మరో హైదరాబాద్‌గా సిద్దిపేట | Siddipet as another hyderabad | Sakshi
Sakshi News home page

మరో హైదరాబాద్‌గా సిద్దిపేట

Published Mon, Nov 4 2013 11:41 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

Siddipet as another hyderabad

సిద్దిపేట/నంగునూరు, న్యూస్‌లైన్: సాగునీరు.. రైలు మార్గం.. జిల్లా కేంద్రం దరిచేర్చి సిద్దిపేటను రెండున్నరేళ్లలో పురోగమింపజేస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హామీ ఇచ్చారు. నంగునూరు మండలంలో సోమవారం పర్యటించిన ఆయన... అడుగడుగునా జన‘నీరాజనం’ అందుకున్నారు. కోనాయిపల్లి, ఖాతా, అక్కెనపల్లి సభల్లో  ప్రసంగించారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మూడు లక్షల ఎకరాల్లో సిరులు పండించేలా 35 టీఎంసీల గోదావరి జలాలను రప్పిస్తామన్నారు. సిద్దిపేటకు పశ్చిమ దిశలో కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ జిల్లాలోని వల్లంపట్ల మిడ్‌మానేరు ఇందుకు దోహదం చేస్తోందన్నారు. తడ్కపల్లి వద్ద నిర్మించదల్చిన రిజర్వాయర్‌తో ఆ గ్రామంతోపాటు మరే ఊరు కూడా ముంపునకు గురికావన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే సిద్దిపేట మీదుగా రైలు మార్గానికి మంజూరు సాధించానన్నారు.

సీమాంధ్ర ముఖ్యమంత్రుల వల్లే ప్రగతి కుంటుపడిందని పేర్కొన్నారు. నిజానికి హైదరాబాద్-కరీంనగర్ ైరె ల్వే లైనుగా పరిగణించాల్సి ఉందని, అయితే మనోహరాబాద్-కొత్తపల్లి రైలుమార్గంగా రికార్డుల్లో ఉందన్నారు. ఇదెలా ఉన్నా.. సిద్దిపేట మీదుగా రైలు కూత వినే రోజొస్తుందని జనం హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. 150 కిలోమీటర్ల దూరాన ఉన్న జిల్లా కేంద్రం సంగారెడ్డికి వెళ్లడమనేది చాలా కష్టంతో కూడుకున్నదంటూ జనం బాధల్ని ఆయన ప్రస్తావించారు. అందుకే సిద్దిపేటను జిల్లా కేంద్రం చేయిస్తామని, అలాగే మెదక్ కూడా మరో  జిల్లాగా ఆవిర్భవిస్తుందన్నారు. లైట్ రైల్  ట్రాన్స్‌పోర్ట్ సిస్టం (ఎల్‌ఆర్‌టీఎస్)ను అందుబాటులోకి తెచ్చి.. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు 24 నిమిషాల్లో చేరుకునేలా రవాణా సామర్థ్యా న్ని సృష్టిస్తామన్నారు. నాలుగు లేన్లుగా ఉన్న రాజీవ్ రహదారిని ఆరు లేన్లుగా విశాలం చేయిస్తామని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి అనేది సిద్దిపేట నుంచే మొదలవుతోందన్నారు. సిద్దిపేటను మరో హైదరాబాద్‌గా చేసి తీరుతామన్నారు.
 నంగునూరు మండలానికి వరాలు
 నంగునూరు మండల ంతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అక్కెనపల్లి, ఖాతా, గట్లమల్యాల, ఘనపురం తదితర గ్రామాలతో మమేక మయ్యానన్నారు. శ్రమదానాలు, ఊళ్లల్లో నిద్రలు చేసిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. కోనాయిపల్లిలో రూ. 25 లక్షల వ్యయంతో కల్యాణ మండపాన్ని కట్టిస్తామన్నారు. వలసకుంటను పూర్తిస్థాయిలో నింపేలా ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేస్తామన్నారు.        
 తెలంగాణ ముద్దుబిడ్డ
 టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలోని నీటి వనరులు వెలవెలబోతున్నాయని, ఇందుకు సీమాంధ్ర పాలకుల పక్షపాత వైఖరే కారణమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సిద్దిపేట ముద్దుబిడ్డే కాదని, మొత్తంగా తెలంగాణ ముద్దుబిడ్డ అని శ్లాఘించారు. కేసీఆర్ వద్ద నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.
  కేసీఆరే స్ఫూర్తి
 స్థానిక ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటను ఆయా రంగాల్లో అభివృద్ధి చేయడంలో తనకు కేసీఆరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. చెక్‌డ్యాంల నిర్మాణాల్లో కేసీఆర్ తనకు ప్రేరణనిచ్చారని, ఆ ఫలితంగానే ఇప్పుడు సిద్దిపేట సెగ్మెంట్‌లో 40 చెక్‌డ్యాంలు మత్తడి దూకుతున్నాయని ప్రస్తావించారు.
 పునర్నిర్మాణానికి పునాది
 అక్కెనపల్లి, ఖాతా చెక్‌డ్యాంలు తెలంగాణ పునర్నిర్మాణానికి పునాదుల్లాంటివని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అభివర్ణించారు. రేపటి తెలంగాణ రాష్ట్రం నమూనాకు ఇవే ప్రతిబింబాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కేవీ.రమణాచారి, కడియం శ్రీహరి,  ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు కేసీఆర్ వెంట ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement