మెప్పించిన ఇన్ఫీ! | Infosys net profit slips 2.2 persant in Q2, revenue up 9.8persant | Sakshi
Sakshi News home page

మెప్పించిన ఇన్ఫీ!

Published Sat, Oct 12 2019 3:01 AM | Last Updated on Sat, Oct 12 2019 3:01 AM

Infosys net profit slips 2.2 persant in Q2, revenue up 9.8persant - Sakshi

న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌.. మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం నికర లాభం స్వల్పంగా 2.2 శాతం క్షీణించి రూ. 4,019 కోట్లుగా నమోదైంది. మార్కెట్‌ వర్గాలు ఇది సుమారు రూ. 4,040 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. గతేడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 4,110 కోట్లు. మరోవైపు, రెండో త్రైమాసికంలో ఆదాయం 9.8% వృద్ధితో రూ. 20,609 కోట్ల నుంచి రూ. 22,629 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 11.4 శాతం వృద్ధి నమోదైంది.

2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ గైడెన్స్‌ను ఇన్ఫోసిస్‌ పెంచింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 9–10 శాతానికి సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రెవెన్యూ వృద్ధి 7.5–9.5 శాతంగా ఉండొచ్చంటూ గైడెన్స్‌ ఇచ్చిన ఇన్ఫోసిస్‌ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో దీన్ని 8.5–10 శాతానికి పెంచింది. తాజాగా కనీస ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను మరింత పెంచింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. టీసీఎస్‌ లాభంలో స్వల్ప వృద్ధి సాధించగా, ఇన్ఫీ లాభాలు స్వల్పంగా తగ్గడం గమనార్హం.  

2.8 బిలియన్‌ డాలర్ల డీల్స్‌..
మరో త్రైమాసికంలో అన్ని విభాగాల్లోనూ, ప్రాంతాలవారీగాను ఆల్‌ రౌండ్‌ వృద్ధి సాధించగలిగాం. క్లయింట్లకు మాపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. 2.8 బిలియన్‌ డాలర్ల విలువ చేసే డీల్స్‌ కుదుర్చుకోగలిగాం. ఉద్యోగులకు మరింత ప్రయోజనాలు చేకూర్చేందుకు తీసుకుంటున్న చర్యలతో అట్రిషన్‌ రేటును తగ్గించుకోగలిగాం‘.
– ప్రవీణ్‌ రావు, సీవోవో

బహుముఖ వృద్ధి..
నిర్వహణ మార్జిన్లు, సామర్ధ్యాలు, ఆదాయాలు, డిజిటల్‌ విభాగం మెరుగుపడటంతో పాటు భారీ డీల్స్‌ కుదుర్చుకోగలిగాం. ఆట్రిషన్‌ తగ్గింది. దీంతో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు సాధించగలిగాం. వాటాదారులకు మరింత విలువ చేకూర్చడంతో పాటు క్లయింట్లకు అవసరమైన సేవలపై మరింతగా దృష్టి పెట్టే దిశగా కంపెనీ పురోగతి సాధిస్తోందనడానికి ఇవన్నీ స్పష్టమైన సంకేతాలు’.
– సలిల్‌ పరేఖ్, ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ

14% అదనంగా డివిడెండ్‌
నిర్వహణపరంగా అన్ని అంశాలను మెరుగుపర్చుకోవడంతో పాటు వ్యయాలు నియంత్రించుకోవడంతో రెడో త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్లు పెంచుకోగలిగాం. నిధులను మెరుగ్గా వినియోగించుకునే∙దిశగా మధ్యంతర డివిడెండ్‌ను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 14 శాతం పెంచగలిగాం’.
– నీలాంజన్‌ రాయ్, సీఎఫ్‌ఓ   

మరిన్ని విశేషాలు..
► సెప్టెంబర్‌ త్రైమాసికంలో డాలర్‌ మారకంలో నికర లాభం 569 మిలియన్‌ డాలర్లు కాగా ఆదా యం 3.21 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
► సీక్వెన్షియల్‌గా నికర లాభం 6 శాతం, ఆదాయం 3.8 శాతం పెరిగింది.  
► డిజిటల్‌ విభాగం ఆదాయాలు 38.4 శాతం వృద్ధి చెంది 1.23 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 38.3 శాతానికి చేరింది.
► 21–23 శాతం శ్రేణిలో ఆపరేటింగ్‌ మార్జిన్‌ గైడెన్స్‌ యథాతథం.
► రూ. 8,260 కోట్ల విలువ చేసే షేర్ల బైబ్యాక్‌ కార్యక్రమం ఆగస్టు 26తో ముగిసింది.  
► రెండో త్రైమాసికంలో నికరంగా 7,457 మంది నియామకాలు జరిగాయి. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.36 లక్షలకు చేరింది.  
► ఆట్రిషన్‌ రేటు జూన్‌ ఆఖరు నాటికి 23.4 శాతంగా ఉండగా, సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 21.7 శాతానికి తగ్గింది.  


స్టాక్‌ మార్కెట్‌ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. బీఎస్‌ఈలో సంస్థ షేరు 4.19% పెరిగి రూ. 815.70 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement