రతిఫలించాలి. నిజంగానే అలా జరిగితే.. ప్రస్తుతం వృద్ధి కోసం చెల్లిస్తున్న అధిక ప్రీమియం.. నిజంగానే అధిక రాబడులు అందించగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ తరహా ‘నాణ్యమైన, వృద్ధి ఆధారిత’ స్టాక్స్‌లో పెట్టుబడుల వ్యూహం ఎలా పనిచేసే అవకాశాలున్నాయో ఒకసారి చూద్దాం.

ఈ కోవకి చెందిన అనేక స్టాక్స్ గత నాలుగేళ్లలో చాలా తక్కువ స్థాయి హెచ్చుతగ్గులనే చూశాయి. కాబట్టి రాబోయే రోజుల్లో.. ముఖ్యంగా ఆర్థిక పలితాల సమయంలో ఇవి భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు.. మిగతా మార్కెట్‌తో పోలిస్తే ఈ స్టాక్స్ పనితీరు దిగువ స్థాయిలోనే ఉండవచ్చు. అప్పుడు ద్వితీయ శ్రేణి స్టాక్స్ కోలుకుని పరుగు మొదలుపెట్టొచ్చు. నాలుగేళ్లుగా సరైన పనితీరు కనపర్చని ‘నాణ్యమైన, అధిక డివిడెండ్ ఇచ్చే’ స్టాక్స్‌లో పెట్టుబడుల వ్యూహం ఇకపై మెరుగ్గా పనిచేయవచ్చు. ‘నాణ్యమైన, వృద్ధి ఆధారిత’ స్టాక్స్ మన పోర్ట్‌ఫోలియో విలువ తరిగిపోకుండా కొంత మేర కాపాడవచ్చేమో గానీ.. ఎల్లకాలం అత్యధిక రాబడులు ఇస్తాయని చెప్పలేం. కనుక ఇన్వెస్ట్ చేసే ముందు ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుకు అడుగేయాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement