గోల్డ్ ఫండ్స్.. ఇప్పుడొద్దు! | Gold Fund Sales Resume as Prices Fall for Third Straight! | Sakshi
Sakshi News home page

గోల్డ్ ఫండ్స్.. ఇప్పుడొద్దు!

Published Mon, Jan 4 2016 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

గోల్డ్ ఫండ్స్.. ఇప్పుడొద్దు!

శ్రీధర్‌కు ఈ మధ్యే పెళ్లి కుదిరింది. అవసరం కాబట్టి కొంత బంగారాన్ని కొనాలనుకున్నాడు. బంగారం ధరలు కూడా కొంచెం తగ్గాయి కదా!! కొనుగోలుకు ఇదే మంచి సమయమనుకున్నాడు. కాకపోతే అదే సమయంలో పేపర్లో ఓ వార్త చదివాడు. బంగారం ధరలు మరింత తగ్గుతాయన్నది ఆ వార్త సారాంశం. దీంతో శ్రీధర్ సందిగ్ధంలో పడ్డాడు. బంగారంపై ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామా? వద్దా? అనే విషయమై ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. చివరికి ఈ వ్యవహారాల్లో అనుభవం ఉన్న స్నేహితుడితో విషయం చెప్పగా... ‘‘బంగారాన్ని భౌతికంగా కొనటమే కాదు! గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, బంగారం బాండ్లు వంటి సాధనాల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు’’ అని చెప్పాడాయన.

కాకపోతే పేపర్ గోల్డ్ పథకాలుగా కూడా పిలిచే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌లు) కొన్నాళ్ల కిందటివరకూ బాగా ప్రాచుర్యం పొందాయని, ఇపుడు మాత్రం చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పాడు. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం...

 
ఏడాది కాలంలో2-8% మేర తగ్గిన రాబడి
బంగారం ధరలు పడితే పరిస్థితి మరింత దారుణం!
2013 నుంచి సగానికి క్షీణించిన ఈటీఎఫ్ నిర్వహణ విలువ
రెండేళ్లలో ఈటీఎఫ్‌ల నుంచి రూ.3,900 కోట్ల ఉపసంహరణ
కొన్నాళ్లపాటు బంగారానికి దూరంగా ఉండమంటున్న నిపుణులు


తగ్గిన గోల్డ్ ఈటీఎఫ్‌ల రాబడి
గోల్డ్ ఈటీఎఫ్‌లు బాగా ప్రాచుర్యం పొందటానికి కారణం బంగారం ధరలే. ఈ ధరలు ఎగిసే కొద్దీ గోల్డ్ ఈటీఎఫ్‌ల డిమాండ్ పెరుగుతుంది. కానీ కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ఏడాది  కాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల రాబడి దాదాపు 2-8 శాతం మేర తగ్గింది. దీంతో అందులో ఇన్వెస్ట్ చేసిన చాలా మందికి చక్కని రాబడి రాలేదు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు వారి డబ్బులను గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నారు.

మ్యూచ్‌వల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల ప్రకారం.. ఇన్వెస్టర్లు గడిచిన రెండేళ్లలో మొత్తంగా రూ.3,900 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీనిపై సీఎల్‌ఎస్‌ఏ చీఫ్ స్ట్రాటజిస్ట్, మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్ వుడ్ మాట్లాడుతూ... ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో ఔన్స్ బంగారం ధర 1,000 డాలర్ల దిగువకు వస్తుందన్నారు. ఒకవేళ బంగారం ధర తగ్గితే గోల్డ్ ఈటీఎఫ్ రాబడి కూడా తగ్గుతుంది.
 
ఈటీఎఫ్‌లలో ఆగని ఉపసంహరణ ...
గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి తరలివెళ్లే పెట్టుబడుల ఉపసంహరణకు అడ్డుకట్ట పడటం లేదు. పెట్టుబడుల ఉపసంహరణ వరుసగా 28 నెలలుగా కొనసాగుతోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా 2013-14లో రూ.2,293 కోట్లను, 2014-15లో రూ.1,475 కోట్లను, ఈ ఏడాది జవనరి-నవంబర్ వరకూ రూ.845 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల మొత్తం నిర్వహణ విలువ మే నెలలో రూ.6,688 కోట్లకు, ఆగస్ట్‌లో రూ.6,226 కోట్లకు, నవంబర్‌లో రూ.5,830 కోట్లకు పడిపోయింది.

2007 మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ విలువ (ఏయూఎం) రూ.96 కోట్లుగా ఉంది. అలా అలా పెరుగుతూ... 2013 మార్చిలో గరిష్టంగా రూ.11,648 కోట్లకు చేరింది. అప్పటి నుంచి ఉపసంహరణల దెబ్బకు తగ్గటం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే సగం మేర తగ్గిపోయింది.
 
ఆకర్షణ తగ్గిందెందుకు?
గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఇన్వెస్టర్లు దూరమవుతుండటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఈక్విటీ మార్కెట్ మంచి రాబడిని అందిస్తుండటం. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో బీఎస్‌ఈ ఇండెక్స్ 5 శాతంమేర బలపడింది. రెండవదేమో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులుండటం. పెపైచ్చు ఈ ఏడాది కూడా బంగారం ధరలు అంత ఆశాజనకంగా ఉండవనేది మార్కెట్ నిపుణుల మాట. ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయని ఇన్వెస్టర్లు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ... ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే 10 గ్రాముల బంగారం ధర  దేశీయంగా రూ.20,000-రూ.24,000కు తగ్గే అవకాశముందని అంచనా వేసింది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు... యూకేలో యూరో రెఫరెండమ్, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి పలు అంశాల వల్ల కూడా బంగారం, వెండి ధరలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటాయనేది నిపుణుల అంచనా. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 8 గోల్డ్ ఈటీఎఫ్‌ల పెట్టుబడులు కూడా మే నెలలో ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరటం గమనార్హం.
 
దూరంగా ఉండటమే బెటర్!
ఇన్వెస్ట్‌మెంట్లు, రాబడి పరంగా చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల పనితీరు బాగులేదు. ఈ ఏడాది భవిష్యత్తు కూడా ఆశాజనకంగా లేదు కనక బంగారం సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్లకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు.   ఇటీవల ప్రారంభించిన గోల్డ్ బాండ్ల పథకం కూడా గోల్డ్ ఈటీఎఫ్‌కు పోటీ అయింది. గోల్డ్ బాండ్స్‌కు ప్రభుత్వం 2.75% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ సౌకర్యం ఈటీఎఫ్‌ల లో లేదు. మార్కెట్‌లను బట్టి ఈటీఎఫ్ ధర నిర్ణయం జరుగుతుంది. గోల్డ్ బాండ్స్ కొన్నాక బంగారం ధర పెరిగితే గోల్డ్ బాండ్ల ధర కూడా పెరుగుతుంది. డీ మ్యాట్ రూపంలో గోల్డ్ బాండ్లను కొనొచ్చు. బాండ్లపై రుణమూ తెచ్చుకోవచ్చు.
 
ఒడిదుడుకుల్లో బంగారం ధర
బంగారం ధరల పతనం 2013 నుంచి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో రూ.28,000 మైలురాయిని తాకిన బంగారం ధర... జనవరి మధ్యలో రూ.28,215 స్థాయిక్కూడా చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, వినియోగపు భయాల నేపథ్యంలో జులైలో రూ.24,590 వద్దకు పతనమైంది. ఇది 2011 తరవాత కనిష్ఠ స్థాయి. 2013 ఆగస్ట్ 28 నాటి ఆల్‌టైం గరిష్ట స్థాయి ధర రూ.33,790తో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 25 శాతం దిగువన ఉంది. ప్రస్తుతం రూ.25,000 శ్రేణిలో కదలాడుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement