ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు కావాలా! | Just Dial enter into E-commerce | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు కావాలా!

Published Wed, Dec 31 2014 3:02 PM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు కావాలా!

‘సాక్షి’ ఇంటర్వ్యూ జస్ట్ డయల్ ఫౌండర్ వీఎస్‌ఎస్ మణి
వెండార్ల నుంచి లోయెస్ట్ కోట్స్ కోరండి
ఏడు గంటల్లోనే ఉత్పత్తుల డెలివరీ

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లోకల్ సెర్చ్ సర్వీసుల కంపెనీగా ప్రారంభమైన జస్ట్ డయల్ ఇప్పుడు ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. అదీ ఇతర ఈ-కామర్స్ కంపెనీలకు భిన్నంగా వినూత్న వ్యాపార విధానంతో అడుగిడింది. సాధారణంగా ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే వెబ్‌సైట్లలో ఉన్న ధరకే కస్టమర్లు ఆర్డరు చేయాలి. కానీ జస్ట్ డయల్‌లో మాత్రం వెండార్ల నుంచి బెస్ట్ కోట్ కోరి తక్కువ ధరలో ఉత్పత్తిని చేజిక్కించుకోవచ్చని అంటున్నారు సంస్థ ఫౌండర్ వీఎస్‌ఎస్ మణి.

ఉత్పత్తులను ఏడు గంటల్లోనే డెలివరీ చేస్తున్నామని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకునేందుకు రూ.1,000 కోట్ల సమీకరణకు కంపెనీ ఇటీవలే బోర్డు అనుమతి పొందింది. జస్ట్ డయల్ సేవలు, ఇంటర్నెట్ వినియోగం వంటి అంశాలపై ఆయన ఏమన్నారంటే..
 
బెస్ట్ కోట్ కావాలా..
మొబైల్స్, గృహోపకరణాలు, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్, కెమెరా ఇలా ఉత్పత్తి ఏదైనా ఆన్‌లైన్‌లో విక్రయదారుల నుంచి బెస్ట్ కోట్ కోరవచ్చు. ఎవరు తక్కువ ధరకు విక్రయిస్తే వారి నుంచి కొనుక్కునే వెసులుబాటు ఉండడం కస్టమర్‌కు కలిసి వచ్చే అంశం. మధ్యాహ్నం 2 గంటలలోపు చేసిన ఆర్డర్లకు 7 గంటల్లో డెలివరీ అవుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యమూ ఉంది. వ్యాపారులను, కస్టమర్లతో అనుసంధానించడం వరకే మా పాత్ర.

జస్ట్ డయల్ రివర్స్ యాక్షన్‌లో అయితే కస్టమర్లకే వ్యాపారులు ఫోన్ చేసి సర్వీసు అందిస్తారు. అంటే తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్, కారు లోన్, బంగారంపై రుణం కావాలన్నా, ఏదైనా వ్యాపారంలో మంచి రాబడి రావాలనుకున్నా, అధిక వడ్డీకి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలన్నా.. పేరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ ఇస్తే చాలు. సంబంధిత ఏజెన్సీకి కస్టమర్ల వివరాలు వెళ్తాయి. బెస్ట్ అనిపించిన వ్యాపారితో కస్టమర్లు చేతులు కలపొచ్చు.

అరచేతిలో ప్రపంచం..: ఫోన్, వెబ్, ఎస్‌ఎంఎస్, వ్యాప్, యాప్ ద్వారా ప్రతిరోజూ 15 లక్షలకుపైగా కస్టమర్లు జస్ట్ డయల్‌ను సంప్రదిస్తున్నారు. వీరిలో 70% మంది ఆన్‌లైన్ కస్టమర్లు. ఆన్‌లైన్ వినియోగదార్లలో మొబైల్ ఫోన్ ద్వారా సెర్చ్ చేసే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే 183% పెరిగి 27%కి చేరింది. 3 లక్షలకుపైగా వ్యాపారులను ఈ-కామర్స్‌తో అనుసంధానించాం. చిన్న చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తుల విక్రయానికి చక్కని వేదిక దొరికింది. సెప్టెంబర్ 30 నాటికి 1.45 కోట్ల ఉత్పత్తులు, సేవలను వెబ్‌సైట్లో పొందుపరిచాం. వెండార్ల నుంచి చందా మాత్రమే వసూలు చేస్తున్నాం.

సెర్చ్ ప్లస్ సేవలు..
సేవల విషయంలో సమాచారమిచ్చే కంపెనీగా మొదలైన మా ప్రస్థానంలో ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని ఒక అడుగు ముందుకేశాం. హోటల్లో టేబుల్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, డాక్టర్ అపాయింట్‌మెంట్, అన్ని రకాల టికెట్ల బుకింగ్ ఇలా ఏదైనా వెబ్‌సైట్ నుంచి చిటికెలో చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 211 దేశాల్లో 73,403 నగరాలు, పట్టణాల్లోని 5.80 లక్షలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లను అనుసంధానించాం.

బెస్ట్ డీల్ పొంది గదులను బుక్ చేయొచ్చు. భారత్, కెనడా, యూకే, యూఎస్‌ఏలో విస్తరించాం. ఈ దేశాల్లో ఏ నగరంలో ఉన్నా జస్ట్ డయల్ ఒక గైడ్‌గా పనిచేస్తోంది. 43 భాషల్లో కస్టమర్ కేర్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. బిగ్ డీల్స్, సూపర్ ఆఫర్స్ కొద్ది రోజుల్లో జస్ట్ డయల్ కస్టమర్ల ముందుకు రానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement