ఐఓసీ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ... బెస్ట్‌ | Indian Oil, ONGC, NTPC most profitable PSUs in FY18 | Sakshi
Sakshi News home page

ఐఓసీ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ... బెస్ట్‌

Published Fri, Dec 28 2018 3:55 AM | Last Updated on Fri, Dec 28 2018 3:55 AM

Indian Oil, ONGC, NTPC most profitable PSUs in FY18 - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో 2017–18 సంవత్సరంలో అత్యంత లాభదాయక కంపెనీలుగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ ముందున్నాయి. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఎయిర్‌ ఇండియా అధిక నష్టాలతో ఉన్నవిగా నిలిచాయి. పార్లమెంటు ముందు ప్రభుత్వం ఉంచిన పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సర్వేలో ఈ వివరాలు పేర్కొన్నారు. ప్రభుత్వరంగ కంపెనీల పనితీరుకు సంబంధించి సమగ్ర వివరాలు చూస్తే...

► ప్రభుత్వానికి ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన వాటిల్లో ఐవోసీఎల్‌ వాటా 13.37 శాతం, ఓఎన్‌జీసీ 12.49 శాతం, ఎన్‌టీపీసీ 6.48 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ లాభదాయత పరంగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.
►  టాప్‌–10 లాభదాయక ప్రభుత్వ కంపెనీల్లో పవర్‌ ఫైనాన్స్‌ కూడా చోటు సంపాదించింది.  
►  ప్రభుత్వరంగంలో 184 కంపెనీలు లాభాలను నమోదు చేస్తే, ఈ లాభాల్లో 61.83 శాతం అగ్ర స్థాయి 10 కంపెనీలదే.  
► 2017–18లో 71 ప్రభుత్వరంగ కంపెనీలు నష్టాలను నమోదు చేయగా, మొత్తం నష్టాల్లో 84.71 శాతం టాప్‌–10 కంపెనీలవే ఉన్నాయి. ఇందులోనూ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఎయిర్‌ఇండియా ఉమ్మడి నష్టాలే 52.15 శాతం.
►  భారత్‌ కోకింగ్‌ కోల్, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్, ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ నష్టాలను ఎదుర్కొంటున్న జాబితాలో ఉన్నాయి.
►  స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన 52 ప్రభుత్వరంగ సంస్థల ఉమ్మడి మార్కెట్‌ క్యాప్‌ ఈ ఏడాది మార్చి నాటికి రూ.15.22 లక్షల కోట్లు.

ప్రభుత్వ ఖజానాకు రూ.3.5 లక్షల కోట్లు
ఇక ప్రభుత్వరంగ సంస్థల ద్వారా 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్టు ప్రభుత్వ సర్వే తెలియజేసింది. ఎక్సైజ్‌ డ్యూటీ, కస్టమ్స్‌ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్‌ పన్ను, డివిడెండ్‌ రూపంలో ఈ మొత్తాన్ని సమకూర్చాయి. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో చూస్తే 2.98 శాతం తక్కువ. 2016–17లో ప్రభుత్వరంగ కంపెనీల నుంచి వచ్చిన ఆదాయం రూ.3.6 లక్షల కోట్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క డివిడెండ్‌ రూపంలోనే రూ.76,578 కోట్లు సమకూరింది. క్యాజువల్, కాంట్రాక్టు కార్మికులకు అదనంగా 10.88 లక్షల మందికి ప్రభుత్వరంగ సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 11.35 లక్షల మందితో పోలిస్తే 4.14 శాతం తగ్గింది. కానీ, అదే సమయంలో వేతనాల బిల్లు రూ.1,40,956 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,57,621 కోట్లకు పెరిగింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement