ఉచితం మేటలేస్తోంది! | Sand Policy derided | Sakshi
Sakshi News home page

ఉచితం మేటలేస్తోంది!

Published Tue, Apr 12 2016 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

ఉచితం మేటలేస్తోంది!

ఇసుక పాలసీ అపహాస్యం
ఓ ప్రైవేట్ కంపెనీ ఇష్టారాజ్యం
గుట్టలుగా ఇసుక డంప్
సరఫరా బాధ్యత అధికార పార్టీ నేతకు..
వాగులు, వంకలన్నీ ఖాళీ
  నోరు మెదపని అధికారులు

 
 ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
 అవసరానికి మాత్రమే ఇసుక తవ్వుకోవాలి. అంతకు మించి డంప్ చేస్తే సొంత పార్టీ వారున్నా వదిలిపెట్టొదు.
 
 జిల్లాలో ఏం జరుగుతోందంటే..
కళ్లెదుటే గుట్టలుగా ఇసుక మేటలు. అయినా అధికారుల మౌనం. ఎందుకంటే ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారం కావడమే.
 
ఆస్పరి సమీపంలో పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న ఓ ప్రైవేటు కంపెనీ ఆవరణలో ఇసుక దిబ్బ
 
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు:  ఉచిత ఇసుక పాలసీ అపహాస్యమవుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి హెచ్చరించినా తమ్ముళ్లు పెడచెవిన పెడుతున్నారు. రీచ్‌ల్లో పెత్తనం చెలాయిస్తూ దోపిడీకి తెరతీస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక డంప్ చేస్తూ దోచుకుంటున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరికి సమీపంలో పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న ఒక ప్రైవేటు కంపెనీ గుట్టలు గుట్టలుగా ఇసుకను డంప్ చేస్తోంది. ఈ ప్లాంటుకు ఇసుకను సరఫరా చేస్తోంది అధికారపార్టీ నేత కావడంతో అధికారులు కూడా కిమ్మనడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రైవేటు కంపెనీ చేస్తున్న వ్యవహారంతో చుట్టుపక్కల వాగులు, వంకలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇది అంతిమంగా భూగర్భజలాలు ఇంకిపోయి సమీపంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


 వాగులు, వంకలు ఖాళీ
వాస్తవానికి ఆస్పరికి సమీపంలో ప్రభుత్వం గుర్తించిన అధికారిక ఇసుక రీచ్‌లు లేవు. గతంలో హొళగుంద వద్ద అధికారిక ఇసుక రీచ్ ఉండేది. అయితే, ఇది కూడా తాజాగా రద్దయింది. జిల్లాలో ప్రస్తుతం నాలుగు ఇసుక రీచ్‌లు మాత్రమే అధికారికంగా నడుస్తున్నాయి. అవి.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గురజాల, కర్నూలు మండలంలోని ఆర్.కొంతలపాడు, దేవమాడ-పడిదెంపాడు, పత్తికొండ నియోజకవర్గంలోని కనకదిన్నె.

ఇక వాగులు, వంకలల్లో ఇసుక తవ్వకాలను చేపట్టవచ్చననేది ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీగా ఉంది. దీనిని ఆసరా చేసుకుని సమీపంలోని వాగులు, వంకలన్నింటినీ సదరు ప్రైవేటు కంపెనీ అవసరాల కోసం ఇసుకను ఖాళీ చేస్తున్నారు. ఈ ఇసుక సరఫరా కాంట్రాక్టు కాస్తా అధికార పార్టీ నేతకు ఇవ్వడంతో మొత్తం వ్యవహారాన్ని సాఫీగా సాగిస్తున్నారని సమాచారం. అందుకే అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది.
 
ఇసుక దందాలో..
వాస్తవానికి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రకటించిది. దీంతో ఏ పనికైనా అవసరం మేరకు ఉచిత ఇసుకను తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే, ఇందుకు భిన్నంగా ఆస్పరి సమీపంలోని ప్రైవేటు కంపెనీ.. గుట్టలు గుట్టలుగా ఇసుకను పొగేసుకుంటోంది. తమ పని సాఫీగా సాగేందుకు వీలుగా అధికార పార్టీ నేతలకు ఇసుక సరఫరా కాంట్రాక్టును అప్పగించింది. దీంతో అడ్డూఅదుపు లేకుండా రాత్రి, పగలు ఇసుకను తోడేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఏ మాత్రం అడ్డుచెప్పని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కలగజేసుకుని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement