అవి‘నీటి’ గలగల Water Works to flow GVMC mamulla | Sakshi
Sakshi News home page

అవి‘నీటి’ గలగల

Published Thu, Dec 12 2013 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

Water Works to flow GVMC mamulla

=జీవీఎంసీ వాటర్ వర్క్స్‌లో మామూళ్ల ప్రవాహం
 =తాజాగా ఏసీబీకి చిక్కిన ఈఈ

 
సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ  వాటర్ వర్క్స్ విభాగంలో ‘మామూళ్లు’ ధార కడుతున్నాయి.  ఇక్కడి అధికారులు ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించేశారు. పరిశ్రమలు, అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత కుళాయి కనెక్షన్ల మంజూరుకు ఇక్కడి నుంచి అనుమతి తప్పనిసరి. బల్క్, సెమీ బల్క్ కనెక్షన్లకు సంబంధించి సొమ్ము ఇస్తేనే పని చేస్తారన్న అపవాదును ఇక్కడి అధికారులు మూటగట్టుకున్నారు. తాజాగా ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించే విషయమై రూ.30వేలు లంచం తీసుకుంటూ నీటిసరఫరా విభాగం ఈఈ పీవీవీ సత్యనారాయణరాజు సహా కంప్యూటర్ ఆపరేటర్ అప్పలరాజు ఏసీబీకి చిక్కిన విషయం జీవీఎంసీలో చర్చనీయాంశమైంది.

డీఎస్పీ నరసింహారావు, ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, రమణమూర్తి, గణేష్‌లు మాటు వేసి వీరిని పట్టుకున్నారు. నగరం మొత్తం మీద టీఎస్సార్ కాంప్లెక్సులో ఏర్పాటైన మంచినీటి సరఫరా విభాగం కీలకమైనది. వాణిజ్య అవసరాల కోసం హొటళ్లు, విందు వినోదాలకు, ఉచిత నీటి సరఫరా ఇక్కడి నుంచే మొదలవుతుంది. మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ, ఏలేరు తదితర రిజర్వాయర్ల నుంచి నగరానికి మంచినీటి సరఫరా కావాలంటే పైప్‌లైన్లు వేయించడం, పంప్‌హౌస్‌లు నిర్మాణం, వాటికి రోడ్లు వేయించడం కూడా ఇక్కడి అధికారులే చేయిస్తుంటారు.

వీటికి సంబంధించి కాంట్రాక్టర్లు టెండర్ల మేరకు పనులు పూర్తి చేయిస్తారు. వారికి బిల్లులు మంజూరు చేయించాలంటే అనధికారికంగా అధికారులు బిల్లు మొత్తంలో 1శాతం కమిషన్ డిమాండ్ చేస్తుంటారు.  బుధవారం నరవకు చెందిన గల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి గతేడాది మెటల్‌రోడ్డు వేయించినందుకు సుమారు రూ.20 లక్షల బిల్లు కోరగా అక్కడి ఈఈ రూ.4శాతం కమిషన్ డిమాండ్ చేయడమే ఇక్కడి అవినీతికి మచ్చు.   

జీవీఎంసీ వాటర్‌వర్క్స్ విభాగంలో ఏడాది నుంచి క్లియర్ కాని ఫైళ్లు ఉన్నాయి. అప్పు చేసి వడ్డీలు కడుతూ బిల్లు కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లు ఇక్కడి పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాజుపై గతంలోనూ ఎన్నో ఆరోపణలున్నాయి. కోట్లాదిరూపాయల డీడీల కుంభకోణం కూడా గతంలో ఇదే విభాగంలో జరగడం మరింత అక్రమాలకు తావిస్తోంది.

అయితే తనను ఎవరో ఇరికించారని, గురువారం తాను ముఖ్యమైన సమావేశంలో పాల్గొనాల్సి ఉందని, కాంట్రాక్టర్లు కొంతమంది పీఎఫ్, ఈఎస్‌ఐ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆ విషయం తాను సమావేశంలో వెల్లడించాల్సి ఉంది కాబట్టే ఈ విధంగా ఇరికించారని తోటి సిబ్బంది వద్ద ఈఈ రాజు వాపోయినట్టు తెలిసింది. కాళ్లరిగేలా తిప్పించుకుంటూ బిల్లు మంజూరుకు  కమీషన్ డిమాండ్ చేయబట్టే తాను ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు గల్లా శ్రీనివాసరావు సాక్షికి చెప్పారు.
 
ఏసీబీకి ఫిర్యాదివ్వాలంటే డీఎస్పీ సెల్ నంబర్ 9440446170, 71, 72, 73ను సంప్రదించవచ్చు
 

Advertisement
 
Advertisement
 
Advertisement