లెక్క తేలింది కానీ... | Teacher transfers in Vizianagaram | Sakshi
Sakshi News home page

లెక్క తేలింది కానీ...

Published Wed, Jul 19 2017 1:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

Teacher transfers in Vizianagaram

ఉపాధ్యాయ బదిలీలపై కొనసాగుతున్న ఉత్కంఠ
కౌన్సెలింగ్‌పై తొలగని ప్రతిష్టంభన
మారిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌
నేడు ప్రాధమిక జాబితా విడుదలకు అవకాశం

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఇక కౌన్సెలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ అదీ తొలిరోజు జరగలేదు. మళ్లీ వారిలో ఒకటే ఉత్కంఠ. రోజుకో ఉత్తర్వు... పూటకో నిబంధనతో ఉపాధ్యాయులను రెండు నెలలుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విద్యాశాఖ విభాగం మళ్లీ ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా... కౌన్సెలింగ్‌ వాయిదా వేయడంతో ఇంకా ఈ వ్యవహారంలో ప్రతిష్టంభన కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది.

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియలో రెండు నెలల తర్జన భర్జనలు ఒక కొలిక్కి వచ్చింది. ఎప్పటికప్పుడు మారుతున్న షెడ్యూల్‌ ప్రకారం జిల్లా యంత్రాంగం బదిలీలకు ఏర్పాట్లు చేస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జాప్యం వల్ల జిల్లా ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ మాత్రం వీడలేదు. ఉపాధ్యాయుల బదిలీ నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకో ఉత్తర్వు జారీ కావడంతో గందరగోళం కొనసాగుతూనే ఉంది.

షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ ఆగిపోవడంతో ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. వాయిదా వేసిన విషయాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారులు ముందుగా ప్రకటించలేదు. దీనివల్ల తొలిరోజు కౌన్సెలింగ్‌కు హాజరవ్వాల్సిన ప్రధానోపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. దీనిపై డీఈఓ ఎస్‌.అరుణకుమార్‌ వివరణ ఇస్తూ జిల్లాలో బదిలీలకు సంబంధించిన మంగళవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఈ నెల 21వ తేదీ నుంచి కొనసాగుతుందని ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చినట్టు తెలిపారు.

మారిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌
తాజాగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీన కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తామని డీఈఓ ఎస్‌.అరుణకుమారి తెలిపారు. తొలుత హెడ్మాస్టర్లు, ఆ తరువాత స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లు, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తామని, వీటిన్నింటినీ పూర్తి చేసి వచ్చే నెల 3వ తేదీన కొత్త స్థానాలనుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు.

నేడు ప్రాధమిక జాబితా విడుదల
ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల పరిశీలన పూర్తయింది కొద్దిరోజులుగా జరిగుతున్న ఈ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. తదనంతరం బదిలీ అయ్యే ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రాధమిక జాబితాను డీఈఓ విడుదలకు సిద్ధంగా ఉంచారు. ఉన్నతాధికారుల అనుమతి పొందిన వెంటనే విడుదల చేస్తారు. బుధ, గురువారాల్లో సీనియారిటీ ప్రాథమిక జాబితాను విడుదల చేయనున్నారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణ, నివృత్తి తరువాత తుది జాబితాను ఖరారు చేస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement