పుట్టి ముంచుతున్న ప్రాజెక్టులు | Smart City Mission In Visakhapatnam Making Money Consuming | Sakshi
Sakshi News home page

పుట్టి ముంచుతున్న ప్రాజెక్టులు

Published Sat, Apr 21 2018 11:31 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

Smart City Mission In Visakhapatnam Making Money Consuming - Sakshi

కార్పొరేషన్‌లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.. ఆదాయ వనరులు పెరగడం లేదు. పోనీ.. చేస్తున్న ఖర్చులైనా సక్రమంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఏదో ఒక ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడం.. నచ్చిన సంస్థకు ఆ ప్రాజెక్టుని అప్పగించడం.. జీవీఎంసీ ఖజానా నుంచి కోట్ల రూపాయలు కట్టబెట్టడం. గత మూడేళ్లుగా ఇదే తంతు. ఇలాగైతే.. కార్పొరేషన్‌ పుట్టి మునిగిపోవడం ఖాయం. చివరికి ప్రజలకు కచ్చితంగా ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలంటే ఒక్క రూపాయీ మిగలదేమో..!
– ఇటీవల ఓ జీవీఎంసీ అధికారి అన్న మాటలివి..

ఆయన మాటల్లో కించిత్తయినా అవాస్తవం లేదు. ప్రస్తుతం జీవీఎంసీలో జరుగుతున్న తీరును పూసగుచ్చినట్లు చెప్పారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో పైసా పైసా కూడబెట్టుకొని మహా నగరాన్ని అభివృద్ధి చేస్తున్న నగరపాలక సంస్థ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల అప్పుల పాలవుతోంది. స్మార్ట్‌ సిటీ, అమృత్‌ నగరమంటూ ప్రకటించి.. పప్పుబెల్లాలు చేతికిచ్చి మిగిలిన సొమ్ము పెట్టుబడి పెట్టి చేస్తున్న ప్రాజెక్టులు ఖజానాను ఊడ్చేస్తున్నాయి. తాజాగా.. హైబ్రిడ్‌ సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్రాజెక్టు కూడా అదే కోవలోకి వస్తోంది. అసలే అప్పుల్లో ఉన్న నగరంపై అదనంగా రూ.150 కోట్ల భారం వేస్తోంది.

విశాఖ సిటీ : మహా విశాఖ నగర పాలక సంస్థకు కొత్త ప్రాజెక్టులు తలబొప్పి కట్టిస్తున్నాయి. అరకొర నిధులు మంజూరు చేసి మిగిలిన మొత్తాన్ని కార్పొరేషన్‌ భరించుకొని పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాలను ఆధునికీకరణ, స్వచ్ఛత పేరుతో స్మార్ట్‌సిటీ, అమృత్‌ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. వీధులు సర్వాంగ సుందరంగా, నగరంలోని ఓ ప్రాంతం సాంకేతిక రూపు సంతరించుకునేలా స్మార్ట్‌సిటీ, నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఉద్యానవనాల పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్‌ 

పథకాలను ప్రవేశపెట్టింది. పేరుకే కేంద్ర ప్రభుత్వ పథకాలైనా.. ఖర్చులో సింహభాగం కార్పొరేషన్‌దే కావడం గమనార్హం. ఈ పథకాల కారణంగానే జీవీఎంసీ ఖజానా ఖాళీ అవ్వడం ప్రారంభమైంది. అమృత్‌ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 33.33 శాతం నిధులు మా త్రమే అందిస్తుంది. అంటే అమృత్‌ పథకం కింద జీవీఎంసీ పరిధిలో రూ.250 కోట్లు పనులు చేపట్టాలని టెండర్లు ఖరారు చేశారు. అయితే ఇందులో కేంద్రం ఇచ్చేది రూ.83 కోట్లు కాగా, జీవీఎంసీపై రూ.167 కోట్ల భారం పడుతోంది. 

సివరేజ్‌... గ్రేటర్‌ నిధులు బ్రేవ్‌
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా 2007లో రూ.244 కోట్ల అంచనాతో 320 కిలోమీటర్ల పొడవునా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ (యూజీడీ) వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటిని అనుబంధంగా కార్పొరేషన్‌ పరిధిలో ఉత్పన్నమయ్యే మురుగునీటిని శుద్ధి చేసేందుకు సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నరవలో 108 ఎంఎల్‌డీ సామర్థ్యంతో అతిపెద్ద ఎస్‌టీపీ నిర్మాణం పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు 50 శాతం మా త్రమే పూర్తయ్యాయి. మరోవైపు.. ఈ సివరేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్లు నిర్వహణకు జీవీఎంసీ తల ప్రాణం తోకకొస్తోంది. వీటికి విద్యుత్‌ సరఫరా కోసం హెచ్‌టీ పవర్‌ సప్లై అవసరమవుతోంది. నిర్వహణ వ్యయం తడిసి మోపెడై కార్పొరేషన్‌ ఖజనాను ఖాళీ చేసేస్తోంది. 

జీవీఎంసీ నెత్తిన హైబ్రిడ్‌ ఎస్‌టీపీ శఠగోపం
ఉన్న సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లతోనే సతమతమవుతున్న కార్పొరేషన్‌కు తాజాగా ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసిన మరో హైబ్రిడ్‌ ఎస్‌టీపీ ప్రాజెక్టు గుదిబండలా మారనుంది. రూ.762 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో తొలి విడతగా రూ.412కోట్లతో పెందుర్తిలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నరవలో సగం పనులు పూర్తయిన ఎస్‌టీపీని ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయాలని కార్పొరేషన్‌ భావిస్తోంది. రూ.412 కోట్లలో రూ.150 కోట్లు జీవీఎంసీ భరించాల్సింది. అప్పోసొప్పో చేసి ప్లాం టు పూర్తి చేసిందే అనుకున్నా.. ఈ భారీ ఎస్‌టీపీ నిర్వహణ ఖర్చుల మోత మోగిపోనుంది. ఈ హైబ్రిడ్‌ సివరేజ్‌ ట్రీ ట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్వహణకు ఏడాదికి రూ.100 కోట్లు అ య్యే అవకాశముందని జీవీఎంసీ అంచనా వేస్తోంది.

అప్పుల ఊబిలోకి వెళ్లే ప్రమాదం
ఈ ప్రాజెక్టులు ప్రారంభించాలంటే కార్పొరేషన్‌ అప్పుల బాట పట్టాల్సిందే. కొన్నేళ్లుగా ఆదాయ వనరులు పెరగకపోవడంతో... ఉన్న వాటితోనే సర్దుకుపోతున్న పరిస్థితి.  రెండేళ్ల క్రితం వరకూ రూ.400 కోట్లు అప్పుగా ఉండగా.. ప్రస్తుతం వాటిని సగం మేరకు తీర్చేశారు. మిగిలిన రూ.198 కోట్లను చెల్లించేందుకు మూడు నెలలకోసారి రూ.3 నుంచి 4 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగిలిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పనులు పూర్తి చేసేందుకు రూ.75 కోట్లు అప్పు తీసుకునేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఇటీవలే జీవీఎంసీ అధికారులు లేఖ రాశారు.  మరోవైపు.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో రూ.100 కోట్ల 14 వఆర్థిక సంఘం నిధుల్నీ కేంద్రం నిలిపేసింది.

ఇవి వస్తాయన్న దీమాతో అభివృద్ధి పనులు పూర్తి చేసిన కార్పొరేషన్‌.. ఇప్పుడు దిక్కులు చూస్తూ.. జనరల్‌ ఫండ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. జీవీఎంసీకి వచ్చే ఆదాయ వనరుల్లో ప్రధానంగా ఉండే ఆస్తి పన్ను రూ.200 కోట్లు ఉద్యోగుల జీతాలకు సరిపోతున్నాయి. టౌన్‌ ప్లానింగ్‌ నుంచి రూ.100 కోట్లు, నీటి సరఫరా నుంచి సుమారు రూ.50 కోట్లు ఆదాయం వస్తున్నా.. సాధారణ పనులకు సరిపోతున్నాయి. 2007 నుంచి ఆస్తి పన్నుని, 2012 నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల్ని పెంచలేదు. వీటిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని నిరోధిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రెండేళ్లలో గ్రేటర్‌ మళ్లీ రూ.400 కోట్ల అప్పుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితే ఎదురవుతుందని జీవీఎంసీ అధికారిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ప్రజల అవసరాల కోసమే..
ప్రస్తుతం కార్పొరేషన్‌ పరిధిలో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులూ ప్రజల అవసరాల కోసమే చేపట్టాం. ప్రస్తుతం ఉన్న నిధులతో పనులు నిర్వహిస్తున్నాం. స్మార్ట్‌ సిటీ అన్నప్పుడు ఖర్చులు తప్పవు. ప్లాంట్‌ ద్వారా శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలకు అమ్మగా వచ్చిన నిధులతో ప్లాంట్‌ నిర్వహణ జరుగుతుంది. నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్‌ నిధులు ఖర్చు చెయ్యాలి. ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉంది.
– హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement