ప్లాంట్లు మూసేయండి – ఉత్పత్తి ఆపేయండి | Indian auto industry suspends production due to coronavirus | Sakshi
Sakshi News home page

ప్లాంట్లు మూసేయండి – ఉత్పత్తి ఆపేయండి

Published Tue, Mar 24 2020 3:06 AM | Last Updated on Tue, Mar 24 2020 3:06 AM

Indian auto industry suspends production due to coronavirus - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా వాహనాలు, విడిభాగాల తయారీ సంస్థలు కొంత కాలం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని, ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసే అంశాలను పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్యలు సూచించాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌), ఆటో కాంపోనెంట్‌ మ్యాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఏసీఎంఏ).. కంపెనీలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా చూసేందుకు కొంతైనా తోడ్పడగలవని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా తెలిపారు. బాధ్యతాయుతంగా జాతి నిర్మాణంలో భాగం కావాలన్న సియామ్‌ నినాదానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.  

ప్లాంట్ల మూసివేత బాటలో మరిన్ని సంస్థలు..
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మరికొన్ని కంపెనీలు తమ ప్లాంట్లలో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హ్యుందాయ్‌ మోటార్, టయోటా కిర్లోస్కర్‌ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మార్చి 23 నుంచే (సోమవారం) చెన్నై ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు హ్యుందాయ్‌ ప్రకటించగా, టయోటా కిర్లోస్కర్‌ .. కర్ణాటకలోని బిడది ప్లాంటులో తయారీ ఆపివేస్తున్నట్లు తెలిపింది. టీవీఎస్‌ మోటార్‌ తమ ప్లాంట్లన్నింటిలోనూ మార్చి 23 నుంచి రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు బజాజ్‌ ఆటో కూడా తమ ఫ్యాక్టరీల్లో తయారీ కార్యకలాపాలు ఆపేసినట్లు సోమవారం ప్రకటించింది.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మహారాష్ట్రలోని చకన్‌తో పాటు మిగతా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో కూడా ఉత్పత్తి నిలిపివేసినట్లు బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సర్వీసుల కోసం స్వల్ప సంఖ్యలో మాత్రమే సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఉద్యోగుల విదేశీ ప్రయాణాలను, సమావేశాలను రద్దు చేశామని.. పలువురికి వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం అమలు చేస్తున్నామని శర్మ చెప్పారు. కాంట్రాక్టు ప్రాతిపదికన తమకు వాహనాలు తయారు చేసి అందించే సుజుకీ మోటార్‌ గుజరాత్‌ (ఎస్‌ఎంజీ) ఉత్పత్తి నిలిపివేసినట్లు మారుతీ సుజుకీ తెలిపింది.  కార్ల తయారీ సంస్థలు కియా మోటార్స్, బీఎండబ్ల్యూ, రెనో కూడా ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ప్లాంటు, కంపెనీ కార్యాలయం కార్యకలాపాలు కొన్నాళ్లు ఆపివేస్తున్నట్లు కియా మోటార్స్‌ వెల్లడించింది.

సిబ్బంది, వినియోగదారులు, భాగస్వాములు మొదలైన వారందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, మార్చి నెలాఖరు దాకా తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్, హర్యానాలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు జపాన్‌ ద్విచక్ర వాహన దిగ్గజం ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) తెలిపింది. హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్లాంట్లలో మార్చి 23 నుంచి 31 దాకా, తమిళనాడు ప్లాంటులో మార్చి 24 నుంచి 31 దాకా తయారీ కార్యకలాపాలు ఉండవని వివరించింది.  మారుతీ సుజుకీ, హోండా కార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫియట్, హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌ సైకిల్, సుజుకీ మోటార్‌సైకిల్‌ వంటి సంస్థలు తయారీని నిలిపివేస్తున్నట్లు ఆదివారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement