మాతృమూర్తిపై మానవత్వం మృగ్యం | There were humanity on Mother | Sakshi
Sakshi News home page

మాతృమూర్తిపై మానవత్వం మృగ్యం

Published Sun, Oct 12 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

మాతృమూర్తిపై మానవత్వం మృగ్యం

రాజవోలు (రాజమండ్రిరూరల్) :ఆమె ముగ్గురు బిడ్డలకు కన్నతల్లి. పిల్లలను కంటికి రెప్పలా సాకింది. మూడు నెలల క్రితం భర్త కన్నుమూయడంతో ఆ బెంగతో ఆమె మంచం పట్టింది. ఒంటిపై పుండు ఏర్పడి దుర్వాస వస్తోంది. ఆ దశలో ఆమెను వంటరిగా వదిలేశారు ఆమె బిడ్డలు. ఆమెకు వచ్చే పింఛన్‌ను అనభవిస్తూ ఆమెకు కనీసం ఆసరాగా నిలవని ఆమె సంతానంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... రాజవోలు ఎస్సీపేటకు చెందిన ఎలక్ట్రికల్ ఉద్యోగి అంబటి భీమ్‌సింగ్ విద్యుత్‌శాఖలో పనిచేసి పదవీవిరమణ చేసి మూడు నెలల క్రితం మృతిచెందాడు. ఆ బెంగతో అతని భార్య అంబటి మేరీరత్నం అనారోగ్యంతో మంచానపడింది. ఆమెకు ఇద్దరు కుమారులు ప్రశాంత్‌కుమార్(దొరబాబు), ప్రవీణ్(నాని), కుమార్తె ప్రసన్నకుమారి ఉన్నారు. పెద్దకుమారుడు దొరబాబు జి.మామిడాడలో, కుమార్తె ప్రసన్నకుమారి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉంటున్నారు. చిన్న కుమారుడు   ప్రవీణ్ రాజమండ్రిలో ఉంటున్నాడు.
 
 మేరీరత్నం గ్రామంలోని ఎస్సీపేట కమ్యూనిటీహాలు వద్ద తన ఇంట్లో ఉంటోంది. ఆమెకు రూ. 18 వేలు పింఛన్ వస్తోంది. దానికి సంబంధించిన ఏటీఎం కార్డు ప్రవీణ్ వద్దే ఉంది. ఆమెను ఇంటి వరండాలోనే ఒక మంచంపై పడుకోబెట్టారు. ప్రవీణ్ ఈమధ్యనే మేరీరత్నానికి వైద్యం చేయించి ఇక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె లేవలేని పరిస్థితిలో ఉండగా ఒంటిపై పుండు ఏర్పడింది. ఆ పుండు నుంచి వస్తున్న దుర్వాసనను చుట్టుపక్కలవారు భరించలేకపోయారు. దీంతో ఈవిషయాన్ని స్థానికులు ప్రవీణ్‌కు ఫోన్‌చేసి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దాంతో వారు రూరల్ తహశీల్దార్ జి.భీమారావుకు ఫిర్యాదు చేశారు.
 
 ఆయన వీఆర్వో భాస్కరరామారావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావులను ఆమె ఇంటికి పంపించారు. వారు స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. ఎవరైనా మేరీరత్నానికి అన్నంపెడితే మీరే చూడండి అంటూ ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేసేవాడని వారు తెలిపారు. ప్రవీణ్‌కు వీఆర్వో ఫోన్‌చేసి వెంటనే వచ్చి మీతల్లిని ఆస్పత్రిలో చేర్పించాలని, లేని పక్షంలో తామే ఆస్పత్రిలో చేర్పిస్తామని తెలిపారు. దానికి ప్రవీణ్ సాయంత్రం వచ్చి తనతల్లిని ఆస్పత్రిలో చేర్పిస్తానని చెప్పాడని ఆయన తెలిపారు. అయితే రాత్రి 9 గంటల వరకు అతను తల్లివద్దకు రానేలేదు. దీనిపై తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement