ధరల దరువుపై యుద్ధ భేరి | ysrcp fight on Price hike | Sakshi
Sakshi News home page

ధరల దరువుపై యుద్ధ భేరి

Published Thu, Dec 3 2015 11:18 PM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

ysrcp fight on Price hike

వైఎస్సార్‌సీపీ ఆందోళనతో దద్దరిల్లిన విశాఖ
వేలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు
భారీ ర్యాలీని అడ్డగించిన పోలీసులు
అమర్‌నాథ్ సహా పలువురి అరెస్ట్
కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే బూడి నేతృత్వంలో ధర్నా

 
అధిక ధరలపై నిరసన వెల్లువెత్తింది. నినాదాలతో నగరం హోరెత్తింది. సర్కార్ వైఫల్యాలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ఆందోళనలో పాల్గొన్న ప్రజలను నిలువరించేందుకు పోలీసులు
 కర్కశ త్వాన్ని ప్రదర్శించారు. అడగుడుగునా ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు విఫలయత్నం చేశారు. ర్యాలీని అడ్డుకొని, పార్టీ ముఖ్యనేతలందరినీ అదుపులోకి తీసుకున్నా కలెక్టరేట్ వద్ద ధర్నాను మాత్రం ఆపలేక పోయారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని వామపక్షాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి.
 
విశాఖపట్నం: ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం విశాఖలో తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సరస్వతీ పార్కు నుంచి జగదాంబ జంక్షన్, కేజీహెచ్ అప్‌రోడ్ మీదుగా ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకోసం ముందుగా పోలీసుల అనుమతి కూడా కోరింది. బుధవారం రాత్రి వరకు అభ్యంతరం లేదని చెప్పిన పోలీసులు గురువారం తెల్లవారేసరికి సెక్షన్-30, 31లు అమలులో ఉన్నందున ర్యాలీకే కాదు.. ధర్నాకు కూడా అనుమతినిచ్చేది లేదని మాట మార్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ నిలువరించేందుకు నగరానికి దారితీసే గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక, హనుమంతవాకలతోపాటు నగరంలోని ఎన్‌ఏడీ జంక్షన్, మద్దిలపాలెం, పెందుర్తి, దుర్గాలమ్మ గుడి, ఓ ఆప్టెక్స్ సెంటర్, కంచరపాలెం, ఊర్వశి తదితర ముఖ్య కూడళ్లలో భారీగా పోలీసులను మోహరింపచేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోపక్క ర్యాలీ ప్రారంభమయ్యే సర స్వతీ పార్కు, వైఎస్సార్‌సీపీ కార్యాలయం, జగదాంబ జంక్షన్‌లలో నగరంలోని రోప్ పార్టీలతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

శివార్లలో ఎన్ని ఆంక్షలు పెట్టినా పార్టీ కార్యాలయానికి వేలాదిగా జనం పోటెత్తారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్ కుమార్, మళ్ల విజయప్రసాద్, కో ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజు, రొంగలి జగన్నాథం, రాష్ర్ట అధికార ప్రతినిధులు కొయ్యా ప్రసాదరెడ్డి, కంపా హనోకు, రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, అనుబంధ విభాగాల జిల్లా, నగర కమిటీల అధ్యక్షులు పసుపులేటి ఉషాకిరణ్, బోని దేవ, బోని శివరామకృష్ణ, మహ్మద్ షరీఫ్, జబీరా బేగం, తుల్లి చంద్రశేఖర్, నగర ప్రచార కార్యదర్శి బర్కత్ అలీ, పక్కి దివాకర్, సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పార్టీ శ్రేణులతో చర్చించి ర్యాలీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలతో జగదాంబ జంక్షన్ కిక్కిరిసిపోవడంతో ఏసీపీలు పాపారావు, రమణలకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ర్యాలీకి అనుమతిస్తున్నామని, నినాదాలు, బ్యానర్లు లేకుండా బృందాలుగా జిల్లా కోర్టు పక్క నుంచి వెళ్లాలని నాయకులకు సూచించారు. పార్టీ శ్రేణులు  కొద్ది దూరం వెళ్లేసరికి పోలీసులు అడ్డగించి ర్యాలీకి అనుమతిచ్చే ప్రసక్తి లేదంటూ బలవంతంగా వ్యాన్‌లలో ఎక్కించారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లిపోయారు. ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేసి ఫోర్‌‌త టౌన్, భీమిలి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు మాత్రం పోలీసుల కళ్లుగప్పి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అప్పటికే వివిధ డివిజన్ల నుంచి అక్కడకు చేరుకున్న కార్యకర్తలు ధర్నాకు ఉపక్రమించారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, నర్సీపట్నం కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర గణేష్ తదితరులు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి సుమారు రెండుగంటలపాటు ధర్నా చేశారు. అనంతరం ఏఓ ప్రకాశరావుకు వినతిపత్రం సమర్పించారు.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement