బీమా ‘పంట’ పండటంలేదు! | Insuring sustainable livelihoods in agriculture | Sakshi
Sakshi News home page

బీమా ‘పంట’ పండటంలేదు!

Published Tue, Nov 12 2019 5:09 AM | Last Updated on Tue, Nov 12 2019 5:09 AM

Insuring sustainable livelihoods in agriculture - Sakshi

న్యూఢిల్లీ: పంటల బీమా (క్రాప్‌ ఇన్సూరెన్స్‌) అంటే.. బీమా కంపెనీలు భయపడిపోతున్నాయి! ప్రకృతి విపత్తుల కారణంగా పరిహారం కోరుతూ భారీగా క్లెయిమ్‌లు వస్తుండటం, ఫలితంగా ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాలతో కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద క్రాప్‌ ఇన్సూరెన్స్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. చోళమండలం ఎంఎస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. అయినా, కొన్ని కంపెనీలు మాత్రం ఈ విభాగం పట్ల ఆశావహంగానే ఉన్నాయి. పీఎం ఎఫ్‌బీవై కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలో వసూలైన స్థూల ప్రీమియం రూ.20,923 కోట్లు. కాగా, బీమా కంపెనీలకు పరిహారం కోరుతూ వచ్చిన క్లెయిమ్‌ల మొత్తం రూ.27,550 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగంలోని రీఇన్సూరెన్స్‌ సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (జీఐసీఆర్‌ఈ) సైతం తన క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పోర్ట్‌ఫోలియోను భారీ నష్టాల కారణంగా తగ్గించుకోవడం గమనార్హం. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ డేటాను పరిశీలిస్తే.. చోళమండలం ఎంఎస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ స్థూల ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 91 శాతం తగ్గిపోయి రూ.5.26 కోట్లుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన స్థూల ఆదాయం రూ.211 కోట్లుగా ఉంది.  

పెరిగిన స్థూల ప్రీమియం
పంటల బీమా విభాగంలో అన్ని సాధారణ బీమా కంపెనీలకు స్థూల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో పెరగడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.15,185 కోట్లతో పోలిస్తే 26.5 శాతం వృద్ధి చెంది రూ.19,217 కోట్లకు చేరుకుంది. ‘‘క్రాప్‌ ఇన్సూరెన్స్‌ మంచి పనితీరునే ప్రదర్శిస్తోంది. కొన్ని విభాగాల్లో క్లెయిమ్‌ రేషియో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ చాలా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఈ విభాగంపై బుల్లిష్‌గానే ఉన్నాయి’’అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రభుత్వ సంస్థల పెద్దపాత్ర
క్రాప్‌ ఇన్సూరెన్స్‌లో నష్టాల పేరుతో ప్రైవేటు కంపెనీలు తప్పుకున్నా కానీ, ప్రభుత్వరంగ బీమా సంస్థలు పెద్ద పాత్రే పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్‌ ఇన్సూరెన్స్, న్యూఇండియా ఇన్సూరెన్స్‌ కొన్ని ప్రైవేటు సంస్థలతోపాటు పంటల బీమాలో వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ప్రభుత్వరంగ అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అధిక మొత్తంలో క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటోంది. కాగా, ఈ ఏడాది ఎలాంటి క్రాప్‌ బీమా వ్యాపారాన్ని నమో దు చేయబోవడంలేదని రీ ఇన్సూరెన్స్‌ చార్జీలు దిగిరావాల్సి ఉందని  ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఎండీ, సీఈవో భార్గవ్‌ దాస్‌ గుప్తా వ్యాఖ్యానించారు.

ఈ రంగంలో పరిస్థితులు ఇలా..
► ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం పరిధిలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారం నుంచి తప్పుకుంది.
► చోళమండలం ఎంఎస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది.
► అధిక నష్టాలు, పరిహారం కోరుతూ భారీగా వస్తున్న క్లెయిమ్‌లు.  
► ప్రభుత్వరంగ రీఇన్సూరెన్స్‌ సంస్థ జీఐసీఆర్‌ఈ సైతం తన క్రాప్‌ పోర్ట్‌ఫోలియోను తగ్గించుకుంది.
► ప్రభుత్వరంగ నేషనల్‌ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ మాత్రం ఈ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి.  
► ప్రపంచవ్యాప్తంగా చూస్తే... అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద పంటల బీమా మార్కెట్‌ మనదే కావడం గమనార్హం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement