డాక్టర్ రెడ్డీస్ క్యూ1 ఫలితాలు..లాభం 626 కోట్లు | Dr. Reddy's Q1 results 626 crore profit | Sakshi
Sakshi News home page

డాక్టర్ రెడ్డీస్ క్యూ1 ఫలితాలు..లాభం 626 కోట్లు

Published Fri, Jul 31 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

డాక్టర్ రెడ్డీస్ క్యూ1 ఫలితాలు..లాభం 626 కోట్లు

రష్యా దెబ్బతీసినా ఆదుకున్న ఇండియా, అమెరికా
7% వృద్ధితో రూ. 3,757 కోట్లకు ఆదాయం
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ మూడు నెలల కాలంలో ఆదాయంలో 7 శాతం, నికర లాభంలో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ.550 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.626 కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 3,517 కోట్ల నుంచి రూ. 3,757 కోట్లకు చేరింది. కరెన్సీ ఒడిదుడుకుల వల్ల రష్యా వంటి వర్థమాన దేశాల్లో వ్యాపారం బాగా క్షీణించినా... ఇతర దేశాల్లో వ్యాపారంలో వృద్ధి నమోదు కావటంపై కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది.

రష్యా కరెన్సీ రూబెల్ క్షీణించడం వల్ల అక్కడ వ్యాపారంలో 45 శాతం క్షీణత నమోదయిందని, కానీ ఇదే సమయంలో కీలకమైన ఉత్తర అమెరికాలో 14 శాతం, ఇండియాలో 19 శాతం వృద్ధి నమోదు కావడంతో మెరుగైన ఫలితాలు ప్రకటించగలిగామని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి తెలిపారు. సమీక్షా కాలంలో రష్యా వ్యాపారం రూ.420 కోట్ల నుంచి రూ. 230 కోట్లకు పడిపోగా, ఇదే సమయంలో ఇండియా వ్యాపారం రూ.400 కోట్ల నుంచి రూ.476 కోట్లకు, ఉత్తర అమెరికా ఆదాయం రూ.1,620 కోట్ల నుంచి రూ.1,851 కోట్లకు పెరిగింది.

ఉత్తర అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిడి అధికంగా ఉందని, కొత్త ఉత్పత్తులకు అనుమతి లభిస్తే రానున్న కాలంలో కూడా ఇదే విధమైన ఫలితాలను ప్రకటించగలమని సౌమెన్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిపెడుతున్నామని, దేశీ మార్కెట్లో 16వ స్థానం నుంచి 14వ స్థానానికి చేరామని తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ ఇండియాలో 6 ఉత్పత్తులను విడుదల చేసింది. వ్యాపార విస్తరణ కోసం టేకోవర్లపై కూడా దృష్టిసారిస్తున్నామని, మంచి కంపెనీ సరైన ధరకు లభిస్తే తప్పకుండా పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 5.2 శాతం మేర ఎగబాకి.. రూ. 3,908 వద్ద స్థిరపడింది.

Advertisement
 
Advertisement
Advertisement